నే బడికెళ్ళి చదువుకోవాలి అంటున్న మాజీ ఆర్థిక మంత్రి

By Srinivas Racharla Oct. 24, 2020, 10:58 am IST
నే బడికెళ్ళి చదువుకోవాలి అంటున్న మాజీ ఆర్థిక మంత్రి

అప్పట్లో " అయ్యా! నే బడికెళ్ళి చదువుకొని బాగుపడతా" అనే సినిమా పాట ఓ ఊపు ఊపింది.ఆ కోవలోనే అర్జెంటుగా నేను బడికి వెళ్లి లెక్క నేర్చుకోవాలి అంటున్నాడు మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరం..

ఇక వివరాలలోకి వెళితే బీహార్ ఎన్నికలలో ప్రతిపక్ష మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్‌ తాము అధికారంలోకి వస్తే 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చాడు. కాగా ఆర్జేడీ అధినేత లాలూ జైలులో ఉన్న విషయాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ అంత మంది ఉద్యోగులకు జీతాలు జైలు నుండి తెచ్చి ఇస్తారా? అని సీఎం నితీశ్ కుమార్ ఘాటైన విమర్శలు చేశాడు.ఇంకా అనుభవ లేమితో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ నోటికొచ్చినట్లు హామీలు ఇస్తున్నారని సీఎం నితీశ్‌ కుమార్ ఎగతాళి చేశాడు.ఈ విమర్శలపై స్పందించిన తేజస్వీ అనుభవం ఉన్న సీఎం నితీశ్ ఆలోచన ఇంకా పాత కాలం మనిషిలానే ఉందని కౌంటర్ ఇచ్చాడు.

ఇలా ఇరువురు నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుండగానే జేడీయూ మిత్ర పక్షం బీజేపీ తాము అధికారంలోకి వస్తే 19 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని మేనిఫెస్టోలో ప్రకటించింది. ఈ నేపథ్యంలో బీజేపీ మేనిఫెస్టోలోని లెక్కలు అర్థం చేసుకోవడానికి తాను మళ్లీ ప్రైమరీ స్కూల్‌కి వెళ్లాలేమో అని కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.

తాజాగా బీజేపీ మేనిఫెస్టోపై తనదైన శైలిలో మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం ట్విట్టర్‌లో స్పందిస్తూ " 10 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ ఆర్జేడీ ఇచ్చిన హామీని ఎగతాళి చేసిన తరువాత తాము అధికారంలోకి వస్తే బీహార్‌లో 19 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని కాషాయం పార్టీ ఎలా హామీ ఇస్తుంది.10 కంటే 19 చిన్న సంఖ్య అని నాకు తెలియదు. బహుశా ఈ లెక్క అర్థం చేసుకోవడానికి నేను మళ్లీ ప్రైమరీ స్కూల్‌లో చేరలేమో...’’ అంటూ ఎద్దేవా చేశాడు.

అదండీ సంగతి ఓ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విడుదల చేసిన బీజేపీ మేనిఫెస్టో దెబ్బకు మరో మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం బడికి వెళ్లి మళ్లీ లెక్కలు నేర్చుకోవాలి అనుకుంటున్నాడు అన్నమాట.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp