మాన్సాస్ తెరపై కొత్త వివాదాలు

By Ramana.Damara Singh Jun. 21, 2021, 02:30 pm IST
మాన్సాస్ తెరపై కొత్త వివాదాలు

మన్సాస్ ట్రస్ట్.. గత కొద్దిరోజులుగా వార్తల్లో నలుగుతున్న ఈ సంస్థపై ఇప్పటికీ అనేక ప్రశ్నలు, సందేహాలు సమాధానం దొరకనివిగానే ఉన్నాయి. విజయనగరం మహారాజులకు చెందిన ఈ ట్రస్టుపై ఆధిపత్యం కోసం జరుగుతున్న పోరాటం.. దాని చుట్టూ ముసురుకున్న వివాదాలు.. ప్రభుత్వం, కోర్టు జోక్యంతో మాన్సాస్ రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఆసక్తి రేపింది.

ట్రస్టుతో పాటు దాని పరిధిలోని సింహాచలం, రామతీర్థాలుతో సహా వందకుపైగా దేవాలయాలకు అనువంశిక ధర్మకర్తగా ఉన్న మాజీమంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు స్థానంలో అదే కుటుంబానికి చెందిన సంచయిత గజపతిరాజును గత ఏడాది మార్చిలో ప్రభుత్వం నియమించింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ అశోక్ గజపతి హైకోర్టును ఆశ్రయించారు. కుటుంబ సంస్థ అయిన మాన్సాస్ నిబంధనల ప్రకారం.. అనువంశికంగా తమ కుటుంబానికి చెందిన పురుషులు.. అందరికంటే వయసులో పెద్దవారే చైర్మన్ గా ఉండాలని.. మహిళలకు ఆ హక్కు లేదని ఆయన కోర్టులో వాదించారు. ఆయన వాదనతో ఏకీభవించిన కోర్టు మహిళ అయిన సంచయిత నియామకం చెల్లదంటూ కొట్టివేసింది. దాంతో మళ్లీ అశోక్ ట్రస్ట్ పగ్గాలు చేపట్టారు. ఇక్కడే కొన్ని సందేహాలు, ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రస్తుత చైర్మన్ అశోక్ కు గానీ.. ఆయన సోదరుడు దివంగత ఆనంద గజపతి గానీ మగ సంతానం లేదు.

మరి అలాంటప్పుడు అశోక్ తర్వాత ఎవరు చైర్మన్ అవుతారన్న ప్రశ్న తలెత్తుతోంది. ఆ కుటుంబానికి ఆనంద్, అశోక్ సంతనాలే తప్ప వేరే వారసులు లేరా.. ఉంటే వారు తమకు హక్కు ఉందని ముందుకు రావచ్చా.. అసలు మహిళలు ట్రస్ట్ బాధ్యతలు ఎందుకు చేపట్టకూడదు. అప్పుడెప్పుడో చేసిన ఆ నిబంధనను మార్చే అవకాశమే లేదా.. ఇవన్నీ తెలుసుకోవాలంటే పూసపాటి రాజుల వంశ వృక్షంలోకి కాస్త తొంగి చూడాలి.

పీవీజీ రాజు దాతృత్వం

విజయనగరం పూసపాటి రాజవంశానికి చెందిన చివరి రాజైన స్వర్గీయ పీవీజీ రాజు 1958లో తన తండ్రి మహారాజా అలక్ నారాయణ పేరుతో మాన్సాస్ ట్రస్ట్ ఏర్పాటు చేశారు. రాజ కుటుంబానికి చెందిన వందల కోట్ల ఆస్తులను దానికి ధారాదత్తం చేశారు. వందకు పైగా ఆలయాలు, వేలాది ఎకరాల భూములు, విద్యాలయాలు ఉన్న ఈ వ్యవస్థకు అనువంశికంగా తమ కుటుంబంలో అందరికంటే పెద్దవారైన మగవారు ట్రస్టు చైర్మన్ గా, దాని పరిధిలోని ఆలయాలకు ధర్మకర్తల మండలి అధ్యక్షులుగా ఉండాలని నిబంధన పెట్టారు. అలాగే ట్రస్ట్ బాధ్యతలు చేపట్టేందుకు మహిళలు అనర్హులని పేర్కొంటూ మరో నిబంధన పెట్టారు. పీవీజీ రాజే వ్యవస్థాపక చైర్మన్, ధర్మకర్తగా వ్యవహరించారు. ఆయన తదనంతరం పీవీజీ పెద్దకుమారుడు ఆనంద గజపతిరాజు చైర్మన్ అయ్యారు. ఆయన కాలం చేయడంతో సుమారు నాలుగేళ్ల క్రితం అశోక్ గజపతి ఆ బాధ్యతలు స్వీకరించారు. ఆనందుకు ఇద్దరు, అశోక్ కు ఒక కుమార్తె ఉన్నారు. మగ సంతానం లేదు.

వేరే వారసులు లేరా?

ఆనంద గజపతికి ఇద్దరు భార్యలు. తొలి భార్య ఉమాగజపతి కూతురే సంచయిత. ఈమె ఉమకు విడాకులు ఇచ్చి గతంలోనే సెటిల్ చేసుకున్నారు. రెండో భార్య కూతురు ఊర్మిళ. అశోక్ ఏకైక కుమార్తె అదితి. మహిళలు అయినందున వారికి ట్రస్టు బాధ్యతలు చేపట్టే అర్హతలు లేవని మన్సాస్ నిబంధనలు, కోర్టు తీర్పు స్పష్టం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అశోక్ తర్వాత ఈ బాధ్యతలు చేపట్టే హక్కు ఎవరికి ఉందని తరచి చూస్తే.. పీవీజీ రాజుకు ఆనంద్, అశోక్ ల తల్లి కాకుండా మరో భార్య ఉండేవారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన ఆమెకు పీవీజీ విడాకులు ఇచ్చి.. చాలా ఆస్తులు కూడా రాసిచ్చారు.

దాంతో ఆ కుటుంబం రాజా కుటుంబానికి, ఇక్కడి వ్యహారాలకు పూర్తి దూరంగా చెన్నైలో స్థిరపడింది. పీవీజీ ద్వారా ఆమెకు ఇద్దరు మగపిల్లలు కలిగారు. పెద్దవాడు అలోక్ గజపతి, రెండోవాడు మోనిష్ గజపతి. అలోక్ కు ఒక కుమారుడు.. విహాన్ గజపతి అలియాస్ సిద్ద్ధార్థ ఉండగా.. మోనిష్ పెళ్లి చేసుకోలేదు. వీరికి ఇప్పటికీ అశోక్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. తాజా వివాదం నేపథ్యంలో మాన్సాస్ పై అశోక్ తర్వాత తనకు ఆధిపత్యం దక్కాలని అలోక్ క్లెయిమ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే విడాకులు, ఆస్తులు తీసుకొని ఎప్పుడో విడిపోయినందున చట్టప్రకారం అది చెల్లదన్న వాదన ఉంది. అయితే తన తల్లి కూడా విడాకులు తీసుకొని వేరు పడిపోయిన.. సంచయిత వారసురాలినంటూ తెరపైకి వచ్చినట్లే భవిష్యత్తులో అలోక్ లేదా ఆయన కుమారుడు విహాన్ తెరపైకి వస్తే వివాదం మరింత ముదురుతుంది.

ఎంత కుటుంబ వ్యవస్థ అయినా.. అనువంశిక ఆధిపత్యానికి మహిళలకు హక్కు లేకుండా చేయడం కూడా భిన్న వాదనలకు అవకాశమిస్తోంది. ఆ నిబంధనను ఇక ఎవరూ మార్చే అవకాశం లేదా అన్న చర్చ జరుగుతోంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp