పవన్ నాదెండ్లది ఏనాటి బంధమో @ 1984

By Kiran.G Feb. 02, 2020, 12:53 pm IST
పవన్ నాదెండ్లది ఏనాటి బంధమో @ 1984

పవన్ కళ్యాణ్ కొంతకాలం క్రితం తెలుగు సినిమా తెరపై దేదీప్యమానంగా వెలుగొందిన తార.. ఆయన అభిమానులు ఆయన్ని దేవుడిగా భావిస్తారు. తాము పవన్ కళ్యాణ్ భక్తులమని అనేక సందర్భాల్లో రుజువు చేసారు. కొన్నాళ్ళు పరాజయాలు వెక్కిరించినా పవన్ అభిమానులు పెరిగారే కానీ తగ్గలేదు.

పవన్ విద్యార్హతల విషయానికి వస్తే చదువుల్లో అంతగా రాణించలేదు. ఇంటర్మీడియట్ తో పాటు పదవ తరగతి పరీక్షల్లో కూడా ఫెయిల్ అయ్యాడు. కానీ 1984 లో నాదెండ్ల భాస్కర రావు, తెలుగుదేశం పార్టీ తొలి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ను పదవీచ్యుతుణ్ణి చేసి, ముఖ్యమంత్రిగా పదవి స్వీకరించినప్పుడు భాస్కర రావు 3,800 ఫైల్స్ ను క్లియర్ చేసి 31 'మేజర్' నిర్ణయాలు తీసుకున్నారు. అలాంటి మేజర్ నిర్ణయాల్లో పదవ తరగతి చదివే విద్యార్థులకు 5 గ్రేస్ మార్కులు కలిపే నిర్ణయం కూడా ఒకటి. తనకు మద్దతిచ్చిన శాసన సభ్యుల పిల్లలను పాస్ చేయించడానికి, నాదెండ్ల భాస్కరరావు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి.

ఇలా గ్రేస్ మార్కులు కలపడం వల్ల 19,491 మంది ఎస్‌ఎస్‌సి అభ్యర్థులు లాభ పడ్డారు. 5 మార్కుల చొప్పున గ్రేస్ మార్కులు కలవడంతో బోర్డర్ లో ఫెయిల్ అయిన విద్యార్థులు తిరిగి ఉత్తీర్ణత సాధించారు. అలా బోర్డర్ మార్కులతో ఫెయిల్ అయ్యి నిరాశలో కృంగిపోయిన వారిలో పవన్ కళ్యాణ్ కూడా ఒకరు. కాగా నాదెండ్ల భాస్కర రావు తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా పవన్ కళ్యాణ్ గ్రేస్ మార్కులతో పదవ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాడు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ పలు సందర్భాల్లో, పలు ఇంటర్వ్యూలలో పవన్ కళ్యాణ్ బహిరంగంగా చెప్పుకొచ్చారు. తాను గ్రేస్ మార్కులతో పాస్ అయ్యానని అప్పటి ముఖ్యమంత్రి భాస్కర రావు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారో తెలియదు కానీ, అందువల్లే నేను గ్రేస్ మార్కులతో పాస్ అయ్యానని ఆ తరువాత నెల్లూరులో ఇంటర్మీడియట్ లో జాయిన్ అయ్యానని కానీ ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేక చదువును వదిలేసానని పవన్ పలుసార్లు తెలిపారు.

చదువుల్లో రాణించకపోవడంతో సినీరంగ ప్రవేశం మెగాస్టార్ తమ్ముడిగా సాఫీగానే జరిగింది. సినీరంగంలో వచ్చిన స్టార్ డం తో 2014 లో జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ స్థాపించారు. ప్రశ్నించడం కోసమే పార్టీ పెట్టానని చెప్పిన పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఉన్న లోపాల కారణంగా 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యింది. కనీసం పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ కూడా గెలుపుకు దూరం కావడం సంచలనం కలిగించింది. దీనికి తోడు పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, చేస్తున్న వ్యాఖ్యల కారణంగా జనసేన పార్టీలో చేరిన కీలక నాయకులు ఒక్కొక్కరుగా పార్టీని వీడి పార్టీ మనుగడను ప్రశ్నార్థకంగా మార్చేశారు.

జనసేనను మనోహర్ శాసిస్తున్నాడా ?

నాదెండ్ల భాస్కర రావు కుమారుడు నాదెండ్ల మనోహర్ 12 అక్టోబర్ 2018న జనసేన పార్టీలో చేరారు. నాదెండ్ల మనోహర్ పార్టీలో చేరిన అనంతరం జనసేన పార్టీలో ఉన్న కీలక నేతలు ఒక్కొక్కరుగా దూరమయ్యారు. తమకు విలువ ఇవ్వడం లేదనో, లేక పవన్ వైఖరిలో మార్పు వచ్చిందనే కారణాలు చెబుతూ పార్టీకి దూరమవడం రాజకీయ వర్గాల్లో ఆలోచన రేకెత్తించింది. అయితే నాదెండ్ల మనోహర్ కనుసన్నల్లో జనసేన పార్టీ నడుస్తుందని, పార్టీలో కీలక నిర్ణయాలన్నీ మనోహర్ తీసుకుంటున్నారని, పవన్ కేవలం రబ్బర్ స్టాంప్ గా మారిపోయారన్న ఆరోపణలు ఉన్నాయి. పార్టీ కీలక సమావేశాలలో మనోహర్ కు ఇచ్చిన ప్రాధాన్యత పార్టీలో ఉన్న మిగిలిన కీలక నేతలకు ఇవ్వడంలేదన్న వాదనలు లేకపోలేదు. అందుకే కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడిపోతున్నారన ఊహాగానాలు రాజకీయవర్గాల్లో వినిపిస్తున్నాయి.

జనసేన తరపున గెలిచినా ఏకైక ఎమ్మెల్యే రాపాకను కూడా పవన్ కళ్యాణ్ పట్టించుకోవడం లేదని, కేవలం నాదెండ్ల మనోహర్ కి తప్ప పార్టీలో ఏ ఒక్కరికి ప్రాధాన్యత ఇవ్వడం లేదని ప్రధానంగా వినిపిస్తున్న పిర్యాదు. బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి నాదెండ్ల మనోహర్ ఉత్సాహం చూపించారని, అందుకు సానుకూలంగానే బీజేపీతో పవన్ కళ్యాణ్ పొత్తుకు అంగీకరించారని, జనసేన తీసుకున్న కీలక నిర్ణయాలన్నీ మనోహర్ తీసుకున్నవే అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

పవన్ కళ్యాణ్ అఫిడవిట్ సమర్పించినప్పుడు తన విద్యార్హత పదవ తరగతిగా మెన్షన్ చేశారు. ఆ పదవ తరగతి ఉత్తీర్ణత సాధించడానికి నాదెండ్ల భాస్కర రావు చేసిన ఉపకారమే కారణమని, అందుకే ఆయన కుమారుడైన మనోహర్ కి పార్టీలో అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. ఈ వ్యాఖ్యలకు బలం చేకూరుస్తూ ఇటీవల నాదెండ్ల భాస్కర రావు బీజేపీలో చేరడం, తర్వాత జనసేన కూడా బీజేపీతో పొత్తు పెట్టుకోవడం లాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. నాదెండ్ల మనోహర్ ఒత్తిడి మేరకే ఈ రెండు పరిణామాలు జరిగాయన్న వాదన కూడా ఉంది.

కానీ జనసేన నుండి తప్పుకున్న ఒక్కొక్క కీలక నేత పరోక్షంగా పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలను తప్పుపడుతూ, ఏకపక్ష నిర్ణయాలతో పార్టీని నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. కానీ పవన్ తీసుకున్న ప్రతీ కీలక నిర్ణయం వెనుక మనోహర్ ఉన్నాడన్నది బహిరంగ రహస్యం.. కానీ ఎంతమంది కీలక నేతలు పార్టీని వీడినా పార్టీలో కానీ తీసుకుంటున్న నిర్ణయాల్లో కానీ లోపాలను గుర్తించకపోవడం పవన్ కళ్యాణ్ లో ఉన్న ప్రధాన లోపం. ఇలాగె కొనసాగితే జనసేన పార్టీ భవిష్యత్తులో మనుగడ సాగించడం దాదాపు అసాధ్యం.

గెలిచిన ఏకైక ఎమ్మెల్యేకు కూడా ప్రాధాన్యత ఇవ్వకుండా ఎన్నికల్లో ఓటమి పాలయిన ఇద్దరు వ్యక్తులు తీసుకుంటున్న ప్రతీ నిర్ణయం పార్టీ మనుగడను ప్రశ్నార్థకం చేస్తుంది. ఎప్పుడో పదవ తరగతి పరీక్షల్లో మార్కులు వేసి పాస్ చేయించారని దానికి ప్రతిగా మనోహర్ చెప్పిన ప్రతీ నిర్ణయాన్ని అమలు చేసినందుకే పార్టీ చిక్కుల్లో పడిందని ఇకనైనా పవన్ కళ్యాణ్ కళ్ళు తెరిచి సత్యాన్ని గుర్తిస్తే తప్ప పార్టీ నిలబడదని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ విషయం పవన్ గుర్తిస్తాడో లేదో చూడాలి మరి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp