తిరుప‌తి బై పోల్ : బీజేపీకి దెబ్బ మీద దెబ్బ‌!

By Kalyan.S Apr. 12, 2021, 08:00 am IST
తిరుప‌తి బై పోల్ : బీజేపీకి దెబ్బ మీద దెబ్బ‌!

ఏపీ బీజేపీ అధ్య‌క్షుడిగా సోము వీర్రాజు బాధ్య‌త‌లు చేప‌ట్టాక రాష్ట్రంలో చ‌క్రం తిప్పేందుకు త‌న అనుభ‌వాన్ని అంతా ఉప‌యోగించాల‌ని భావించారు. రంగంలోకి దిగీ దిగ‌గానే తొలుత ఏపీలో అతిపెద్ద సామాజిక వ‌ర్గాన్ని ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశారు. అనంత‌రం జిల్లాల వారీగా రివ్యూలు చేప‌డుతూ.. చేప‌ట్టిన పార్టీ బ‌ల‌హీనంగా ఉన్న చోట స్థానికంగా కాస్త పేరున్న టీడీపీ నేత‌ల‌ను బీజేపీలోకి ఆక‌ర్షించే ప్ర‌య‌త్నం చేసి విజ‌యం సాధించారు. అలాగే, రాష్ట్రంలోని ఘ‌ట‌న‌ల‌పై టీడీపీ కంటే ఎక్కువ‌గా స్పందిస్తూ రాజ‌కీయాల‌కు ఆజ్యం పోశారు. ఏపీలో బీజేపీ పేరు వినిపించేలా హ‌డావిడి సృష్టించే ప్ర‌య‌త్నాలు చేశారు. సోము చ‌ర్య‌ల ద్వారా కేడ‌ర్ లో కూడా ఉత్సాహం పెరిగింది. బ‌ల‌ప‌డే అవ‌కాశాలు ఉన్నాయ‌న్న ఆలోచ‌న రేకెత్తించింది. ఎన్నిక‌ల రంగంలోకి దిగితే కానీ త‌మ స‌త్తా ఏంట‌నే విష‌యం బ‌య‌ట ప‌డ‌లేదు. పంచాయ‌తీ, మున్సిపోల్స్ ఎలాగున్నా తిరుప‌తి బై పోల్ లో అయినా ప్ర‌భావం చూపాలనుకునే బీజేపీకి ఏదీ క‌లిసి రావ‌డం లేద‌న్న‌ట్లుగా ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి.

తిరుప‌తి ఉప ఎన్నిక‌ను దృష్టిలో ఉంచుకుని సోము వీర్రాజు అది నుంచీ రాజ‌కీయాలు చేస్తున్నారు. త‌న మ‌కాన్ని తిరుప‌తికి మార్చి మ‌రీ టార్గెట్ పెట్టారు. ఇంత‌లో కేంద్ర నిర్ణ‌యాలు ఒక్కొక్క‌టిగా అశ‌నిపాతంగా మారాయి. ప్రత్యేక హోదా, విభజన హామీలు, విశాఖ జోన్ఇ, స్టీల్ ప్లాంట్ అంశాల్లో కేంద్రం తీసుకున్న నిర్ణ‌యాల ప్ర‌భావం ఏపీ బీజేపీ పై ప‌డింది. ఆ లోటును పూడ్చుకోవ‌డానికి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ను తిరుప‌తిలో ఎక్కువ‌గా వినియోగించుకోవాల‌ని భావించింది. ఈ నేప‌థ్యంలో ప‌దే ప‌దే ఆయ‌న‌ను క‌ల‌వ‌డం, కోర‌డం చేస్తూ ఉన్నారు సోము. కొద్ది రోజుల క్రితం జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో ప‌వ‌న్ పాల్గొని ప్ర‌భుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు. ఆయ‌న వ్యాఖ్య‌లు, విమ‌ర్శ‌ల‌లో ప‌స ఎలాగున్నా బీజేపీ శ్రేణుల‌కు మాత్రం కాస్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఆయ‌న వ‌చ్చి వెళ్లిన త‌ర్వాత జ‌న‌సేన స్థానిక నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు కూడా ప్ర‌చారంలో పాల్గొన‌డం మొద‌లుపెట్టారు. దీంతో ప్ర‌చారం ముగింపు చివ‌రి రోజుల్లో ప‌వ‌న్ ను వినియోగించుకోవాల‌ని ఆ పార్టీ నేత‌లు భావించారు. దీనిలో భాగంగానే ఆయ‌న‌ను కూడా ఒప్పించారు.

ఇప్పుడు క‌రోనా క‌ల‌క‌లంతో ప‌వ‌న్ రాకపై నీలిమేఘాలు అలుముకున్నాయి. ఇది బీజేపీ శ్రేణుల్లో ఒకింత ఆందోళ‌న‌ను క‌లిగిస్తోంది. "బిజెపి-జనసేనల విజయయాత్రను ప్రారంభించడానికి విచ్చేస్తున్న బిజెపి జాతీయ అధ్యక్షులు శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా గారికి, జనసేనాధిపతి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, కేంద్ర విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి శ్రీ మురళీధరన్ గారికి స్వాగతం - సుస్వాగతం అంటూ క‌రోనా క‌ల‌క‌లానికి ముందు సోము వీర్రాజు ఉత్సాహంగా ట్వీట్ చేశారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నారు. ఆయన కార్యనిర్వాహకులు, భద్రతా సిబ్బంది, వ్యక్తిగత సిబ్బందిలో చాలామంది కరోనా బారిన పడడంతో వైద్యుల సలహా మేరకు ముందు జాగ్రత్త చర్యగా పవన్ కల్యాణ్ క్వారంటైన్‌లోకి వెళ్లినట్లు జనసేన పార్టీ ఓ ప్రకటనలో పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో సభకు పవన్ కల్యాణ్ హాజరు కావడంపై అనుమానాలు నెలకొన్నాయి.

ప్ర‌చారం ముగింపు రోజుల్లో ప‌వ‌న్ చ‌రిష్మా లేక‌పోతే ఆ ప్ర‌భావం ఎన్నిక‌ల‌పై ప‌డే అవ‌కాశం ఉంద‌ని బీజేపీ వ‌ర్గాలు భావిస్తున్నాయి. ఇప్పుడు ప‌వ‌న్ రాక‌పై సందిగ్ధం ఉన్న నేప‌థ్యంలో జ‌న‌సైనికులైనా క‌లిసి వ‌స్తారా లేదా అన్న అనుమానాలు బీజేపీ శ్రేణుల‌ను వెంటాడుతున్నాయి. పవన్ ఉంటే జనసందోహానికి తిరుగు ఉండదు. పవర్ స్టార్ లేకుండా నిర్వహించే సభకు.. జనసమీకరణ పెద్ద సమస్యగా మారుతుందనే మ‌రో సందేహం వారిని వెంటాడుతోంది. ఏమైనా పవన్ క్వారంటైన్.. కమలనాథులకు కొత్త చిక్కుల్లోకి నెట్టిందని చెప్పక తప్పదు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp