కాకినాడ టెన్షన్ టెన్షన్

By Amar S Jan. 14, 2020, 01:21 pm IST
కాకినాడ   టెన్షన్ టెన్షన్

ఢిల్లీ పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ నేరుగా కాకినాడకు వచ్చి తేల్చుకుంటానని ముందుగానే చెప్పారు. అలాగే ఇవాళ ఉదయం 11 గంటలకు విశాఖపట్నం వచ్చిన పవన్ కళ్యాణ్ విశాఖ నుంచి రోడ్డుమార్గంలో తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడకు వెళ్లనున్నారు.

కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుచరుల దాడిలో గాయపడిన జనసేన కార్యకర్తల్ని పవన్‌ కళ్యాణ్ పరామర్శించనున్నారు. వారికి తానతోపాటు పార్టీ అండగా ఉంటుందని పవన్ భరోసా ఇవ్వనున్నారు. అనంతరం పవన్ పార్టీ ముఖ్య నేతలతో సమావేశమవుతారు.

ఇప్పటికే పవన్ కాకినాడ పర్యటనపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. శనివారం ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయటంతో పవన్ అభిమానులు ద్వారంపూడి ముట్టడికి యత్నించిన ఘటనలో ఇరువర్గాలు దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో జనసేన కార్యకర్తలకు గాయాలయ్యాయి.. మరోవైపు పోలీసులు జనసేన నేతలపై కేసులు పెట్టడంతో పవన్ ఫైరయ్యారు. ఢిల్లీ నుంచి నేరుగా కాకినాడకు వచ్చి విషయం తేల్చేస్తానన్నారు.

ఈ నేపథ్యంలో పవన్ కాకినాడకు వస్తుండటంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారే అవకాశం ఉన్నందున పోలీసులు కాకినాడలో 144 సెక్షన్ విధించారు. పార్టీల స్లోగన్లు, ర్యాలీలు, సభలు, సమావేశాలకు అనుమతులు లేవని తేల్చి చెప్పారు. ఎమ్మెల్యే ద్వారంపూడి ఇంటివద్ద భద్రత ఏర్పాటు చేశారు. ఈ పరిస్థితుల్లో పవన్ ను కాకినాడ రానిస్తారా లేదా మధ్యలో పోలీసులు శాంతి భద్రతల దృష్ట్యా అడ్డుకుంటారా అనే అనుమానం కలుగుతోంది. మరోవైపు వరుస పరిణామాలతో కాకినాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp