సినీ ఫంక్షన్ నుంచి పొలిటికల్ కామెంట్స్ తో పవన్ ఏం ఆశించినట్టు

By Raju VS Sep. 26, 2021, 09:30 am IST
సినీ ఫంక్షన్ నుంచి పొలిటికల్ కామెంట్స్ తో పవన్ ఏం ఆశించినట్టు


ఆయన పాల్గొన్నది సినిమా మీటింగ్. కానీ చేసింది పొలిటికల్ ప్రసంగం. ఇది స్పష్టత లేక చేశారా అంటే సందేహమే. ఉద్దేశపూర్వకంగానే రాజకీయ విమర్శలకు సినిమా వేదిక మీద చేసినట్టు కనిపిస్తోంది. కానీ పాలకపక్షం మాత్రం రాజకీయ కారణాలతో సినిమాల్లో జోక్యం చేసుకుంటుందని విమర్శిస్తున్నారు. తాను మాత్రం సినిమా వేదికల నుంచి రాజకీయ విమర్శలు చేయవచ్చు గానీ, ఎదుటి వాళ్లు రాజకీయాలు చేయకూడదని ఆశించడం పవన్ కళ్యాణ్ అవివేకాన్ని చాటుతోంది. ఏ ముల్లుని ఆ ముల్లుతోనే తీయాలనే నానుడి కూడా ఉంది. అధికారంలో ఉన్న వాళ్లు దానిని అనుసరించకూడదనుకోవడమే అసంబంద్ధం.

రిపబ్లిక్ సినిమా విషయంలో సాయి ధరమ్ తేజ్ ప్రమాదవశాత్తూ గాయపడిన తర్వాత ప్రచార బాధ్యతను మెగా కుటుంబం భుజాన వేసుకుంది. ఇప్పటికే చిరంజీవి, తాజాగా పవన్ కళ్యాణ్‌ వివిద రూపాల్లో ప్రచారం చేస్తున్నారు. అందులో తప్పుబట్టాల్సిన అవసరం లేదు. పైగా వారి కుటుంబంలో సభ్యుడి సమస్యను తాము బాధ్యతగా స్వీకరించడం అభినందించదగ్గ విషయం. కానీ సినిమా వేడుకలో పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం మాత్రం విమర్శలకు ఆస్కారమిస్తోంది. వాస్తవంగా ఆయన మాట్లాడింది తెలంగాణా గడ్డ మీద. నిజంగా సినిమా ప్రయోజనాలే ఆశిస్తే తెలంగాణా ప్రభుత్వ తీరుని తప్పుబట్టాలి. అతనే ప్రస్తావించిన నాని టక్ జగదీష్‌ సినిమాకు సంబంధించిన అభ్యంతరం వచ్చింది కూడా తెలంగాణా ఎగ్జిబిటర్ల నుంచే.

కానీ పవన్ విమర్శలు చేసింది ఏపీ ప్రభుత్వం మీద. ఏపీ ప్రభుత్వం గురించి మాట్లాడాలంటే ఏపీలో రాజకీయ కార్యక్రమాలకు హాజరయ్యి విమర్శలు చేస్తే జనం హర్షిస్తారు. కానీ హైదరాబాద్ లో కూర్చుని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద రాళ్లేద్దామని పవన్ ఆశించడం అర్థరహితంగా కనిపిస్తోంది. బహుశా ఆయన గడిచిన మూడు నెలల్లో ఏపీలో అడుగుపెట్టిందే ఒకటి రెండు రోజులు. మొఖం చూపించి మళ్లీ ఫ్లైటెక్కేశారు. కానీ ఏపీ ప్రభుత్వాన్ని మాత్రం విమర్శిస్తూ ఉంటారు. బహుశా పీకేకి అర్థంకానిది ఏమంటే తాను ఎక్కడో ఉంటే ఏపీలో ఏమీ పీకలేమనే విషయం బోధపడుతున్నట్టు లేదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద అంతగా ఆసక్తి ఉంటే ఏపీ నుంచే వ్యవహారం నడిపితే జనం హర్షిస్తారు. కానీ బాబు కి తోడుగా హైదరాబాద్ నుంచి ఏదో సాధిద్దామని అనుకోవడం అత్యాశ కాక ఏమవుతుంది.

పవన్ కళ్యాణ్‌ సినిమా ఉపన్యాసం రాజకీయ లక్ష్యాలకు వినియోగించుకోవడం సినీ పరిశ్రమకు గానీ, ఆ సినిమాకి గానీ మేలు చేసేలా కనిపించడం లేదు. అలాంటి పొలిటికల్ పోలరైజేషన్ సినిమా సాక్షిగా తీసుకురావాలని చూస్తే తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుందని ఎన్టీఆర్ కృష్ణ కాలం నుంచి ఉన్న అనుభవం. అయినప్పటికీ పవన్ కి చరిత్ర తెలియకపోవడం, వాటినుంచి పాఠాలు తీసుకునే అవకాశం లేకపోవడంతో తానేదో సినీ రంగాన్ని ఉద్దరిస్తున్నాననే భ్రమలో ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్టు కనిపిస్తోంది. ఏపీ ప్రభుత్వంతో సామరస్యంగా సమస్యల సాధన కోసం పలువురు పెద్దలు మంతనాలు జరుపుతుంటే వాటి లక్ష్యం నెరవేరకూడదనే లక్ష్యం పవన్ కి ఉందా అనే అనుమానం కూడా కలుగుతోంది. ప్రభుత్వం, సినీ పెద్దలు ఓ అంగీకారానికి రావడం ఇష్టం లేకపోవడంతోనే ఇలాంటి రచ్చ రాజేసి విషయాన్ని పక్కదారి పట్టించే పనిలో పడ్డారా అనే వాదన కూడా వినిపిస్తోంది. ఏమయినా పవన్ తీరుని సొంత అన్నయ్య చిరంజీవి సైతం అంగీకరించే పరిస్థితి లేదు. కాబట్టి పీకే ఎంత ప్రయాసపడినా ఏపీ ప్రభుత్వం మీద జల్లిన బురదే తనకు మిగులుతుంది తప్ప అంతకుమించి ఏమీ సాధించగలిగే అవకాశం కనిపించడం లేదు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp