Mamata,kejriwal ,Congress - కాంగ్రెస్‌కి కొత్త సవాల్, ఆపార్టీల నుంచే పెద్ద ముప్పు

By Raju VS Nov. 27, 2021, 08:00 am IST
Mamata,kejriwal ,Congress - కాంగ్రెస్‌కి కొత్త సవాల్, ఆపార్టీల నుంచే పెద్ద ముప్పు

కాంగ్రెస్ పార్టీ మరోసారి తన ఉనికిని చాటుకోవాలని బలంగా ప్రయత్నిస్తోంది. సోనియా ఆరోగ్య పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ రాహుల్‌కి తోడుగా ప్రియాంక మాత్రం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లాంటి చోట్ల కూడా కాంగ్రెస్ ప్రభావం కనిపించేలా చేయగలిగారు. ఇక మోదీ ప్రభుత్వం మీద పెరుగుతున్న వ్యతిరేకత దేశవ్యాప్తంగా తమకు బలం పెంచుతుందనే ధీమా ఆపార్టీ శ్రేణుల్లో ఉంది.అయితే నేతల మధ్య సఖ్యత లేకపోవడం కాంగ్రెస్‌ని కష్టాల నుంచి కోలుకోవడానికి ఆస్కారం లేకుండా చేస్తోందనే అభిప్రాయం ఉంది. దానికి తోడు అధిష్టానం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు కాంగ్రెస్ తిరిగి గాడిలో పడడానికి బదులుగా మరింత ఇరకాటంలో పడేందుకు మూలమవుతోంది.

ఈ నేపథ్యంలో మోదీ హవాకి అడ్డుకట్ట వేయాలనే కాంగ్రెస్ ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయోననే చర్చ సాగుతోంది. ముఖ్యంగా 2024 పార్లమెంట్ ఎన్నికలకు ముంగిట 2022 లో జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్‌కి కీలకం కాబోతున్నాయి. 2019 సాధారణ ఎన్నికలకు ముందు కూడా కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ సానుకూల ఫలితాలు సాధించినా వాటిని నిలబెట్టుకోలేకపోయింది. కానీ ఈసారి గతం నుంచి పాఠాలు నేర్చుకుని బలోపేతం అవుతామనే ధీమాతో సాగుతోంది. అందుకు తగ్గట్టుగా పార్లమెంట్‌లోనూ, బయట బీజేపీకి ధీటుగా నిలిచేందుకు రాహుల్ శ్రమిస్తున్నారు. వివిద సందర్భాల్లో కొంత మేరకు ఆకట్టుకుంటున్నారు. ప్రత్యామ్నాయ నేతగా పూర్తి విశ్వాసం ప్రజల్లో కల్పించలేకపోయినా కొంత పోరాడుతున్నారనే అభిప్రాయం కల్పించడంలో మెరుగుదల ఉంది.

ఓవైపు బీజేపీని ఎదుర్కొని నిలదొక్కుకోవాలని కాంగ్రెస్ ఆశిస్తుంటే రెండో వైపు కాంగ్రెస్‌కే మంట పెడుతూ కొత్త కుంపటి సిద్ధమవుతోంది. వివిధ రాష్ట్రాల్లో పలు పార్టీల నేతలు కాంగ్రెస్ మీద కన్నేసి ఆపార్టీని ఖాళీ చేసేందుకు సంకల్పించారు. అందులో మమతా బెనర్జీ కొన్ని రాష్ట్రాల్లోనూ, ఆమ్ ఆద్మీ పార్టీ మరికొన్ని చోట్ల కాంగ్రెస్ ఓటు బ్యాంకు కొల్లగొట్టేందుకు కాచుకుని కూర్చున్నాయి.టీఎంసీ,ఆప్ పలువురు కాంగ్రెస్ నేతలను తమవైపునకు తిప్పుకుంటున్నాయి.ఈ పరిణామాలు కాంగ్రెస్‌ని కలవరపెడుతున్నాయి.ఇది రాజకీయంగా ఇరువైపులా కాంగ్రెస్‌కి కష్టాలు తెచ్చే దిశలో సాగుతోంది.

Also Read : Bjp.Modi - గెలుపు కోసం ప్రయాస.. మోడీ లక్ష్యం చేరేనా..?

బీజేపీ, మోదీ ప్రభుత్వ వ్యతిరేకత తమకు మేలు చేస్తుందని కాంగ్రెస్ విశ్వసిస్తోంది. పదేళ్ల పాలనలో పెద్దగా అభివృద్ధి ఛాయలు లేకపోవడంతో ప్రజలను తమకే పట్టంకడతారని అంచనా వేస్తోంది. కానీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చేలా టీఎంసీ, ఆప్ అడుగులు వేస్తు ఉన్న సంగతి కాంగ్రెస్ శిబిరంలో కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఇటీవల ఉప ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కి కొంత ఆశావహ వాతావరణం కల్పించాయి. కానీ త్రిపుర, అసోం, తాజాగా మేఘాలయ, అంతకుముందు గోవా వంటి చోట్ల కాంగ్రెస్ నేతలకు మమతా బెనర్జీ వల విసరడం కీలక పరిణామంగా భావించాలి. ఓవైపు కాంగ్రెస్ నాయకత్వంలో జాతీయ స్థాయిలో మోదీ వ్యతిరేక కూటమి సాధ్యమా కాదా అనే చర్చ సాగుతుండగానే వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ స్థానాన్ని కాజేసేందుకు మమతా బెనర్జీ ప్రయత్నిస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్ల చీలిక తిరిగి బీజేపీ బలోపేతమయ్యేందుకు దోహదపడుతుందనే అబిప్రాయం ఉన్నప్పటికీ మమతా మాత్రం వెనక్కి తగ్గడం లేదు.

ఇక పంజాబ్‌లో ఆప్ దాదాపుగా కాంగ్రెస్‌కు గట్టి పోటీ ఇవ్వడమే కాకుండా,అధికార కాంగ్రెస్‌ను అధిగమిస్తుందా అనే చర్చ సాగుతోంది.ఉత్తరాఖండ్‌లో బీజేపీ ప్రభుత్వం మీద ఉన్న అసంతృప్తిని ఆప్ చీలిస్తే కాంగ్రెస్ ఆశలు గల్లంతవుతాయి. గుజరాత్ లో కూడా కాంగ్రెస్ కి పోటీగా ఆప్ ముందుకొస్తోంది. సూరత్ వంటి నగరాల్లో కాంగ్రెస్ మీద ఆప్ దే ఆధిక్యం కావడం విశేషం. ఇలా ఈ రెండు పార్టీలు కాంగ్రెస్‌ను అనేక చోట్ల కుదేలు చేసేలా కనిపిస్తోంది. అనివార్యంగా అది బీజేపీకి మేలు చేసినా కేజ్రీవాల్, మమతా కూడా వెనక్కి తగ్గడం లేదు. తద్వారా మళ్లీ మోదీ సర్కారుకి ఇది మేలు చేస్తుందనే అంచనా ఉన్నప్పటికీ జాతీయ రాజకీయాల మీద ఆసక్తితో రాహుల్ కంటే తామే బలమైన నేతలమని భావిస్తున్న దీదీ, కేజ్రీ చివరకు ఏం చేస్తారన్నది కాంగ్రెస్ పార్టీలో పెద్ద చర్చ సాగుతోంది. అసలే అనేక రాష్ట్రాల్లో బలహీనమవుతూ బీజేపీని ఎదుర్కోవడానికి అపసోపాలు పడుతున్న దశలో ఈ పార్టీల నుంచి ముప్పు కాంగ్రెస్ ఆశలపై నీళ్లు జల్లేలా మారుతోంది.

Also Read : Sonia Mamata -సోనియ‌మ్మా.. దీదీ మాట‌లు విన్నారా?

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp