బాబు బాటలో జనసేనాని, మరోసారి యూటర్న్

ఏపీలో ప్రతిపక్ష నేత చంద్రబాబుకి దత్తపుత్రుడిగా ఇప్పటికే పవన్ కళ్యాణ్ మీద విమర్శలున్నాయి. అందుకు తగ్గట్టుగానే జనసేనాని అడుగులు ఉన్నాయి. సామాన్యులతో పాటు జనసేన శ్రేణుల్లోనూ ఈ పరిణామాలు సందేహాలు పెంచుతున్నాయి. ప్రభుత్వ విధానాల విషయంలో వారిద్దరి వైఖరి ఒకే రీతిలో ఉండడమే దానికి కారణం. తొలుత జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు విమర్శలు గుప్పిస్తారు. ఆ వెంటనే పవన్ కూడా ఆ తీరునే స్పందిస్తారు. కొద్దికాలానికే చంద్రబాబు యూటర్న్ తీసుకుంటారు. పవన్ కూడా ఆయన్ని అనుసరిస్తారు.
ఇప్పటికే ఇంగ్లీష్ మీడియం వంటి విషయాల్లో ఇది ప్రస్ఫుటం అయ్యింది. తొలుత మాట్లాడిన దానికి భిన్నంగా చివరకు ఇంగ్లీష్ విద్యాబోధనకు తాము వ్యతిరేకం కాదని చంద్రబాబు ప్రకటన చేశారు. ఆ వెంటనే పవన్ కూడా తాము ఇంగ్లీష్ విద్యను వ్యతిరేకించలేదని చెప్పుకొచ్చారు. ఇలా ఇద్దరు నేతలు వరుసగా యూటర్న్ తీసుకున్న తీరు చాలామందిని ఆశ్చర్యపరిచింది. అయినా వారి ధోరణి మారలేదని మరోసారి రుజువయ్యింది. ఇప్పటికే కర్నూలు హైకోర్ట్ విషయంలో చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారు. తొలుత అమరావతి నుంచి కదిలించకూడదని ఆయన డిమాండ్ చేశారు. రకరకాల ప్రయత్నాలతో కొర్రీలు వేసేందుకు చూశారు. విజయవాడ నుంచి కర్నూలు వెళ్ళాలంటే ఎంత దూరాభారమో అంటూ మ్యాపులతో టీడీపీ అనుకూల మీడియా ప్రయత్నాలు చేసింది. అన్నీ చేసినా చివరకు ప్రభుత్వం పట్టుదలతో చేస్తున్న ప్రయత్నాల కారణంగా ప్రతిపక్ష నేత యూటర్న్ తీసుకుని కర్నూలుకి తాము వ్యతిరేకం కాదని చెప్పాల్సి వచ్చింది.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ వంతు వచ్చింది. తాజాగా కర్నూలు జిల్లా కి చెందిన పార్టీ కార్యకర్తల సమావేశంలో పవన్ కూడా అదే ప్రకటన చేశారు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ పదే పదే మాట మారుస్తూ చంద్రబాబుని మించిపోతున్నారా అనే అభిప్రాయం రాజధాని విషయంలో కలుగుతోంది. తొలుత రాజధాని ఎక్కడ పెట్టినా అభ్యంతరం లేదని, కానీ అన్ని విభాగాలు ఒకే చోట ఉండాలని ఆయన డిమాండ్ చేశారు. మూడు రాజధానులకే తాము వ్యతిరేకం అంటూ అమరావతి, విశాఖ, కర్నూలు ఎక్కడైనా తాము మద్ధతిస్తామని ప్రకటించారు. కానీ ఆవెంటనే అమరావతి నుంచి రాజధాని తరలించకూడదని డిమాండ్ చేశారు. అక్కడే అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. అమరావతి రైతులకు అండగా ఉంటామని కూడా చెప్పారు. తీరా చూస్తే తాజాగా ఏపీలో అభివృద్ధి జరుగుతుందంంటే జనసేన అడ్డు చెప్పదని వ్యాఖ్యానించారు. మూడు రాజధానుల వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని చెబుతూనే కర్నూలులో హైకోర్ట్ ని తాము స్వాగతిస్తున్నామన్నారు. తద్వారా మరోసారి యూటర్న్ తీసుకున్నట్టుగా స్పష్టం అవుతోంది. చంద్రబాబుని ఫాలో అవుతున్నారనే వాదనకు బలం చేకూరుతోంది.
జనసేనకి రాజకీయంగా ఒక విధానం లేకుండా గాలివాటుగా వ్యవహరిస్తున్నారా అనే గందరగోళం కూడా నెలకొంది. ఇప్పటికే ఆయన బీజేపీతో చేతులు కలిపి, రాజధానిని కదలించబోమని ప్రకటించారు. లాంగ్ మార్చ్ కూడా చేస్తామన్నారు. కానీ ఇప్పుడు అవన్నీ మరచిపోయినట్టు కనిపిస్తోంది. రాజధాని ప్రాంతంలో మరో పర్యటనకు సిద్ధమని జనసేన ప్రకటనలు చేసింది. కానీ తీరా చూస్తే ఇప్పుడు పర్యటన కర్నూలు వైపు మళ్లింది. అది కూడా బీజేపీ తో కలిసి కాకుండా ఒంటరిగా పవన్ వెళుతుండడం మరో విశేషం. ఇరు పార్టీల కార్యక్రమాలు కలిసే చేపడతామని ప్రకటించి ఇప్పుడు పవన్ ఒంటరిగా కర్నూలు వైపు వెళ్లడానికి కారణాలేంటా అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. మొత్తంగా పవన్ పదే పదే మాట మారుస్తున్న తీరు మాత్రం పరువు తీసే స్థాయికి చేరుతోందనే అభిప్రాయం ఆపార్టీ వర్గాల్లోనే కలుగుతోంది.


Click Here and join us to get our latest updates through WhatsApp