P Gannavaram TDP - వాంటెడ్ ఇంచార్జి

By Prasad Oct. 16, 2021, 08:00 pm IST
P Gannavaram TDP - వాంటెడ్ ఇంచార్జి

తూర్పు గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ సంస్థాగతంగా బలంగా ఉన్న నియోజకవర్గాల్లో పి.గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం ఒకటి. అటువంటి నియోజకవర్గానికి గత సాధారణ ఎన్నికల తరువాత నుంచి ఇన్‌చార్జి లేకపోవడం ఆ పార్టీ ప్రస్తుత దుస్థితికి అద్ధంపడుతుంది. గత ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేసిన వ్యక్తి ఎన్నికల అనంతరం పార్టీకి గుడ్‌బై చెప్పడం... పార్టీ ప్రతిపక్షంలో ఉండడంతో ఖర్చుకు భయపడడం.. అన్నింటికన్నా పార్టీ సీనియర్లగా చెలామణి అవుతున్నవారు మండలాల్లో పెత్తందారులుగా మారడం వంటి కారణాలతో ఇక్కడ పార్టీ పగ్గాలు చేపట్టేందుకు నాయకులు ఎవ్వరూ ముందుకు రావడం లేదు.

పి.గన్నవరం ఎస్‌సీ జనరల్‌ . ఈ నియోకవర్గంలో మామిడికుదురు మండలంలో కొన్ని గ్రామాలు, పి.గన్నవరం, అయినవిల్లి, అంబాజీపేట మండలాలున్నాయి. ఈ నియోజకవర్గంలో టీడీపీకి సంస్థాగతంగా పట్టుకుంది. ఈ నియోజకవర్గంలో ఎంఆర్పీఎస్‌కు ఏకంగా 17 వేల వరకు ఓట్లు ఉండడం, బీసీలలో మెజార్టీ కులమైన శెట్టిబలిజ పి.గన్నవరం, మామిడికుదురు మండలాల్లో టీడీపీ వైపు ఎక్కువగా ఉంటారు. అంబాజీపేట, అయినవిల్లి మండలాల్లో కాపులు కూడా ఈ పార్టీ వైపు వుండేవారు. ఇవన్నీ టీడీపీకి కలిసివచ్చాయి.

పాత 'నగరం' నియోజకవర్గం నుంచి చూసుకుంటే టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ పలు సందర్భాలలో విజయం సాధించింది. 1983,1985, 1994లలో ఈ నియోకవర్గం నుంచి ఉండ్రు కృష్ణారావు విజయం సాధించారు. 1996లో కృష్ణారావు మృతితో ఉప ఎన్నికలు జరగగా, పార్టీ తరపున పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి విజేతగా నిలిచారు. 1999 ఎన్నికల పొత్తులో భాగంగా టీడీపీ ఈస్థానాన్ని బీజేపీకి కేటాయించగా, మానేపల్లి అయ్యాజీ వేమా పోటీ చేసి గెలుపు సాధించారు. 2004 లో మరోసారి టీడీపీ పొత్తుతో బీజేపీ నుంచి వేమా బరిలో దిగారు. అయితే టిక్కెట్‌ రాలేదనే అక్కస్సుతో పార్టీ రెబల్‌గా నారాయణమూర్తి బరిలో నిలిచి గుణనీయంగా ఓట్లు చీల్చడంతో వేమా ఓటమి చెందగా, కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన పాముల రాజేశ్వరిదేవి గెలిచారు. 2009లో పీఆర్పీ పోటీలో ఉండడం రాజేశ్వరిదేవికి మరోసారి కలిసి వచ్చింది. ఆ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన నారాయణమూర్తి ఊహించన విధంగా రెండవస్థానంలో నిలిచారు. 2014 ఇక్కడ నుంచి టీడీపీ తరపున పోటీచేసి నారాయణమూర్తి గెలుపు సాధించారు.

సిటింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న నారాయణమూర్తికి 2019 ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్‌ విషయంలో మరోసారి మొండిచేయి చూపింది. అతనిని కాదని పెద్దగా సంబంధాలు లేని నేలపూడి స్టాలిన్‌ బాబును అభ్యర్థిగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరచింది. సొంత గ్రామం అంబాజీపేటలో కూడా పెద్దగా పట్టులేని స్టాలిన్‌బాబుకు సీటు రావడం వెనుక టీడీపీలో చక్రం తిప్పే ఒక సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్సీ సిఫార్సు కారణమని తెలిసింది. ఇక్కడ వైఎస్సార్‌సీపీ నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, జనసేన నుంచి మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి, టీడీపీ నుంచి స్టాలిన్‌ బాబు తలపడగా, కొండేటి చిట్టిబాబు ఏకంగా 25 వేల మెజార్టీతో గెలిచారు. 45,166 ఓట్లతో టీడీపీ ద్వితీయస్థానంలో నిలిచింది. పార్టీ ఆవిర్భావం తరువాత ఉప ఎన్నికలతో కలిపి పది ఎన్నికలు జరగగా టీడీపీ నేరుగా ఐదుసార్లు, ఒకసారి మిత్రపక్షం బీజేపీతో కలిసి విజేతగా నిలిచింది. టీడీపీ ఓటమి చెందిన నాలుగు ఎన్నికల్లో రెండుసార్లు స్వల్పతేడాతోనే కావడం గమనార్హం.

‘బాబు’లు ముంచేశారు.. 

టీడీపీకి బలమైన నియోజకవర్గం అయినప్పటికీ ఓటమికి ప్రజా వ్యతిరేకతకు తోడు అభ్యర్థికి అనుభవం లేకపోవడం కూడా కారణమైంది. అలాగే పార్టీలో సీనియర్లుగా చక్రం తిప్పే ఐదుగురు ‘బాబు’లు పేరుగలవారి పెత్తనం కూడా దెబ్బతీసింది. ఎన్నికల కోసం పంపిన సొమ్ములు పక్కదారి పట్టించారనే విమర్శలు కూడా వచ్చాయి. ఏకంగా రూ.రెండు కోట్లకు లెక్క లేకుండా పోయింది. చాలా చోట్ల ఓటర్లకు ఇచ్చిన డబ్బులు ‘బాబు’లతో పాటు క్యాడర్‌ నొక్కివేయడం విశేషం. ప్రచారం సైతం పేలవంగా సాగింది. దీనికితోడు ఎన్నికల ముందు మాజీ ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి పార్టీ పరాజయానికి చేయాల్సిందంతా చేశారు. దీనితో స్టాలిన్‌ ఓటమి మూటగట్టుకున్నారు. తరువాత అయినా పార్టీ నడిపారా అంటే అదీ లేదు. ప్రతీ సమావేశంలోనూ ఎన్నికల సొమ్ములు పక్కదారి పట్టడంపై కార్యకర్తలు నిలదీయడంతో ఆయన పార్టీని వదిలేసి వెళ్లిపోయారు.

పార్టీ ఇన్‌చార్జి ఎవరు?

నాటి నుంచి పార్టీకి ఇక్కడ ఇన్‌చార్జి లేకుండా పోయారు. తమ నియోజకవర్గానికి ఇన్‌చార్జి కావాలని క్యాడర్‌ స్వయంగా పార్టీ అధినేత చంద్రబాబును, ప్రధాన కార్యదర్శి లోకేష్‌ను కోరినా ప్రయోజనం లేదు. పార్లమెంట్‌ ఇన్‌చార్జిగా ఉన్న దివంగత లోక్‌సభ స్పీకర్‌ జి.ఎం.సి.బాలయోగి తనయుడు హరీష్‌ మాధుర్‌ పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. పార్టీ నుంచి ఇన్‌చార్జి అడుగుతున్నవారిలో మోకా ఆనందసాగర్‌ పేరు ప్రముఖంగా వినిపించింది. ముమ్మిడివరానికి చెందిన ఆనంద్‌సాగర్‌ను స్థానిక క్యాడర్‌ వ్యతిరేకిస్తుంది. వలస నాయకులు అవసరం లేదని తేల్చిచెప్పారు. ఆయన కాకుండా మందపాటి కిరణ్‌కుమార్‌, అంబాజీపేట మండలం మాచవరం మేజర్‌ పంచాయతీలో తన భార్యాను సర్పంచ్‌గా గెలిపించుకున్న నాగాబత్తుల సుబ్బారావులు ఇన్‌చార్జిని ఆశిస్తున్నారు. వీరు మినహా చెప్పుకునే నాయకుడు లేకపోవడం ఆ పార్టీ క్యాడర్‌కు మింగుడుపడడం లేదు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp