నీట్ ఫలితాలపై కోర్టుకెక్కిన విద్యార్థిని..

By Kiran.G Oct. 20, 2020, 06:01 pm IST
నీట్ ఫలితాలపై కోర్టుకెక్కిన విద్యార్థిని..

ఎంబీబీఎస్, బీడీఎస్‌ ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్‌) ఫలితాలపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పరీక్ష ఫలితాలు తప్పులు తడకగా మారడంతో ఫలితాల పట్ల పలువురిలో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.
వివరాల్లోకి వెళితే నీట్ పరీక్ష ఫలితాలపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వెల్లువెత్తుతుంది. దానికి కారణాలు లేకపోలేదు,ఒకే మార్కులు సాధించిన విద్యార్థులకు వేర్వేరు ర్యాంకులు ఇవ్వడంతో పాటు, ఎస్టీ విభాగంలో టాపర్‌గా నిలిచిన విద్యార్థిని ఫెయిల్‌ అయినట్లు ప్రకటించడం, మెరిట్ స్టూడెంట్ కు సున్నా మార్కులు వచ్చాయని ప్రకటించడంతో నీట్ ఫలితాలపై సందేహాలు ఏర్పడ్డాయి.

ఫలితాల వెల్లడిలో ఏం జరిగింది?

ఒడిశాకు చెందిన సోయబ్‌ అఫ్తాబ్‌ నీట్‌-2020 పరీక్షలలో టాపర్‌గా నిలిచి 720 కి 720 మార్క్‌లు తెచ్చుకున్నాడు. అతనితో పాటు సరిసమానంగా మార్కులు తెచ్చుకున్న ఢిల్లీకి చెందిన ఆకాంక్ష సింగ్‌ ని మాత్రం సెకండ్ ర్యాంకర్ గా ప్రకటించారు. దీనికి కారణం షోయబ్ అఫ్తాబ్ కంటే ఆకాంక్ష సింగ్ వయసులో చిన్నది కావడమే కారణం...సమాన మార్కులు సాధించినా సరే వయసులో చిన్నది అనే కారణంతో వేరే ర్యాంక్ కేటాయించడంతో వివాదాస్పదంగా మారింది.

రాజస్తాన్ లోని సవాయి మాధోపూర్ జిల్లాలోని గంగాపూర్ పట్టణానికి చెందిన రావత్ ఫలితాల్లో ఫెయిల్ అయినట్లుగా నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఏటీఏ) ప్రకటించింది. రావత్ 720 మార్కులకు 329 మార్కులు సాధించినట్లు ఫలితాలు జారీ చేయడంతో అతడు రిజల్ట్‌ని సవాలు చేయడంతో అతడి ఓఎంఆర్‌ షీట్‌, ఆన్సర్‌ కీని తిరిగి తనిఖీ చేశారు. ఈసారి 650 మార్కులతో అతను ఎస్టీ కేటగిరీలో ఆల్‌ ఇండియా టాపర్‌ అని తేలింది. ఇక్కడితో పొరపాట్లు ఆగిపోలేదు..ఎన్‌టీఏ జారీ చేసిన రెండవ మార్క్‌షీట్‌లో కూడా అతని మార్కుల మొత్తం 650 అని చూపించినప్పటికి అక్షరాల్లో మాత్రం మూడు వందల ఇరవై తొమ్మిది అని రాశారు.

కోర్టును ఆశ్రయించిన విద్యార్థిని....

మహారాష్ట్రకు చెందిన విద్యార్థిని వసుంధర భోజనేకు నీట్ ఫలితాలు షాక్ ఇచ్చాయి. 720 మార్కులకు గాను సున్నా మార్కులు వచ్చినట్లు ఎన్‌టీఏ జారీ చేసిన ఫలితాల్లో ఉండడంతో తన పేపర్‌ని రీ వాల్యూయేషన్‌ చేయాలని కోరుతూ బొంబాయి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తనకు కనీసం 650 మార్కులు వస్తాయని ఆమె భావించినా ఫలితాల్లో సున్నా అని ఉండడంతో ఆమె బొంబాయి హైకోర్టును ఆశ్రయించింది. దీంతో బొంబాయి హైకోర్టు సోమవారం ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ని విచారించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ), కేంద్ర ఆరోగ్య, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖలకు నోటీసులు జారీ చేసింది. ఒకవేళ ఆమె ఓఎంఆర్ షీట్‌ను తిరిగి తనిఖీ చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో అని సర్వత్రా ఆసక్తి వ్యక్తం అవుతుంది. కాగా ఫలితాల్లో పొరపాట్లు తలెత్తడంతో విద్యార్థులు కొందరు ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం ఫలితాల్లో నెలకొన్న తప్పుల వల్ల విమర్శలకు గురవుతున్న నీట్ ఫలితాలు మరిన్ని విచిత్రాలకు దారి తీస్తాయో వేచి చూడాలి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp