క్యాష్ వద్దు - ఉల్లిపాయలే ముద్దు

By Kiran.G Nov. 28, 2019, 04:14 pm IST
క్యాష్ వద్దు - ఉల్లిపాయలే  ముద్దు

ఈ మధ్య విచిత్రమైన దొంగతనాలు జరుగుతున్నాయి.అలాంటిదే పశ్చిమ బెంగాల్ లో ఒక దొంగతనం జరిగింది.ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితులకు ఈ దొంగతనం అద్దం పట్టేలా ఉంది. అక్షయ్ దాస్ అనే వ్యక్తి ,తూర్పు మిడ్నాపూర్ జిల్లా సుతహతా ప్రాంతంలో ఓ కూరగాయల షాపు నిర్వహిస్తున్నాడు. ఉదయం షాప్ తెరిచేసరికి లోపల వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. దొంగతనం జరిగిందని గుర్తించాడు. వెంటనే డబ్బులు పోయాయేమో అని గల్లాపెట్టె దగ్గరకు పరిగెత్తాడు. కానీ విచిత్రంగా ఒక్క రూపాయి కూడా పోలేదు. హమ్మయ్యా అనుకునేలోపు అక్కడ జరిగిన అసలు నిజం గుర్తించాడు. పోయింది డబ్బులు కాదు, ఉల్లిపాయలన్న నిజం గ్రహించాడు. వెంటనే వెళ్లి పోలీసులకు తన విలువైన ఉల్లిపాయలు పోయాయని ఫిర్యాదు చేసాడు.

ప్రస్తుతం దేశంవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల కారణంగా తీవ్రమైన ఉల్లికొరత ఉంది. దీనితో ఉల్లి ధరలకు రెక్కలొచ్చాయి. పశ్చిమ బెంగాల్ లో అయితే కిలో ఉల్లి ధర దాదాపు 100 పైనే ఉంది. దీనితో దొంగతనానికి వచ్చిన దొంగలు డబ్బులు తీసుకెళ్లడం కంటే ఉల్లిపాయలను తీసుకెళ్లడమే మేలనుకున్నట్లున్నారు. అందుకే ఆ కూరగాయల వ్యాపారి షాప్ లో దాదాపు 50వేలరూపాయల ఉల్లిపాయలు ఎత్తుకెళ్లారు. దీనితో డబ్బు పోకపోయినా ఉల్లిపాయలు పోయినందుకు లబోదిబోమనడం ఆ వ్యాపారి వంతయ్యింది. పశ్చిమ బెంగాల్ పక్కనే ఉన్న బాంగ్లాదేశ్ దేశంలో అయితే కిలో ఉల్లి దాదాపు 220 కి చేరుకుంది. ఉల్లిపాయలు లేకుండానే వంట చేసుకుంటున్నానని బాంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ప్రకటించిన సంగతి తెలిసిందే.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp