ప్రశ్నకు బదులేదీ? నీమాటకు విలువేదీ?

By KalaSagar Reddy Dec. 15, 2019, 10:08 pm IST
ప్రశ్నకు బదులేదీ? నీమాటకు విలువేదీ?

ఒక వ్యవస్థ పతనం ప్రపంచం మొత్తానికి కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది . కానీ ఆ వ్యవస్థ స్థాపకునికి లేదా నిర్వాహకునికి మాత్రం చివరి క్షణం వరకూ పూర్తిగా దిక్కుతోచని స్థితిలోకి జారిపోయేవరకూ అర్థం కాదు. అర్థం చేసుకోగలిగితే ఆ వ్యవస్థ పతనం కాదు.

"పవన్ కళ్యాణ్" కొందరికి ఆరాధ్యనీయం , కొందరికి అవసరానికి ఆయుధం , మరికొందరికి అసహనం , వెరసి అతనో వివాదాస్పదం. నెలకో మాట , వారానికో వివాదం అతని నైజం అని చెప్పొచ్చు.

2009 లో అన్న చిరంజీవి వెంట రాజకీయ అడుగులు వేసిన పవన్ కాంగ్రెస్, టీడీపీ లపై సంచలన వ్యాఖ్యలు చేసాడు. టీడీపీ అవినీతి పుత్రిక అన్నాడు. కాంగ్రెస్ వాళ్ళని పంచెలూడతీసి కొడతా అన్నాడు. ఫలితాల తర్వాత ప్రజారాజ్యం కనుమరుగైంది.

2014 అన్నని వదిలేసి సొంతంగా జనసేన పెట్టాడు. ప్రశ్నించడానికే పార్టీ అన్నాడు, అవినీతి పుత్రిక అని తాను తిట్టిన టీడీపీతో, బీజేపీతో జత కట్టాడు, అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అంటకాగాక అప్పటివరకూ మర్చిపోయిన 14 నాటి హామీలు గుర్తొచ్చాయి, మళ్లీ టీడీపీని, బీజేపీని విమర్శించి కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకొని ఎన్నికల సమరభేరి మోగించాడు.

2009 లో చిరంజీవికి 70 లక్షల పై చిలుకు ఓట్లు రాగా అదే సినీ బలంతో బరిలో దిగిన పవన్ కేవలం 16 లక్షల ఓట్లతో సరిపెట్టుకొన్నాడు. అంతే కాక తాను పోటీ చేసిన రెండు చోట్లా ప్రజల విశ్వాసం పొందలేక ఓటమి పాలయ్యాడు. కేవలం ఒక్క mla సీటు గెలుచుకొన్నా అదీ స్థానిక అభ్యర్థి బలం అనే విశ్లేషకుల మాటలు పుండు మీద కారం చల్లాయి అని చెప్పొచ్చు.

ఎన్నికల ముందు జగన్ ని సీఎం కానివ్వను అనే ప్రగల్భాలు విఫలం అవ్వడం , కనీసం 25 నుండి 30 సీట్లు వచ్చినా కర్ణాటక తరహాలో టీడీపీని అడ్డు పెట్టుకొని అధికారం పొందచ్చోనే ఆశలు ఆవిరి కావడం , స్వయంగా తాను రెండు చోట్లా ఓడిపోయి అసెంబ్లీ మెట్లెక్కలేకపోవడం , తనను తాను సమవుజ్జీగా ఊహించుకొన్న సమ వయస్కుడు జగన్ తో ఏ దశలోనూ పోటీపడలేక దారుణ ఓటమికి గురవ్వడం పవన్ లో తీవ్ర అసహనాన్ని రేకెత్తించాయి అని చెప్పొచ్చు. ఇందుకు పవన్ స్వయంకృతపరాధం తప్ప మరెవరూ కారణం కాదు . ప్రశ్నించడానికి పార్టీ పెట్టానన్న పవన్ ఏ రోజూ ప్రజల ప్రశ్నలకి కానీ , రాజకీయ పక్షాల ప్రశ్నలకి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయకపోవడం కూడా ఓ కారణం కావొచ్చు.

Also Read: పత్రికా రంగంలో ముగిసిన అధ్యాయం ...

గత ఐదేళ్లూ పార్ట్ టైం పాలిటిక్స్ మాత్రమే అదీ టీడీపీ కొమ్ము కాయాల్సి వచ్చినప్పుడు మాత్రమే ప్రజల్లో కనపడ్డ పవన్ ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా ప్రభుత్వ పక్షాన ప్రతిపక్షం పై విమర్శలు గుప్పించిన తీరు ప్రజలు గమనిస్తూనే ఉన్నారు . వారికి కావలసింది తమ పక్షాన ప్రభుత్వాన్ని నిలదీసేవాడు కానీ అధికార పక్షాన నిలబడి ప్రజల కోసం పోరాడే ప్రతిపక్షాన్ని విమర్శించేవాడు కాదన్న అతి ముఖ్యమైన ప్రాథమిక రాజకీయ సూత్రాన్ని విస్మరించాడు పవన్ . బహుశా ఈ చర్యలే పార్టీ సిద్ధాంతకర్త రాజా రవితేజ మనస్తాపానికి కారణమయ్యుంటాయి.

ఎన్నికల తర్వాత సైతం జరిగిన తప్పులు , లోపాలు విశ్లేషించుకోకుండా జగన్ పై అసహనం ప్రదర్శిస్తూ రావడం , టీడీపీ తో విడిపోకుండా ఉంటే జగన్ గెలిచేవాడు కాదు అని వ్యాఖ్యానించడం , ఢిల్లీలో రహస్య మంతనాలు జరిపి బీజేపీలో జనసేనని విలీనం చేస్తున్నాడనే సంకేతాలు ఇస్తూ కుల మత విద్వేషాలు పెంచే విధంగా చేస్తున్న ప్రసంగాలు చూస్తే పాతాళంలోకి దిగజారాడానికి మెట్లు దిగితే ఆలస్యం అవుతుందని పారచూట్ కట్టుకు దూకుతున్నట్టు ఉంది.

ఈ క్రమంలో ఒక మాటకి మరో మాటకి పొంతన లేకపోవడం , గతంలో తీవ్రంగా విమర్శించిన వారితో సైతం సంబంధాల కోసం తహతహలాడడం , కేవలం వైసీపీని తిట్టటమే ధ్యేయంగా అసత్య ఆరోపణలు చేస్తుండడం చూసి ఇన్నాళ్లు తన వెంట నమ్మకంగా నిలిచిన వారు సైతం దూరం తొలగిపోయే పరిస్థితి తనే కల్పిస్తున్నాడు.

దీనికి పరాకాష్ట టీడీపీ ప్రోత్సాహంతో తన తల్లిని , ఇతర మహిళా కుటుంబ సభ్యుల్ని పత్రికలకు లాగి అవమానించారని ఆవేదన వ్యక్తం చేస్తూ వరుస ట్వీట్లతో ABN , TV9 లని బ్యాన్ చేయమని తన అభిమానులకు , ప్రజలకు విజ్ఞప్తులు చేసిన వ్యక్తి కొంత కాలానికి abn ప్రసారాలు ఆపటం సమంజసం కాదు అని స్టేట్మెంట్ ఇచ్చిన రోజు నివ్వెరపోవడం ప్రజల వంతు అయ్యింది . చివరికి ఈ రోజు అదే ABN కి ఇంటర్వ్యూ ఇవ్వడం వీర అభిమానులు సైతం సమాధానము చెప్పుకోలేక తలలు దించుకోవడానికి , పార్టీ నేతలు సమాధానం చెప్పలేక అసహనం వ్యక్తం చేయడానికి కారణం అయ్యింది.

ఇలాంటి ఎన్నో బహిరంగ , అంతర్గత కారణాలతో నీడలా వెన్నంటి ఉన్న సహచరులు , వీరాభిమానులు ఒక్కొక్కరుగా జనసేనానిని వదిలి పోవడం మొదలయ్యింది. మొన్న జనసేన తరుపున పోటీ చేసిన ఎమ్మెల్యే , ఎంపీ అభ్యర్థులు ఎంత మంది పార్టీతో ఉన్నారు అంటే పట్టుమని పది పేర్లు చెప్పలేని పరిస్థితి సేనానిది.

Also Read: రాజధానిలో బయటపడ్డ మాజీ మంత్రుల బినామీ అసైన్డ్ భూముల భాగోతం

ఇహ నమ్మకస్తులనుకొన్న వారిలో కూడా పవన్ కల్యాణ్ కుల మతాల మద్య చిచ్చు పెట్టే విద్వేషపూరితమైన రాజకీయం చూసి ఇటీవల
అనకాపల్లి చింతల పార్ధసారధి ,
పెందుర్తి చింతలపూడి వెంకటా రామయ్య ,
రాజమండ్రి ఆకుల సత్యనారాయణ ,
పత్తిపాడు రావెల కిషొర్ బాబు ,
కావలి పసుపులేటి సుధాకర్ ,
కృష్ణ జిల్లా పాలడుగు డేవిడ్ ,
కోశాధికారి మారెంశెట్టి రాఘవయ్య ,
తంబల్లపల్లి విశ్వం ప్రభాకర్ రెడ్డి ,
తణుకు పసుపులేటి రామారావు ,
స్పోక్స్ పర్సన్ అద్దెపల్లి శ్రీధర్
వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి - రాజు రవితేజలు వరుసగా రాజీనామా చేయగా , ఏకైక ఎమ్మెల్యే రాపాక కూడా పవన్ విధానాలపై బహిరంగ విమర్శలు చేస్తూ ఇవ్వాలో రేపో గోడ దూకేట్లు ఉన్నాడు. ఇహ తర్వాత అపూర్వ స్నేహితుల్లా కలిసి తిరుగుతున్న నాదెండ్ల వంతు అని మీడియాలో రూమర్స్ చెలరేగుతున్నాయి . చివరికి బీజేపీలో చేరేనాటికి , లేదా టీడీపీతో , బీజేపీతో జట్టు కట్టేనాటికి నాగబాబు అయినా ఉంటాడా అంటే అనుమానమే.

చిరంజీవి రాజకీయాల్లో నుండి తప్పుకొన్నా హుందాతనాన్ని కోల్పోలేదు . తప్పుకోక ముందే విలువ కోల్పోతున్న పవన్ మళ్లీ తన భవితవ్యం సినీరంగంలోనే వెతుక్కొక తప్పదేమో.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp