ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులా ?

By Krishna Babu Dec. 13, 2019, 01:55 pm IST
ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులా ?

ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా ప్రజా మద్దతుతో అత్యధిక సీట్లు సాధించి విజయఢంకా మోగించిన వై.యస్.ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారంలోకి వచ్చాక కొంతమంది నాయకుల అత్యుత్సాహం వలన ఇబ్బంది పడాల్సి వస్తుంది. స్థానిక నాయకుల మెప్పు కోసమో , ఊరిలో ప్రత్యర్ధిపార్టి మీద ఆధిపత్యం చూపించటం కోసమో భవనాలకు పార్టీ రంగులు వేయడం కనిపిస్తుంది. కొంతమంది ఇంకాస్త అత్యుత్సాహానికి పోయి, జాతీయ జెండా ఉన్న గోడకు, గాంధీ విగ్రహం దిమ్మకు, ప్రభుత్వ పాఠశాలలకు, ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు అద్దటంతో అవి సోషల్ మీడియాలో వైరల్ అవ్వటంతో ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. ఇదే అదనుగా కొంతమంది ఫోటోషాప్ రాయుళ్ళు కూడా చాలాచోట్ల పార్టీ రంగులు అద్దినట్టూ ఫోటోలను సృష్టించి సొషల్ మీడీయాలో వైరల్ చేసి ప్రభుత్వం మీద బురదజల్లే కార్యక్రమం పెట్టుకున్నారు. దీంతో వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఈ రంగుల వ్యవహారం కాస్త తలనొప్పిగా మారింది.

అయితే తాజాగ గుంటూరు జిల్లా వట్టి చెరుకూరు మండలం పల్లపాడు పంచాయతీ కార్యాలయానికి వై.సి.పి రంగులు వెయ్యటాన్ని వ్యతిరేకిస్తు కొందరు కోర్టు మెట్లు ఎక్కారు. దీనిపై నేడు విచారణ జరిపిన న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు ఎలా వేస్తారంటూ నిలదీసింది. దీనిపై 10 రోజుల్లో నివేదిక ఇవ్వాలని గుంటూరు జిల్లా కలెక్టర్ ను ఆదేశించింది. ఇది జగన్ ప్రభుత్వం కోరితెచ్చుకున్నచికాకుగా భావించవచ్చు.

ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా రంగుల మీద స్పష్టమైన సందేశం,ఆదేశాలు ఇవ్వకుంటే ఈ రంగుల గోల కొనసాగుతుంది...దీన్ని ఎంత త్వరగా నివారిస్తే ప్రభుత్వానికి అంత మంచింది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp