ఏపీ హైకోర్టులో ఆసక్తికర తీర్పు, గీతం ఆక్రమణల తొలగింపుపై స్టే

By Raju VS Oct. 25, 2020, 12:31 pm IST
ఏపీ హైకోర్టులో ఆసక్తికర తీర్పు, గీతం ఆక్రమణల తొలగింపుపై స్టే

విశాఖలోని గీతం యూనివర్సిటీ ఆక్రమణల తొలగింపు వ్యవహారంపై ఏపీ హైకోర్ట్ ఆసక్తికరంగా స్పందించింది. అందులోనూ పండుగ సెలవుల్లో కూడా అనూహ్యంగా కేసు విచారణకు స్వీకరించడం చర్చనీయాంశంగా మారింది. దసరా సెలవుల్లో అత్యవసర కేసులు కూడా విచారణ వాయిదా వేసిన తర్వాత ఆక్రమణల తొలగింపు విషయంలో మాత్రం అర్థరాత్రి పూట విచారణకు పూనుకోవడమే రాజకీయ, న్యాయవర్గాలను విస్మయానికి గురిచేస్తోంది.

మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి సారద్యంలో ఏర్పడిన విద్యాసంస్థ గీతం విలువైన ప్రభుత్వ స్థలాలను ఆక్రమించింది. తాము ఆక్రమణలకు పూనుకోలేదని తాజాగా ఆసంస్థ కూడా చెప్పడం లేదు. కేవలం తమకు ముందుగా నోటీసులు ఇవ్వలేదని మాత్రమే ప్రకటన ఇచ్చారు. అంటే తాము ఆక్రమణలు చేసినట్టు పరోక్షంగా అంగీకరించారు. ఆక్రమణల విలువ భారీగా ఉంటుందని భావిస్తున్నారు. సుమారుగా రూ. వెయ్యి కోట్లు ఉంటుందని ప్రచారం సాగుతోంది. అంతవిలువైన స్థలాలను రిషికొండ, యారాడ ఏరియాల్లో ఆక్రమించి విద్యాసంస్థ నడుపుతున్న తీరు మీద పలు ఫిర్యాదులతో ప్రభుత్వం కార్యాచరణకు పూనుకుంది. కొన్ని ఆక్రమణల తొలగింపు ప్రక్రియను ప్రారంభించింది. జీవీఎంసీ, రెవెన్యూ అధికారులు నిబంధనల మేరకు చర్యలకు పూనుకున్నారు.

అయితే అనూహ్యంగా ఆక్రమణల తొలగింపు ప్రక్రియపై ఏపీ హైకోర్ట్ స్టే ఇవ్వడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది. వాస్తవానికి ఇప్పటికే ఏపీ హైకోర్టు తీర్పులు దేశవ్యాప్త చర్చకు దారితీసింది. ఏకంగా ముఖ్యమంత్రి ఫిర్యాదు చేసేందుకు దోహదపడ్డాయి. అవినీతిపై విచారణ వద్దని, నేరస్తుల వివరాలు వెల్లడించకూడదని గ్యాగ్ ఆర్డర్లు ఇవ్వడం వంటి తీర్పుల పరంపరలో ఇప్పుడు ఏకంగా ఆక్రమణలు తొలగించకుండా స్టే ఇవ్వడం ప్రజల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. నిజానికి ఈనెల 23 నుంచి 29 వరకూ ఏపీ హైకోర్ట్ కి అధికారికంగా సెలవులు ప్రకటించారు. ఈలోగా అత్యవసర కేసులు విచారణకు వచ్చినప్పటికీ ఈనెల 28 తర్వాత హియరింగ్ ఉంటుందని అధికారిక ఉత్తర్వుల్లోనే పేర్కొన్నారు. అయినా అనూహ్యంగా గీతం కేసులో అర్థరాత్రి విచారణ చేసి, తదుపరి ఆక్రమణల తొలగింపు ప్రక్రియ నిలుపు వేయాలని తాత్కాలిక స్టే ఇవ్వడం ప్రశ్నార్థకంగా మారింది.

సాధారణంగా కోర్టులు సెలవుల్లో ఉంటే చాలా అత్యవసరమైన కేసులు మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. ముఖ్యంగా రాజ్యాంగం సంక్షోభ పరిస్థితులు సంభవించినప్పుడో , లేదా తెల్లవారితే ఉరిశిక్ష పడుతున్నప్పుడో , లేదా ఏదైనా ప్రజల ప్రాణాల మీదకి వచ్చినప్పుడో మాత్రమే అత్యవసర విచారణలకు పూనుకుంటారు. అర్థరాత్రి వేళ కూడా న్యాయమూర్తులు విచారించిన సందర్భాలు అరుదైన పరిస్థితుల్లో ఉంటాయి. ఇంటి దగ్గరే కేసును విచారించి, తాత్కాలిక స్టే ఇవ్వడం అలాంటి కొన్ని ప్రత్యేక సందర్భాల్లోనే జరుగుతుంది. కానీ ప్రస్తుతం అటువంటి పరిస్థితులు ఉత్పన్నంకాకపోయినా అనూహ్యంగా కేసు విచారణకు స్వీకరించడం విశేషంగానే చెప్పాలి.

తాజా తీర్పుతో మరోసారి ఏపీ హైకోర్ట్ వ్యవహారాలు చర్చకు తెరలేపాయి. సోషల్ మీడయాలో పలువురు ఈ స్టే ని ప్రశ్నిస్తున్నారు. దీనిపై చర్చ జరగాల్సిన అవసరం ఉందంటున్నారు. ఆక్రమణల తొలగింపును సమర్థిస్తూ నిన్న తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు జీవీఎంసీ చర్యలను సమర్థించగా తాజా ఉత్తర్వులు విడ్డూరంగా ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.. ఏమయినా మరోసారి ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ న్యాయమూర్తుల వ్యవహారశైలి మీద ప్రజల్లో భిన్నాభిప్రాయాలకు తావిచ్చేలా నిర్ణయం వెలువడడం గమనార్హం.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp