సైకిల్ దిగనున్న మాజీ కేంద్రమంత్రి.. అడుగులు అటువైపేనా...?

By Srinivas Racharla Oct. 06, 2020, 11:00 am IST
సైకిల్ దిగనున్న మాజీ కేంద్రమంత్రి.. అడుగులు అటువైపేనా...?

ఆమె నాలుగు సార్లు ఎంపీ..యూపీఏ గవర్నమెంట్ లో పది సంవత్సరాల కేంద్రమంత్రిగా ఒక వెలుగు వెలిగిన వ్యక్తి. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఆమెకు రాజకీయంగా కాలం కలిసి రాలేదు. ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్న నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ నాయకురాలు రాజకీయంగా కీలక ప్రకటన చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

ఆమే నెల్లూరు జిల్లాకు చెందిన పనబాక లక్ష్మి..కేంద్ర సర్వీసులలో పనిచేస్తున్న భర్త పనబాక కృష్ణయ్యకు ఢిల్లీ స్థాయిలో ఉన్న పలుకుబడితో పాటు మాజీ సీఎం నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి ఆశీస్సులతో పనబాక లక్ష్మి రాజకీయాలలోకి ప్రవేశించారు.1996 పార్లమెంట్ ఎన్నికలలో ఆమె కాంగ్రెస్ తరపున నెల్లూరు నుంచి పోటీ చేసి తొలిసారి లోక్‌సభలో అడుగు పెట్టారు.ఇక 1998-99 మధ్యంతర ఎన్నికలలో తిరిగి నెల్లూరు నుంచి విజయం సాధించిన ఆమె 2004లో కూడా ఎన్నికయ్యారు.

మరోసారి 2009 ఎన్నికలలో బాపట్ల నుంచి పార్లమెంటరీ నియోజకవర్గం నుండి ఎంపీగా పనబాక లక్ష్మి గెలుపొందారు. దీంతో మొత్తం నాలుగు సార్లు లోక్‌సభ ఎంపీగా గెలిచిన ఆమె వరుసగా గత రెండు పార్లమెంటరీ ఎన్నికలలో కాంగ్రెస్, టిడిపి నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2004-2014 వరకు ఆమె కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మరియు జౌళి మంత్రిత్వ శాఖలను నిర్వర్తించారు. రాష్ట్ర విభజన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగిన పనబాక లక్ష్మి 2019 ఎన్నికలకు ముందు టిడిపిలో చేరి తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటమి చవి చూశారు. దీనితో డీలా పడిన ఆమె కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

ఇటీవల తిరపతి వైసిపి సిట్టింగ్ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కరోనా వైరస్ కారణంగా మృతి చెందారు. ఆయన మరణంతో ఖాళీ అయిన తిరుపతి లోక్‌సభ స్థానానికి త్వరలో ఉప ఎన్నిక జరుగనుంది. ఈ స్థానం ఎస్సీ రిజర్వుడ్ కావడంతో అన్ని పార్టీలు ఆ సామాజిక వర్గం నుండి బలమైన అభ్యర్థి కోసం అన్వేషిస్తున్నాయి. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్న ఆమె ఆ పార్టీ తరపున పోటీ చేయడానికి సుముఖంగా లేదు. పైగా ఎవరైనా సిట్టింగ్ ఎమ్మెల్యే గాని, ఎంపీ గాని మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు ఆ స్థానాన్ని కేటాయించడం ఆనవాయితీగా మారింది.

ఇలాంటి సందర్భంలో మిగిలిన రాజకీయ పక్షాలు తమ తరఫున పోటీకి అభ్యర్థులను నిలపకుండా ఏకగ్రీవ ఎన్నికకు సహకరిస్తున్నాయి. ఎన్నికల అనంతరం గతంలో ఎన్నడూ లేనంతగా బలహీనపడిన టీడీపీ తిరుపతి ఉప ఎన్నికలలో పోటీ చేసి చేతులు కాల్చుకునే పని చెయ్యదని ఆమె భావిస్తున్నారు. కానీ గత ఏడాదిగా రాజకీయంగా స్తబ్దుగా ఉన్న ఆమె తిరిగి యాక్టివ్ పాలిటిక్స్ లోకి రావటానికి ఆసక్తి కనబరుస్తున్నారని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో పనబాక లక్ష్మి బిజెపి వైపు తన దృష్టి సారించారు. బిజెపి పార్టీలో చేరి త్వరలో జరిగే తిరుపతి లోక్‌సభ స్థానానికి పోటీ చేయడానికి ఆమె సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఢిల్లీ బీజేపీ పెద్దలతో మంతనాలు జరిపిన పనబాక లక్ష్మికి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఇవాళ తన పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించడానికి భారీగా ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ వేడుకలలో పార్టీ మార్పుకు సంబంధించిన ప్రకటన చేయడానికి రంగం సిద్ధమైంది.

ఇక 2019 ఎన్నికలలో నెల్లూరు జిల్లాలోని మొత్తం పది అసెంబ్లీ స్థానాలు,రెండు లోక్‌సభ స్థానాలలో టీడీపీకి మొండి చెయ్యి దక్కింది. అనంతరం పలువురు బీసీ నాయకులు అధికార వైసీపీలో చేరగా..తాజాగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నాయకురాలు పనబాక లక్ష్మి పార్టీ మార్పు టీడీపీకి కోలుకోలేని దెబ్బ అని చెప్పవచ్చు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp