చరిత్రలో ఈ రోజు - 1971 భారత్ పాక్ యుద్ధం

By Kotireddy Palukuri Dec. 16, 2019, 01:58 pm IST
చరిత్రలో ఈ రోజు - 1971 భారత్ పాక్ యుద్ధం

ఆర్ధిక, సామజిక, రాజకీయ రంగాల్లో వివక్షత, సంస్కృతీ, సాంప్రదాయాల గుర్తింపు లేమి అనే అంశాలు అనేక ఉద్యమాలకు, యుద్ధాలకు, దేశాలు, రాష్ట్రాలు ఏర్పడేందుకు కారణభూతమయ్యాయి. ఇదే అంశంపై బంగ్లాదేశ్ ఏర్పడింది. బంగ్లా లో సివిల్ వార్, చివరికి భారత్ పాక్ మధ్య యుద్దానికి దారితీసింది. అమెరికా, ఇంగ్లాండ్ సౌదీ అరేబియా వంటి బలమైన దేశాలు పాకిస్థాన్ కి మద్దుతు తెలపగా, రష్యా సహకారంతో కేవలం 13 రోజుల్లో ముగిసిన యుద్ధంలో పాకిస్థాన్ ను భారత్ మట్టి కరిపించింది. 1971 డిసెంబర్ 16వ తేదీన భారత్ విజయంతో యుద్ధం ముగిసింది.

1947 ఆగస్టు 14న పాకిస్థాన్ ఏర్పడింది. పశ్చిమాన అప్పటి పశ్చిమ పాకిస్థాన్ (ప్రస్తుత పాకిస్థాన్), తూర్పున అప్పటి తూర్పు పాకిస్థాన్ (ప్రస్తుత బంగ్లాదేశ్) ఏర్పడింది. రెండు ప్రాంతాల మధ్య దాదాపు 1600 కిలో మీటర్ల దూరం. అనుసంధాన లేమి. పరిపాలన, రాజకీయ ఆధిపత్యం అంతా పశ్చిమ పాకిస్థాన్ లోని నేతలకే ఉండేది. ప్రధాని, అధ్యక్ష పదవులు రెండు పశ్చిమ పాక్ లోని నేతలు అనుభవించేవారు. జనాభా పరంగా అధికంగా ఉన్న తూర్పు పాకిస్థాన్ నేతలకు మొండిచేయి చూపారు.

పశ్చిమ పాక్ లో ఉర్దు, పంజాబీ భాష, తూర్పు పాక్ లో బెంగాలీ భాష మాట్లాడేవారు. బెంగాలీ భాషకు అధికారిక గుర్తింపు కోసం తూర్పు పాక్ ప్రజలు 1956 వరకు 8 ఏళ్లుగా పోరాటం చేయాల్సి వచ్చింది. అన్ని విధాలుగా వివక్ష ఎదుర్కొంటున్న తూర్పు పాకిస్థాన్ లో అవామీ లీగ్ పార్టీ నేతృత్వంలో, బంగబందు ముజీబ్ నాయకత్వాన 1966 లో సిక్స్ పాయింట్స్ ఉద్యమం మొదలైంది. రాజకీయ, ఆర్ధిక, మిలటరీ, కరెన్సీలపై తమకు అధికారం ఉండాలనే డిమాండ్ల తో ఉద్యమం ప్రారంభమైంది.

పాక్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ ఉద్యమం పై ఉక్కుపాదం మోపడం మొదలెట్టారు. 1970 లో తూర్పు పాక్ లో వరదలు, తుఫానుల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దాదాపు 3 నుంచి 5 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. భారీగా ప్రాణ, ఆస్థి నష్టం జరిగింది. ప్రజలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఐనా తూర్పు పాకిస్థాన్ కు సహాయ సహకారాలు అందించేందుకు అధ్యక్షుడు అయూబ్ ఖాన్ చొరవ చూపలేదు. ఫలితంగా వెంటనే జరిగిన జాతీయ ఎన్నికల్లో తూర్పు పాకిస్థాన్ లో 162 సీట్లకు గాను ముజీబ్ సారథ్యంలోని అవామీ లీగ్ 160 సీట్లు గెలుచుకుంది. పశ్చిమ పాక్ లో జుల్ఫీకర్ అలీ భుట్టో సారథ్యంలోని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ 138 స్థానాలకు గాను 83 చోట్ల గెలిచింది.

జాతీయ అసెంబ్లీ ఏర్పాటు వాయిదా పడింది. అధికార పంపిణి విఫలమైంది. దింతో అయూబ్ ఖాన్.. భుట్టో, ముజీబ్ లను జైలుకు పంపారు.
ముజీబ్ ను అరెస్ట్ చేయడంతో తూర్పు పాకిస్థాన్ లో ప్రజలు ఉద్యమం మొదలెట్టారు. ప్రజా ఉద్యమాన్ని మిలిటరీ తో అయూబ్ ఖాన్ క్రూరంగా అణచి వేశారు. ఉద్యమకారులు, విద్యార్థులు, మేధావులు, రచయతలు, ప్రజలు దాదాపు 5 లక్షల మందిని మిలిటరీ కాల్చి చంపింది. దాదాపు 4 లక్షల మంది మహిళలపై అత్యాచారాలు జరిగాయి.

ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో తూర్పు పాకిస్థాన్ లో 'ముక్తి బాహిని' పేరుతో సివిల్ వార్ మొదలైంది. విప్లవకారులు గొరిల్లా దాడులకు పాలపడ్డారు. వీరికి భారత్ సహాయం చేస్తోందని పాకిస్థాన్ ప్రభుత్వం ఆరోపించింది. సివిల్ వార్ ప్రారంభ వరకు ఈ వ్యవహారంలో భారత్ తటస్థంగా ఉంది. ఐతే సివిల్ వార్ వల్ల దాదాపు కోటి మంది తూర్పు పాకిస్థాన్ ప్రజలు శరణార్థులుగా సరిహద్దు రాష్ట్రాలైన భారత్ ఈశాన్య రాష్ట్రాలు వచ్చారు. ఫలితంగా ఆయా రాష్ట్రాల ఆర్ధిక, సామాజిక చట్రంలో మార్పులు వచ్చాయి.

పరిస్థితి ఇలా ఉండగా సివిల్ వార్ కు భారత్ సహాయం చేస్తుందన్న అనుమానంతో అకస్మాత్తుగా 1971 డిసెంబర్ 3వ తేదీన పాకిస్థాన్ భారత్ పై యుద్దానికి దిగింది. పశ్చిమాన ఉన్న భారత్ వైమానిక స్థావరాలపై బాంబుల వర్షం కురిపించింది. భారత్ కు భారీ నష్టం జరిగింది. వెంటనే భారత్ కూడా ఏక కాలంలో అటు పశ్చిమ, ఇటు తూర్పు పాక్ లలో ఉన్న పాక్ మిలటరీ పై దాడులు చేసింది. భారత్ బలగాలు పాక్ కరాచి నావికాదళ పోర్ట్ పై దాడి చేసింది.

పాకిస్థాన్ కు మద్దతుగా అమెరికా రావడంతో, భారత్ కు సహాయంగా రష్యా వచ్చింది. భరత్ కు రష్యా మద్దతుగా రావడంతో అమెరికా, బ్రిటన్ సేనలు వెనక్కి తగ్గాయి. ఫలితంగా యుద్ధం ప్రత్యక్షంగా భారత్, పాక్ మధ్యనే జరిగింది. కేవలం 13 రోజుల్లో పాక్ సైన్యం తోక ముడిచింది. తూర్పు పాకిస్థాన్ మిలిటరీ లెఫ్టినెంట్ కమాండర్ ఆక్ నియాజి 90 వేల మంది బలగాలతో లొంగిపోయారు.

తర్వాత నెల రోజుల్లోపే 1972 జనవరి 12వ తేదీన బంగ్లాదేశ్ అధికారికంగా ఆవిర్భవించింది. 'బంగబందు' ముజీబ్ అధికారం చేపట్టారు. పశ్చిమ పాక్ లో అయూబ్ ఖాన్ రాజీనామా చేశారు. పశ్చిమ పాక్ లో భుట్టో పాలనా పగ్గాలు చేపట్టారు. ఆ తర్వాత ఆరు నెలలకు 1972 జులై 2వ తేదీన భారత్ పాకిస్థాన్ ల మధ్య సిమ్లా ఒప్పందం జరిగింది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp