కమల దళానికి కొత్త దళపతి

By Sridhar Reddy Challa Jan. 20, 2020, 05:38 pm IST
కమల దళానికి కొత్త దళపతి

డిల్లీకి వెళ్లే రహదారి లక్నో నుండి మొదలవుతుందని రాజకీయాల్లో చాలాకాలం నుండి ఉన్న నానుడి. దానిని మరోసారి నిజం చేస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా జగత్ ప్రకాష్ నడ్డా బాధ్యతలు స్వీకరించారు. 2019లో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన సమయంలోనే అప్పటి అధ్యక్షుడు అమిత్ షా జేపీ నడ్డాను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించారు.

వాస్తవానికి నడ్డా 2019 సంవత్సరం చివరిలోనే పార్టీ పగ్గాలు చేపట్టాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల ఆ కార్యక్రమం వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈరోజు ఢిల్లీలోని బిజెపి కేంద్ర కార్యాలయంలో పార్టీ పగ్గాలు నడ్డాకు అప్పగించారు. నామినేషన్ ప్రక్రియలో కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీలతో పాటు పలువురు బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొని పార్టీ నూతన అధ్యక్షుడిగా జెపి నడ్డా పేరుని పేరును ప్రతిపాదించారు. దీనితో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కేంద్ర మంత్రి రాధా మోహన్ సింగ్ జెపి నడ్డా కి నియామక పత్రాలని అందించారు.

ఇప్పటివరకు బిజెపి అధ్యక్షునిగా వ్యవహరించిన అమిత్ షా 2019 ఎన్నికల తర్వాత ఏర్పడిన ప్రభుత్వంలో కేంద్ర హోం శాఖా మంత్రిగా కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో అమిత్ షా పార్టీని సమర్ధవంతంగా నడిపించి బిజెపిని రెండవ సారి అధికారంలోకి తీసుకురావడంలో కీలకంగా వ్యవహరించడంతో ఆయన మొదటిసారి కేంద్ర ప్రభుత్వంలో చేరి హోం మంత్రి గా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి ఓవైపు ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తూనే మరోవైపు పార్టీని నడిపిస్తూ వస్తున్నారు. అయితే పార్టీ నీయమావళి ప్రకారం "ఒక వ్యక్తికి ఒకే పదవి" అనే నిబంధన ఉండడంతో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన సమయంలోనే అమిత్ షా జేపీ నడ్డాను వర్కింగ్ ప్రసిడెంట్‌గా నియమించారు.

విద్యార్థి దశ నుండి ఎబివిపి లో చురుగ్గా పాల్గొనడం ద్వారా రాజకీయాల్లో అడుగుపెట్టిన జెపి నడ్డా మొదటి నుండి ఆర్.యస్.యస్ తో కూడా అనుబంధం వుంది. 2104 ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఎస్పీ-బీఎస్పీ-ఆర్‌ఎల్‌డి కూటమిని ఓడించడంలో తరువాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లో బిజెపి అత్యధిక స్థానాల్లో విజయం సాధించడంలో ముఖ్యపాత్ర పోషించిన నడ్డా ఆ విజయంతో పార్టీ అధిష్టానంలో మోడీ, అమిత్ షా దగ్గర మంచి పేరు సంపాదించారు. దానికి గుర్తింపుగానే పార్లమెంటు ఎన్నికలలో బిజెపి చారిత్రాత్మక విజయం అనంతరం ఆయన బిజెపి వర్కింగ్ ప్రసిడెంట్ పదవిని పొందారు.

స్వతహాగా బీహార్ రాష్ట్రానికి చెందిన వాడైనప్పటికీ నడ్డా మొదటిసారి 1993 లో హిమాచల్ ప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యారు. తిరిగి 1997 లో కూడా బిలాస్ పూర్ స్థానం నుండి హిమాచల్ ప్రదేశ్ శాసనసభకు రెండవసారి ఎన్నికయ్యారు. 2008 నుండి 2010 వరకు ప్రేమ్ కుమార్ ధుమల్ క్యాబినెట్ లో రాష్ట్ర అటవీ, పర్యావరణ, విజ్ఞాన మరియు శాస్త్ర సాంకేతిక శాఖా మంత్రిగా పనిచేశారు. నడ్డా 2012 లో హిమాచల్ ప్రదేశ్ నుండి మొదటిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2014 లో కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో మోడీ ప్రభుత్వంలో కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రిగా సమర్ధవంతంగా పనిచేసి బిజెపి అధిష్టానం దగ్గర మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

నడ్డా వ్యక్తిగత వివరాల్లోకి వెళితే ఆయన 1960 డిసెంబర్ 2 న పాట్నాలో నరైన్ లాల్ నడ్డా మరియు కృష్ణ నాడ్డ దంపతులకు జన్మించారు. పాట్నాలోని సెయింట్ జేవియర్స్ పాఠశాలలో ప్రాధమిక విద్యనభ్యసించారు. ఆ తర్వాత పాట్నా విశ్వవిద్యాలయంలో బిఎ పూర్తిచేసిన నడ్డా సిమ్లాలోని హిమాచల్ ప్రదేశ్ విశ్వవిద్యాలయం నుండి ఎల్.ఎల్.బి పట్టా పొందారు. తన చిన్నతనంలో ఢిల్లీ లో జరిగిన ఆల్ ఇండియా జూనియర్ స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్‌లో బీహార్‌కు ప్రాతినిధ్యం వహించాడు. నడ్డా 1991 లో మల్లికా నడ్డాను వివాహం చేసుకున్నాడు, ఆయనకీ ఇద్దరు కుమారులు ఉన్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp