నిమ్మగడ్డ.. పదవి కాలం పొడిగించుకునే ప్రయత్నాలు చేస్తున్నారా..?

By Jaswanth.T Jan. 13, 2021, 12:15 pm IST
నిమ్మగడ్డ.. పదవి కాలం పొడిగించుకునే ప్రయత్నాలు చేస్తున్నారా..?

ఏపీలో ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ గురించి ప్రస్తుతం ఈ వ్యాఖ్యే సోషల్‌ మీడియాలో జోరుగా విన్పిస్తోంది. తన నియామకానికి మూలకారులకు కృతజ్ఞత తీర్చుకోవడానికే కావొచ్చే లేదా తన ‘వారి’ కోసం కృషి చేసే స్వభావం కావొచ్చు.. కారణం ఏదైనా గానీ ప్రజల ఓట్లతో గెల్చి సీయం అయిన జగన్‌ ప్రభుత్వంతో మాత్రం గొడవలే లక్ష్యంగా.. వివాదమే మార్గంగా ఆయన వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిపోయింది. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలను నిజం చేసే విధంగానే ఆయన వ్యవహరిస్తున్నారని రాజకీయ వర్గాలు కూడా ఓ నిర్ణయానికొచ్చేసాయి.

జగన్‌ ప్రభుత్వం వచ్చాక నిమ్మగడ్డ వ్యవహారశైలితో వేగలేక ఆయన్ను తప్పించి రిటైర్డ్‌ జడ్జి కనగరాజ్‌ను ఎన్నికల కమిషనర్‌గా నియమించింది. అయితే కోర్టు ద్వారా మళ్ళీ తన పదవిని దక్కించుకున్న నిమ్మగడ్డ అప్పట్నుంచి తన ప్రతాపాన్ని ప్రభుత్వంపై చూపుతున్నారంటున్నారు. అందులో భాగంగానే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ను ప్రభుత్వ అభిప్రాయాలతో సంబంధం లేకుండా జారీ చేసేసారంటారు. ఆఖరికి ఉద్యోగ సంఘాలన్నీ ఏకమై మేం ఎన్నికలు నిర్వహించలేం అని ప్రకటించేంత వరకు విషయం వెళ్ళిపోయింది. ఉద్యోగ సంఘాల నేతలు మీడియా ముందుకొచ్చి ఉద్యోగుల ప్రాణాలను ఫణంగా పెట్టి విధులు నిర్వర్తించమనడం భావ్యం కాదని విన్నవించుకున్నారు. దీంతో ప్రభుత్వం కోర్టుకు వెళ్ళడంతో నిమ్మగడ్డ ఇచ్చిన ఎన్నికల ఉత్తర్వులను సస్పెండ్‌ చేయడం జరిగిపోయింది. దాదాపుగా ఈ తతంతం మొత్తం పరికిస్తే తెగే వరకు లాగేయడం లాగే ఉందని చెబుతారు ఎవరైనా. నిమ్మగడ్డ ఇక్కడితో ఆపి ఉండి ఉంటే ప్రజల నుంచి వ్యతిరేకత మూటగట్టుకోకుండా ఉండేవారంటున్నారు.

అయితే అందుకు భిన్నంగా ఆయన కూడా కోర్టును ఆశ్రయించడం ఇప్పుడు మరోసారి ఆయన వ్యవహారిశైలిపై ఉన్న అనుమానాలను మరింతగా బలపరుస్తున్నాయంటున్నారు. టీడీపీ నాయకులతో మంతనాలు, వారితో సన్మానాలు తదితర వ్యవహారాలు బైట పడ్డాక ఆయనపై అనుమానాలు పెరగడానికి కారణాలుగా నిలుస్తున్నాయి. ఎన్ని ఆరోపణలు వస్తున్నప్పటికీ ఆయన కూడా తన దోరణి తనదేనన్నట్టుగా ముందుకు పోతున్నారు.

నిజానికి ఇప్పటి వరకు కోర్టుల ద్వారా జరిగిన అన్ని వ్యవహారాల్లోను జగన్‌ ప్రభుత్వానికి దాదాపు అన్నీ వ్యతిరేకంగానే వచ్చాయని చెప్పాలి. ఎన్నికల నిర్వహణ విషయంలో మాత్రం ప్రభుత్వానికి అనుకూలంగా ఉత్తర్వులు రావడంతో ప్రత్యర్ధి వర్గాలు కంగుతిన్నాయంటున్నారు. ఈ నేపథ్యంలోనే జరిగిన పరిణామాలపై ఇప్పటి వరకు నేరుగా మీడియా ముందుకు రాకపోయినప్పటికీ తమ ప్రయత్నాల్లో తామున్నట్లుగా వార్తలొస్తున్నాయి. నోటిఫికేషన్‌ను సస్పెండ్‌ చేస్తూ వచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ డివిజనల్‌ బెంచ్‌ ముందుకు నిమ్మగడ్డ విషయాన్ని తీసుకువెళ్ళేందుకు సిద్దమైపోయారు. అంతే కాకుండా తన పదవిని మరో మూడు నెలలు పెంచుకునే విధంగా కూడా ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. జగన్‌ ప్రభుత్వం తనను మూడు నెలల పాటు తన విధులు నిర్వర్తించకుండా తప్పించింది కాబట్టి, ఆ మూడు నెలల పదవీ కాలాన్ని పెంచాల్సిందిగా నిమ్మగడ్డ కోర్టు ముందు వాదించుకోవడానికి సిద్ధమైనట్లుగా భావిస్తున్నారు. ఒక వేళ ఆయన ధోరణి ఇదే గనుక అయితే పైన చెప్పుకున్నట్లు గొడవ.. వివాదమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నట్టు ఖరారు చేసుకోవచ్చు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp