పదవి ఓకే.. పరువే ఏంగాను

By Jaswanth.T Sep. 30, 2020, 09:45 am IST
పదవి ఓకే.. పరువే ఏంగాను

ఏదైనా రాజకీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిని చేస్తానంటే ఎవ్వరైనా ఎగిరి గంతేస్తారు. ఇంకేముంది చక్కగా ఇస్త్రీబట్టలు కట్టుకుని, మైకుమందుకొచ్చి నచ్చింది మాట్లాడేయొచ్చు. కానీ కౌన్‌బనేగా కరోడ్‌పతీలో చివరాకర్న కోటి రూపాయలు పొందే క్వశ్చిన్‌కు సమాధానం తెలియకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో అటువంటి పదవొకటి ఏపీలో ఉందన్నది మీడియాలో టాక్‌ నడుస్తోంది. అదే ఆంధ్రప్రదేశ్‌ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి అంటున్నారు.

ముందే చెప్పుకున్నట్టు ఇస్త్రీబట్టల వరకు ఓకే గానీ ఇష్టమొచ్చింది మాట్లాడాలంటే మాత్రం ‘మంత్రదండం’ చేతిలో ఉన్న నారా ఫ్యామిలీ నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుందన్నది బహిరంగ రహస్యమే. ఈ నేపథ్యంలో ఏపీ టీడీపీ అధ్యక్ష పదవి ఇప్పటికిప్పుడు పొందినా ముళ్ళకిరీటం నెత్తినెట్టుకున్నట్టే ఉంటుందన్న భావన కూడా వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం ఏపీ టీడీపీకి కొత్త అధ్యక్షుడ్ని వెతికే పనిలో నారా పెద్దబాబు, చిన్నబాబులు బిజీబిజీగా ఉన్నారు. అచ్చెన్న పేరును ఖరారు చేసినట్టు లీకులు కూడా ఇచ్చేసారు. తద్వారా పార్టీలో ఎదురయ్యే అసంతృప్తులను బుజ్జగించేయొచ్చన్నది వారి ప్లాన్‌ అన్నట్టుగా తెలుస్తోంది. అయితే వారు ఆశించిన రీతిలో పెద్దగా ఇబ్బందులేమీ ఎదురుకాలేదని విమర్శకుల నుంచి విన్పిస్తున్న మాట.

అయితే ఏదో ఒకటి ఉందిలే అనుకుంటున్న ఇప్పటి వరకు ఉన్న అధ్యక్షుడు కళావెంకట్రావు ఒక్కరే కాస్తంత మనస్థాపం చెందారట. అయినప్పటికీ ఆయన కూడా తనను తాను సమాధాన పర్చేసుకున్నాడని కూడా వివరిస్తున్నారు. ఇప్పటి వరకు ఉన్నా స్వయంగా చేయగలిగింది, చేసేదీ ఏమీలేనప్పుడు ఉంటే ఎంత? ఊడితే ఎంత ఈ అధ్యక్ష పదవి అని ఆయన తన సన్నిహితుల వద్ద అన్నట్టు కోడై కూస్తోంది.

ఇదిలా ఉండగా ఇప్పుడు అధ్యక్ష పదవిలోకొచ్చేవారికి కూడా ముందున్నది పూలపాన్పేమీకాదన్నది వాస్తవం. ఒక పక్క రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్సార్‌సీపీ మాంచి జోరుమీదుంది. ఇంకో పక్క రాష్ట్రంలో టీడీపీ స్థానాన్ని కొట్టేయాలని బీజేపీ కాచుక్కూర్చుంది. వారికి జనసేన అండ ఎలాగూ ఉండనే ఉంది. వీటన్నిటికీ తోడు సొంత పార్టీలోనే నాయకుల్లో తీవ్ర జఢత్వంలో కూరుకుపోయారు. ఇప్పటికిప్పుడు చెర్నాకోల్‌తో తోలినాగానీ బండి గాడిన పడే పరిస్థితులు కనుచూపుమేరలో కన్పించడం లేదు.

ఇంతటి క్లిష్టపరిస్థితుల్లో రాష్ట్ర అధ్యక్ష పీఠంపైకెక్కి చేయగలిగిందేంటి? అన్న ఆలోచన అటు అచ్చెన్నక్కూడా కలిగిందని సోషల్‌ మీడియా కోడై కూస్తోంది. అలాగే నాయకుల్ని పరుగులు పెట్టించే క్రమంలో కొందరికి తప్పకుండా ఇబ్బంది ఏర్పడితే ఆ ప్రభావం తనపై వ్యక్తిగతంగా కూడా ఉంటుందని భావిస్తున్నారట. ఈ నేపథ్యంలోనే అటు కళావెంకట్రావు అలక, ఇటు అచ్చెన్నకు వచ్చిన సందేహాల నడుమ కొత్త అధ్యక్షుడి పేరు ప్రకటించడంలో ఆలస్యమవుతుందుంటున్నారు.

అంతే కాకుండా తనను మించిన మేథావులెవరైనా పక్క నుంటే లోకేష్‌బాబు ఒప్పుకోరని, మంచి వాగ్ధాటి, విషయపరిజ్ఞానం, మాటకారితనం, అనుభవం ఉన్న అచ్చెన్నాయుడికి రాష్ట్ర అధ్యక్ష పదవి కట్టబెడితే తాను వెనకబడిపోతాననే భయం కూడా లోకేష్‌ వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఒక పక్క పీఠమెక్కాల్సిన వారికీ అనుమానం ఉండి, మరో పక్క పక్కకెళ్ళమన్నవారికీ ఇబ్బంది కలిగి, మరింకో పక్క పదవి ఇవ్వాల్సిన వాళ్ళలో అనుమానాలు ఉంటే.. సదరు పదవిలోకొచ్చే వ్యక్తి ఎంత వరకు తట్టుకోగలుగుతారంటారు? అన్న అనుమానం ప్రస్తుతం టీడీపీ శ్రేణుల నుంచే వ్యక్తం కావడం కొసమెరుపు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp