టిక్​టాక్​కు భారీ ఊరట - నిషేధం ఎత్తివేసిన పాకిస్థాన్

By Kiran.G Oct. 20, 2020, 08:22 am IST
టిక్​టాక్​కు భారీ ఊరట - నిషేధం ఎత్తివేసిన పాకిస్థాన్

వరుస వివాదాలు చుట్టుముట్టడంతో పాటు పలు దేశాలు తమ అప్లికేషన్ ను నిషేధించడంతో తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న టిక్​టాక్​కు భారీ ఊరట లభించింది. కొద్దిరోజుల క్రితం టిక్​టాక్​పై నిషేధం విధించిన పాకిస్థాన్ తాజాగా ఆ నిషేధాన్ని ఎత్తివేసింది.టిక్​టాక్​తో చర్చలు సఫలం కావడంతో పాకిస్థాన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

అసలేం జరిగింది..

టిక్‌టాక్‌లో అసభ్యకరమైన,అనైతికమైన కంటెంట్‌ ఎక్కువ అవుతుందని పాకిస్థాన్‌ టెలీకమ్యూనికేషన్‌ అథారిటీకి వరుసగా ఫిర్యాదులు రావడంతో అలాంటి అసభ్యకరమైన కంటెంట్‌ను తొలగించాలని పాకిస్థాన్‌ టెలీకమ్యూనికేషన్‌ అథారిటీ(పిటీఏ) టిక్‌టాక్‌కు కొంత సమయాన్ని ఇచ్చింది. కానీ టిక్‌టాక్‌ పిటీఏ ఆదేశాలను పరిగణనలోకి తీసుకోలేదు. జులైలో ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు అసభ్యకరమైన కంటెంట్ తొలగించే విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోనందున టిక్‌టాక్‌ను అక్టోబర్ 9న పాకిస్థాన్ లో నిషేధిస్తున్నట్లు పిటీఏ ఆదేశాలు జారీ చేసింది.

అసభ్యకరమైన కంటెంట్ తొలగిస్తామన్న టిక్‌టాక్‌

ఇప్పటికే భారత్ అమెరికా సహా పలు దేశాలు టిక్​టాక్​పై నిషేధాన్ని విధించిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్ కూడా నిషేధం విధించడంతో పాకిస్థాన్ ప్రభుత్వంతో టిక్​టాక్​ యాజమాన్యం చర్చలు జరిపింది. అసభ్యకరమైన కంటెంట్ ను తొలగిస్తామని అలాంటి అనైతిక కంటెంట్ వ్యాప్తి చేస్తున్న అకౌంట్లపై చర్యలు తీసుకుంటామని టిక్​టాక్​ యాజమాన్యం పాకిస్థాన్ ప్రభుత్వానికి హామీ ఇవ్వడంతో టిక్​టాక్​పై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు పిటీఏ ప్రకటించింది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp