ఇసుక పాలసీలో మరింత పారదర్శకత, జగన్ సర్కారు కీలక నిర్ణయం

By Raju VS Oct. 22, 2020, 12:15 pm IST
ఇసుక పాలసీలో మరింత పారదర్శకత, జగన్ సర్కారు కీలక నిర్ణయం

అనుకున్నట్టే జరిగింది. జగన్ మరోసారి ఇసుక విషయంలో పగడ్బందీ నిర్ణయం తీసుకున్నారు. ఏడాది కాల అనుభవాలు సమీక్షించి, పారదర్శకంగా ఇసుక విధానంలో మార్పులకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా ఇప్పటి వరకూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు. వాటిని మార్పు చేస్తున్నట్టు ప్రకటించారు. తమది ప్రజల ప్రభుత్వమని నిరూపించుకుంటూ ఇలాంటి మార్పులు చేస్తున్న తరుణంలో ఇసుక దందాకు పూర్తిగా చెక్ పడుతుందనే ఆశాభావం సర్వత్రా వినిపిస్తోంది.

ఇసుక విధానంలో కీలక మార్పులు

- ఇప్పటి వరకూ కేవలం ఆన్ లైన్ లోనే ఇసుక బుక్ చేసుకునే అవకాశం ఉంది. కానీ దానిని పక్కదారి పట్టించడం, అందరికీ ఆన్ లైన్ లో బుక్ చేసుకునే అవకాశం లేకపోవడంతో ఇకపై నేరుగా ర్యాంపుల వద్ద డబ్బులు చెల్లించి ఇసుకను తీసుకెళ్లే అవకాశం తీసుకొచ్చారు. సిఫార్సులతో పనిలేకుండా ఇది అమలు చేయాలని నిర్ణయించారు

- ఇన్నాళ్లుగా కేవలం ప్రభుత్వం నిర్ణయించిన వాహనంలోనే ఇసుక డెలివరీ జరిగేది. ఇకపై అలాంటి నిబంధన లేదు. వినియోగదారులు తమ వీలుని బట్టి ఏర్పాటు చేసుకోవచ్చు.

- ప్రస్తుతం ప్రభుత్వం పంపించిన ఇసుకనే తీసుకోవాలని రూల్ ఉంది. దానిని తొలగించారు. అవసరమైన వారు తమ సమీపంలోని వాగుల నుంచి ఉచితంగా ఇసుక తీసుకోవచ్చు. కూపన్ సిస్టమ్ ద్వారా రాయితీపై కూడా ఇసుక ఇస్తారు. వినియోగదారులు నాణ్యతను పరిశీలించిన తర్వాత ఇసుక తీసుకెళ్లే అవకాశం ఉంది. రాష్ట్రమంతా ఇసుకకి ఒకే ధర ఉంటుంది. ర్యాంపుల నుంచి దూరం ఆధారంగా రవాణా ఛార్జీలు నిర్ణయిస్తారు.

ఇవన్నీ కీలక మార్పులుగా పరిగణించాలి. గత దశాబ్దకాలంగా ఇసుక పెద్ద సమస్యగా మారుతోంది. చివరకు రాజకీయంగానూ ప్రభావితం చేస్తోంది. ఇసుక మాఫియా వ్యవహారాలకు అడ్డు లేదన్నట్టుగా సాగుతోంది. ఈ సమయంలో జగన్ కఠిన నిర్ణయాలు తీసుకుని ఇసుక మాఫియాను కట్టడి చేసే ప్రయత్నం చేశారు. ఫలితంగా సామాన్యులకు కొంత చిక్కులు తప్పలేదు. ఇసుక అక్రమ రవాణా నియంత్రించేందుకు ప్రత్యేకంగా స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరోని కూడా రంగంలో దించారు.

ఈ నేపథ్యంలో ప్రజల సమస్యలను గమనంలో ఉంచుకుని ఇసుక విధానం కొంత సరళతరం చేసేందుకు సమాయత్తమయ్యారు. అదే సమయంలో ఇసుక మాఫియాకు అవకాశం లేకుండా చూడాలని సంకల్పించడంతో కొత్త ఇసుక విధానంలో ప్రజల అభిప్రాయాలకు ప్రభుత్వం గౌరవించినట్టుగా కనిపిస్తోంది.

మంత్రివర్గ ఉపసంఘం చేసిన సూచనలతో పాటుగా ప్రజలు కూడా తమ అభిప్రాయాలు పంచుకోవాలని ప్రభుత్వం చెబుతోంది. వారం రోజుల పాటు సూచనలకు అవకాశం ఇచ్చింది. అన్నింటినీ మధించి మరింత మెరుగ్గా ఇసుక విధానం మార్చందుకు సమాయత్తమవుతోంది. ఇసుక వంటి అంశాలలో ఇలా ప్రజల అభిప్రాయాలకు పెద్ద పీట వేసే ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేదని పలువురు చెబుతున్నారు. దీనిని అందరూ ఆహ్వానించాల్సిందేనంటున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp