వచ్చే ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి ప్రధాని అభ్యర్థి

By Ramana.Damara Singh Jun. 21, 2021, 07:42 pm IST
వచ్చే ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి ప్రధాని అభ్యర్థి

-రేవు 15 పార్టీల భేటీ

ఏ ముహూర్తాన భారతీయ జనతాపార్టీ మిషన్2024 ప్రారంభించిందో గానీ.. జాతీయ రాజకీయాలు ఇప్పుడు దాని చుట్టూనే తిరుగుతున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు మరో మూడేళ్ల సమయమున్నప్పటికీ.. దానికి ముందు.. వచ్చే ఏడాది జరగనున్న ఏడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, రాష్ట్రపతి ఎన్నికలను దానికి సెమీ ఫైనల్ గా భావిస్తున్న బీజేపీ.. ఇప్పటినుంచే ఎన్నికలకు సిద్ధమవుతోంది. దాదాపు నెల రోజుల నుంచి సంఘ్ పరివార్ నేతలతో కలిసి మేధోమధనం జరుపుతున్నారు. దీంతో దేశ రాజకీయాల్లో వేడి పెరిగింది. ప్రధాని మోదీకి, ఎన్డీయేకు వ్యతిరేకంగా ఉమ్మడి ప్రధాని అభ్యర్థిని పోటీ చేయించడం లేదా ప్రతిపక్షాలన్నీ కలిసి పోటీ చేయడం.. అన్న లక్ష్యాల తో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ రాయబారిగా.. వృద్ధనేత శరద్ పవార్ కేంద్రంగా విపక్ష పార్టీలను ఏకం చేసే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. అందులో భాగంగా మంగళవారం (ఈ నెల 21న) ప్రతిపక్షాల సమావేశం ఏర్పాటు చేశారు.

చకచకా అడుగులు

ఎన్డీయే ప్రభుత్వాన్ని, మోదీ నాయకత్వాన్ని తప్పించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు మంగళవారం సాయంత్రం శరద్ పవార్ నివాసంలో విపక్షాలు భేటీ కానున్నాయి. ఈ విషయంలో పవార్ కు మాజీ బీజేపీ నేత, ప్రస్తుత టీఎంసీ నాయకుడు యశ్వంత్ సిన్హా తోడయ్యారు. ఈయనకు చెందిన రాష్ట్ర మంచ్ తరఫున పవార్, సిన్హా పేర్లతో 15 పార్టీలకు ఆహ్వానాలు పంపారు. దేశంలో సంకీర్ణ ప్రభుత్వాలు, ఫ్రంట్లకు రూపకల్పన చేసిన అనుభవమున్న పవార్ ఆధ్వర్యంలో 2024 ఎన్నికల నాటికి బీజేపీకి వ్యతిరేకంగా ఉమ్మడి వేదిక సిద్ధం చేయడంపై ఈ సమావేశంలో చర్చలు నిర్వహిస్తారని తెలుస్తోంది.

అందరి లక్ష్యం అదే

బెంగాల్ ఎన్నికల్లో సర్వ శక్తులు ఒడ్డినా తృణమూల్ చేతిలో బీజేపీ ఓడిపోవడం ప్రతిపక్షాల ఆశలకు ఊపిరి పోసింది. మోదీపైనా, ఎన్డీయే ప్రభుత్వం పైనా ప్రజల్లో వ్యతిరేకత ఉన్నా.. తగిన ప్రత్యామ్నాయం చూపించలేకపోవడం వల్ల ప్రజలు వారికే ఓట్లు వేస్తున్నారు. సమర్ధుడైన ఉమ్మడి అభ్యర్థిని తెరపైకి తెచ్చి.. ప్రతిపక్షాలన్నీ కలిసి పోటీ చేస్తే విజయం తధ్యమన్న భావన ఉంది. ఇదే అంశంపై పది రోజుల వ్యవధిలోనే రెండోసారి సోమవారం ప్రశాంత్ కిశోర్ శరద్ పవార్ ను ఢిల్లీలోని ఆయన నివాసంలో కలిసి చర్చించారు. ఆ వెంటనే విపక్షాల సమావేశానికి ఆహ్వానాలు వెళ్లాయి. బీజేపీకి వ్యతిరేకంగా ఉమ్మడి వేదికపైకి రావడానికి పలు పక్షాలు ఇప్పటికే ఆసక్తి వ్యక్తం చేసినందున.. రేపటి సమావేశంలో స్థూలంగా ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందంటున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp