బ‌హిరంగ మార్కెట్లోకి టీకా.. ఆ సీఎంల ప్ర‌తిపాద‌నపై కేంద్రం నిర్ణయం ఏంటి?

By Kalyan.S Apr. 18, 2021, 08:45 am IST
బ‌హిరంగ మార్కెట్లోకి టీకా.. ఆ సీఎంల ప్ర‌తిపాద‌నపై కేంద్రం నిర్ణయం ఏంటి?

ప్ర‌స్తుతం దేశ‌మంతా క‌రోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉంది. కొన్ని రాష్ట్రాల‌లో క‌ల్లోలం సృష్టిస్తోంది. దీంతో వ్యాక్సినేష‌న్ జోరందుకుంది. ప‌లు అపోహ‌లు, విభిన్న వాద‌న‌ల నేప‌థ్యంలో కొద్ది రోజుల వ‌ర‌కూ వ్యాక్సిన్ వేసుకోవ‌డానికి చాలా మంది ముందుకు రాలేదు. ఫ‌లితంగా వ్యాక్సిన్ కోసం జ‌నం బారులు తీరుతున్నారు. దీంతో వ్యాక్సిన్ కొర‌త ఏర్ప‌డుతోంది. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీకి ఇటీవ‌ల చాలా మంది సీఎంలు లేఖ‌లు రాస్తున్నారు. వారిలో అత్య‌ధిక‌మంది వ్యాక్సిన్ కోస‌మే. పీహెచ్ సీ, యూపీహెచ్ సీ, ఆస్ప‌త్రులు.. ఇలా ప్ర‌తి చోటా క‌రోనా ప‌రీక్ష‌ల‌తో పాటు వ్యాక్సిన్ కూడా వేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో గుంపులు, గుంపులుగా గుమిగూడ‌డం మ‌రింత ప్ర‌మాదంగా మారుతోంది. ఈ నేప‌థ్యంలో ప‌లువురు సీఎంలు కొత్త కొత్త ప్ర‌తిపాద‌న‌లు చేస్తున్నారు. వాటిలో ఒక‌టి వ్యాక్సిన్ ను బ‌హిరంగ మార్కెట్లోకి అందుబాటులోకి తేవ‌డం. ఈ నేప‌థ్యంలో కేంద్రం దీనిపై ఆలోచ‌న‌లు చేస్తోంది.

వ్యాక్సిన్ తో లింకులు

ఇప్పుడు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి ఏ సీఎం లేఖ రాసినా అది కొవిడ్ వ్యాక్సిన్ డోసుల‌కు లింక్ అయ్యి ఉంటుంది. ఏపీ, క‌ర్ణాట‌క‌, ఒడిశా త‌దిత‌ర రాష్ట్రాల సీఎంలు వారిలో ఉన్నారు. తాజాగా ఒడిశా సీఎం న‌వీన్ ప‌ట్నాయ‌క్ ప్ర‌ధాని మోదీకి లేఖ రాశారు. కొవిడ్ వ్యాక్సిన్ల‌ను ప్ర‌భుత్వ ఆధీనంలోనే కాకుండా, బ‌హిరంగ మార్కెట్లో కూడా అందుబాటులో ఉండే విధంగా చూడాల‌ని కోరారు.. దీంతో.. కోవిడ్ టీకాలు కావాల‌నుకున్న వారు కొనుగోలు చేసుకుంటార‌ని.. దీని మూలంగా.. ఆస్ప‌త్రుల‌కు వ‌చ్చేవారి సంఖ్య త‌గ్గిపోయి.. అణ‌గారిన వ‌ర్గాల‌పై ఎక్క‌వ ఫోక‌స్ చేసే అవ‌కాశం ఉంటుంద‌ని ప్ర‌ధాని దృష్టికి తీసుకెళ్లారు. ఇప్ప‌టికే ప్ర‌పంచ వ్యాప్తంగా ఆమోదం పొందిన క‌రోనా టీకాల‌ను అంద‌రికీ అంద‌బాటులోకి తేవ‌డం కోసం చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని లేఖ‌లో ప్ర‌ధానిని కోరారు సీఎం న‌వీన్ ప‌ట్నాయ‌క్.

అన్ని వ‌య‌సుల వారికీ..

వ్యాక్సిన్ల ఉత్ప‌త్తిని పెంచేందుకు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఆయా కంపెనీల‌కు స‌హ‌క‌రించాల‌న్నారు. ముఖ్యంగా.. మెట్రో న‌గ‌రాల‌ను దృష్టిలో పెట్టుకుని వ్యాక్సిన్ పంపిణీ రేష‌న‌ల్ ప‌ద్ధ‌తిలో జ‌ర‌గాల‌న్న ఆయ‌న‌.. కొన్ని మెట్రో సిటీల్లో కేసులు అధికంగా ఉన్నాయ‌ని, కానీ, ఆ న‌గ‌రాల వ‌ల్ల దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ సాగుతుంద‌ని, ఈ అంశాన్ని దృష్టిలోపెట్టుకుని ఆయా న‌గ‌రాల్లో వ్యాక్సినేష‌న్ కోసం కొన్ని స‌డ‌లింపులు ఇవ్వాల‌న్నారు.. ఒక‌వేళ‌.. ఆ న‌గ‌రాల్లో లాక్‌డౌన్ విధిస్తే, దాని వ‌ల్ల మిగితా దేశంపై తీవ్ర‌మైన‌ ప్ర‌భావం ప‌డుతుంద‌న్నారు. మ‌రోవైపు.. వ్యాక్సినేష‌న్ కోసం వ‌య‌సు విష‌యంలో కూడా స‌డ‌లింపు ఇవ్వాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు న‌వీన్ ప‌ట్నాయ‌క్. ఇదే అభిప్రాయాన్ని మ‌రి కొంద‌రు సీఎంలు కూడా వ్య‌క్తం చేస్తున్నారు.

స‌మ‌స్య‌లు త‌లెత్తే అవ‌కాశాలు ఉన్నాయా..?

ప్ర‌స్తుతం వ్యాక్సిన్ ను ప్ర‌భుత్వ‌, ప్ర‌భుత్వం అనుమ‌తించిన కొన్ని ప్రైవేటు ఆస్ప‌త్రుల్లో మాత్ర‌మే అందుబాటులో ఉంచారు. ఆయా కేంద్రాల వ‌ద్ద జ‌నం క్యూ క‌డుతున్నారు. అదే బ‌హిరంగ మార్కెట్లోకి సాధార‌ణ ఇంజ‌క్ష‌న్ల‌లా జ‌నం కొనుక్కుని న‌చ్చిన చోట వేసుకునే అవ‌కాశం ఉంటుంది. ప్ర‌భుత్వ అజ‌మాయిషీలో న‌డిచే కార్య‌క్ర‌మంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటారు. వ్యాక్సిన్ వేసిన అనంత‌రం కొంద‌రిని కొంత సేపు అబ్వ‌రేష‌న్ లో ఉంచి గ‌మ‌నిస్తున్నారు. వారి వారి ఆరోగ్య ప‌రిస్థితుల‌ను బ‌ట్టి ఏమైనా దుష్ప‌రిణామాలు త‌లెత్తే అవ‌కాశాలు ఉంటే ముందుగానే సిబ్బంది వివ‌రించి వారిని సంసిద్ధుల‌ను చేస్తున్నారు. ఎక్క‌డో ఓ చోట త‌ప్పా దాదాపుగా వ్యాక్సినేష‌న్ స‌జావుగానే సాగుతోంది. కానీ, బ‌హిరంగ మార్కెట్ లోకి అందుబాటులోకి తెచ్చి అంద‌రికీ అందుబాటులో ఉంచితే ప్ర‌ణాళికా లోపాలు త‌లెత్తి, ఇబ్బందులు వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయ‌ని ప‌లువురు వైద్య‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఈ మేర‌కు కేంద్రం ఆయా సీఎంల ప్ర‌తిపాద‌న‌ల‌పై అన్ని ర‌కాలుగానూ నిపుణుల‌తో చ‌ర్చించిన త‌ర్వాతే నిర్ణ‌యం తీసుకోనుంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp