ఫలించిన జగన్ వ్యూహం, పరిశుభ్ర పాఠశాలల వైపు పయనం

By Raju VS Jan. 19, 2021, 07:53 am IST
ఫలించిన జగన్ వ్యూహం, పరిశుభ్ర పాఠశాలల వైపు పయనం

ఏపీ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడంతో మహా విపత్తు వేళ కూడా విద్యారంగం ముందడగు వేస్తోంది. కరోనా లాక్ డౌన్ కారణంగా నవతరం చిక్కులు ఎదుర్కోవాల్సిన అవసరం లేకుండా పోయింది. కరోనా కేసుల సంఖ్య చూపి ఈ విద్యాసంవత్సరం రద్దు చేయాలనే వాదన చేసినప్పటికీ ప్రభుత్వం మాత్రం పట్టుదలతో సాగింది. పక్కా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. తొలుత ఆన్ లైన్ క్లాసులు, ఆతర్వాత నిబంధనల ప్రకారం పెద్ద పిల్లలకు ఆఫ్ లైన్ క్లాసులతో మొదలు పెట్టి ప్రస్తుతం రెండు పూటలా బడులు నడిచే స్థితికి తీసుకొచ్చారు. వచ్చే నెల నుంచి మొత్తం పాఠశాలలన్నీ తెరిచేందుకు అనుగుణంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అనేక సమీప రాష్ట్రాల్లో కూడా పాఠశాలలు తెరిచే అంశంలో ఊగిసలాట ఉన్నప్పటికీ ఏపీ ప్రభుత్వం మాత్రం తనదైన శైలిలో ముందుకెళ్లడం ద్వారా విద్యార్థుల భవిష్యత్తుని కాపాడేందుకు కృషి చేసింది.

వాస్తవానికి విద్యాసంవత్సరం బ్రేక్ వచ్చినా లేక ఇతర సమస్యలు ఏమొచ్చినా విద్యార్థులకు అది జీవితాంతం సమస్యగా మారే అవకాశం ఉంది. దానిని గమనంలో ఉంచుకున్న ఏపీ ప్రభుత్వం విద్యాసంవత్సర నిర్వహణకు సంబంధించి తగిన రీతిలో ప్రణాళికను అనుసరించింది. దానికి తగ్గట్టుగా టీవీలు ఇతర మాధ్యమాల ద్వారా ఆన్ లైన్ క్లాసులకు శ్రీకారం చుట్టింది. వాటిని సజావుగా నడిచేలా ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వ బడుల్లో పిల్లలకు పాఠాలు దూరం కాకుండా చేసింది. ఇక సంక్రాంతి తర్వాత పదో తరగతి విద్యార్థులకు రెండు పూటలా క్లాసులు నిర్వహించే పరిస్థితిని తీసుకొచ్చింది. అదే సమయంలో ఇంటర్మీడియట్ కాలేజీలకు వేసవి సెలవులు కూడా రద్దు చేసి మే 31 వరకూ విద్యాసంవత్సరం పొడిగించడం ద్వారా విద్యార్థుల భవిష్యత్తుకే ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నట్టు సంకేతాలు ఇచ్చింది.

ఇక ఫిబ్రవరి నుంచి ప్రాధమిక పాఠశాలలు కూడా తెరిచే అవకాశాలు మెరుగయ్యాయి. జనవరి 18న ఏపీలో కేవలం 81 మాత్రమే కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. మృతులు కూడా ఒక్కరే. దాంతో కరోనా వైరస్ తాకిడిని తగ్గించడంలో ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించినట్టు కనిపిస్తోంది. దానికి అనుగుణంగా విద్యాసంవత్సరం పరిరక్షించే ప్రయత్నాలు కూడా సాగుతున్నాయి. తాజాగా సీఎం నిర్వహించిన సమీక్షలో ఈ అంశాలను ప్రస్తావిస్తూ అధికారులకు సూచనలు చేశారు. ఇప్పటికే నాడు నేడు పథకంలో భాగంగా పలు మార్పులు తీసుకొచ్చిన తరుణంలో ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభం కాబోతున్న స్కూళ్లలో పరిశుభ్రమైన టాయిలెట్లు అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు పాటించాలన్నారు. అందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. టాయిలెట్ల పర్యవేక్షణకు ప్రత్యేకంగా మొబైల్‌ యాప్‌ తయారు చేసే ఆలోచన ఉందని యంత్రాంగం సీఎంకి తెలిపింది. ఎప్పటికప్పుడు పరిస్థితి పర్యవేక్షించేలా చర్యలుంటాయని వారు వివరించారు. దానికి అనుగుణంగా పరిశుభ్ర పాఠశాలల్లో భాగంగా టాయిలెట్‌ నిర్వహణా నిధి ని కూడా ఏర్పాటు చేశారు. దాని నిర్వహణ కోసం రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి, స్కూలు లేదా కాలేజీ స్థాయిలో కమిటీల ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకోవడం విశేషం. అనేక పాఠశాలల్లో టాయిలెట్ల లేకపోవడం, ఉన్నవాటిని సక్రమంగా నిర్వహించకపోవడం వల్ల చాలావరకు స్కూళ్లకు పిల్లలు పోలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేసిన సీఎం బడుల్లో టాయిలెట్ల నిర్వహణ అన్నది ప్రాధాన్యతా అంశంగా తీసుకోవాలని చెప్పారు. ఎప్పుడు మరమ్మతు వచ్చినా వెంటనే వాటిని బాగుచేసేలా చర్యలు ఉండాలని తేల్చారు.

ఓ వైపు పిల్లలు బడికి హాజరయ్యే విషయంలో తల్లిదండ్రులు, గ్రామ సచివాలయం సమన్వయంతో వ్యవహరించేలా మార్పులు తెస్తున్నారు. హాజరు వివరాలు యాప్ లో నమోదు కావడం, పేరెంట్స్ కి వెంటనే తెలియజేయడం వంటివి రూపొందిస్తున్నారు. ఇన్నాళ్లుగా ప్రైవేటు కార్పోరేట్ స్కూల్ విద్యార్థుల మాదిరిగా ప్రభుత్వ బడుల పిల్లలను తీర్చిదిద్దే సంకల్పంతో సాగుతున్నారు. ఇక పిల్లలకు జగనన్న గోరుముద్ద పథకంలో బలవర్థక ఆహారం విషయంలో రాజీ లేకుండా వ్యవహరించాలని సీఎం స్పష్టంగా చెప్పారు. ఈ పరిస్థితుల్లో పాఠశాల విద్యకు ప్రభుత్వం ఎంత ప్రాధాన్యతనిస్తుందన్నది అర్థమవుతోంది. విద్యారంగంలో తీసుకొస్తున్న మార్పులు ఇప్పటికే వివిధ పార్టీల నేతలు అంగీకరించాల్సి వస్తోంది. ప్రభుత్వ విద్యారంగంలో జగన్ ప్రభుత్వం చేస్తున్న కృషిని తోసిపుచ్చలేని స్థితి ఏర్పడుతోంది. త్వరలో పరిశుభ్ర పాఠశాలల నినాదం ద్వారా కరోనా పరిస్థితులున్నా ప్రభుత్వ పెద్దల సంకల్పం ఎలాంటి ఫలితాన్నిస్తుందన్నది అందరికీ చూపించే అవకాశం ఇస్తుందనే ఆశాభావం అధికార యంత్రాంగం లో కనిపిస్తోంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp