మధ్యప్రదేశ్‌లో బిజెపి ప్రభుత్వానికి తలనొప్పి వ్యవహారంగా మారిన కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు

By Srinivas Racharla Jul. 05, 2020, 07:40 pm IST
మధ్యప్రదేశ్‌లో బిజెపి ప్రభుత్వానికి తలనొప్పి వ్యవహారంగా మారిన కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు

మధ్యప్రదేశ్‌లో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తన మంత్రివర్గాన్ని విస్తరించి మూడు రోజులు గడిచిపోయాయి. ఇప్పటికే మంత్రి పదవులు ఆశించిన అధికార బిజెపి సీనియర్ ఎమ్మెల్యేలు సీఎం చౌహాన్‌పై గుర్రుగా ఉన్నారు.తాజాగా కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు బిజెపి ప్రభుత్వానికి తలనొప్పి వ్యవహారంగా తయారయింది.

మూడు రోజుల క్రితం సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌ మంత్రివర్గ విస్తరణ చేసినప్పటికీ ఇప్పటివరకు మంత్రులకు శాఖలు కేటాయింపు జరగలేదు.కేబినెట్ విస్తరణలో తన ఆసక్తికి అనుకూలంగా కాకుండా పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ నడుచుకున్నాడు.ఇక జ్యోతిరాదిత్య సింధియా శిబిరం ప్రధాన మంత్రిత్వ శాఖల కోసం పట్టుపట్టడంతో పోర్ట్‌ఫోలియోల కేటాయింపు నిలిచిపోయింది.

ఇక ఉప ఎన్నికలకు ముందు తమ మంత్రులను ప్రజల దృష్టిని ఆకర్షించే కీలక మంత్రిత్వ శాఖలలో ఉంచాలని సింధియా శిబిరం యోచిస్తోంది.దీంతో బై పోల్ లో విజయం సాధించడానికి ప్రధాన పోర్ట్‌ఫోలియోలు అవసరమని సింధియా వర్గం వాదిస్తుండటంతో శాఖల కేటాయింపు సీఎంకు శిరోభారాన్ని పెంచింది.

ఇప్పటికే ఇద్దరు సింధియా విధేయులు తులసీరామ్ సిలావత్,గోవింద్ సింగ్ రాజ్‌పుత్ వరుసగా నీటిపారుదల శాఖ మరియు ఆహార,పౌర సరఫరాల శాఖలను కలిగి ఉన్నారు.కాగా జ్యోతిరాదిత్య వర్గ మంత్రులు పాఠశాల విద్య, రవాణా, పర్యాటక రంగం, మహిళలు మరియు పిల్లల అభివృద్ధి, పట్టణ పరిపాలన, ఆరోగ్యం, సాధారణ పరిపాలన వంటి ముఖ్యమైన పోర్ట్‌ఫోలియోల కోసం పట్టుబడుతున్నారు. అయితే సీఎం చౌహాన్‌తో పాటు పార్టీ సీనియర్ నేతలు కూడా ఈ ప్రధాన మంత్రిత్వ శాఖలను సింధియా వర్గ మంత్రులకు ఇవ్వడానికి సుముఖంగా లేరు.ఈ నేపథ్యంలో మంత్రులకు పోర్ట్‌ఫోలియోల కేటాయింపులోను పార్టీ హైకమాండ్ మధ్యవర్తిత్వం వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కాగా ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ కూడా పార్టీలో అంతర్గత గొడవను నివారించడానికి శాఖల కేటాయింపు వ్యవహారాన్ని పార్టీ హైకమాండ్‌కు వదిలివేయాలని నిర్ణయానికి వచ్చారు.ఈ నేపథ్యంలో శనివారం రాత్రి ఆయన సమస్య పరిష్కారానికి ఢిల్లీకి వెళ్లి పార్టీ హైకమాండ్‌తో చర్చించనున్నట్లు వార్తలు వెలువడ్డాయి. కానీ ఢిల్లీ పర్యటనకు ముందు పార్టీ సీనియర్‌లను కలవడంతో పాటు, సింధియాతో సమావేశం కావాలని చౌహాన్‌ భావిస్తున్నారు.దీంతో నాయకుల అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాతనే ఆయన ఢిల్లీ పర్యటన ఉండవచ్చని తెలుస్తుంది.

మధ్యప్రదేశ్ కేబినెట్‌లో సీఎం మినహా మిగిలిన 33 మంది మంత్రులలో 14 మంది సింధియా శిబిరానికి చెందిన వారు కావడం గమనార్హం.
ఇదిలా ఉంటే శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వ మంత్రివర్గంలో చేరిన మధ్యప్రదేశ్ స్పీకర్ జగదీష్ దేవదా తన పదవికి రాజీనామా చేశారు.కాగా శనివారం రెండుసార్లు ఎమ్మెల్యే అయిన బిజెపి సీనియర్ నేత రామేశ్వర్ శర్మను యాక్టింగ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ప్రో-టెమ్ స్పీకర్‌గా నియమించారు.ప్రస్తుతం ఆయన భోపాల్ జిల్లాలోని హుజూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

ఉప ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మంత్రుల శాఖల కేటాయింపు వ్యవహారం అధికార బీజేపీలో అంతర్గత పోరుకు దారి తీస్తుందేమోనని సీఎం చౌహాన్ ఆందోళన చెందుతున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp