ఆంధ్రాలో కోవిడ్ కట్టడికి నేవీ చేయూత

By Ramana.Damara Singh May. 12, 2021, 12:57 pm IST
ఆంధ్రాలో కోవిడ్ కట్టడికి నేవీ చేయూత

ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కరోనాను కట్టడి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు తనవంతు చేయూత అందించేందుకు నౌకాదళం ముందుకొచ్చింది. ప్రభుత్వ ప్రతినిధులతో కొద్దిరోజుల క్రితం జరిగిన చర్చల్లో ఇచ్చిన హామీ మేరకు కార్యాచరణ ప్రారంభించింది. అందులో భాగంగా విశాఖ నగర శివారు భీమిలి వద్ద ఉన్న నేవీ ఆస్పత్రి ఐఎన్ఎస్ కళింగను కోవిడ్ కేర్ సెంటర్ గా మార్చారు. దీన్ని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఇదే కాకుండా మెడికల్ ఆక్సిజన్ రవాణా, ఆక్సిజన్ ప్లాంట్ల నిర్వహణలో ఏపీ ప్రభుత్వానికి సహకరించేందుకు విశాఖ కేంద్రంగా పనిచేస్తున్న తూర్పు నౌకాదళం అధికారులు అంగీకరించారు.

60 పడకల ఆస్పత్రి

విశాఖ-భీమిలి బీచ్ రోడ్డులో నేవీకి చెందిన క్షిపణి కేంద్రం ఉంది. ఇందులో నేవీ సిబ్బంది కోసం ఐఎన్ఎస్ కళింగ ఆస్పత్రి నిర్వహిస్తున్నారు. రక్షణ శాఖకు చెందిన ఈ క్షిపణి కేంద్రం పూర్తిగా నిషేధిత ప్రాంతం. నేవీకి చెందినవారికి తప్ప సాధారణ పౌరులకు ప్రవేశం ఉండదు. కానీ కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో నిబంధనలను సడలించి కోవిడ్ బాధితులందరికీ సేవలందించేందుకు వీలు కల్పించారు. ప్రస్తుతం కళింగలో 60 పడకలు ఏర్పాటు చేశారు. వీటిలో 12 ఆక్సిజన్ పడకలు కాగా.. మిగతా 48 సాధారణ బెడ్లు. ముగ్గురు వైద్యుల పర్యవేక్షణలో నిర్వహిస్తున్న ఈ ఆస్పత్రిలో చేరే రోగులకు మూడుపూటలా ఉచిత భోజన సౌకర్యం కల్పిస్తున్నారు. కోవిడ్ పాజిటివ్ రిపోర్టుతో వచ్చే వారెవరైనా ఇక్కడ చేరవచ్చని నేవీ అధికారులు తెలిపారు. కాగా విశాఖ నగరంలో
కంచరపాలెం ప్రాంతంలో 150 పడకలతో తాత్కాలిక కోవిడ్ ఆస్పత్రి ఏర్పాటు చర్యలను కూడా నేవీ అధికారులు చేపట్టారు.

ఆక్సిజన్ వ్యవస్థల పర్యవేక్షణ

మరోవైపు రాష్ట్రంలో మెడికల్ ఆక్సిజన్ రవాణా, వ్యవస్థల నిర్వహణలోనూ సహకరించేందుకు నేవీ సిద్ధమైంది. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు ఇటీవల విశాఖలో నేవీ అధికారులతో జరిపిన చర్చల్లో ఈ అంగీకారం కుదిరింది. ఇప్పటికే ఆస్పత్రిని అందుబాటులోకి తెచ్చారు. అన్ని ప్రభుత్వ, బోధన ఆస్పత్రుల్లో మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్ల నిర్వహణ, లీకేజీల వంటి లోపాలను సరిచేయడం.. వాటిని నిరంతరం పర్యవేక్షించేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి.. ఒక్కో బృందానికి మూడు నాలుగు జిల్లాలు కేటాయిస్తారు. ఈ బృందాలను అవసరమైన ప్రాంతాలకు వాయుమార్గంలో తరలిస్తారు. సింగపూర్, మలేషియా, థాయిలాండ్ దేశాల నుంచి 25 క్రయోజనిక్ కంటైనర్లను తీసుకురావడంతోపాటు నేవీ తరఫున ఆక్సిజన్ కాంసెంట్రేటర్లు, డీ టైప్ సిలిండర్లు, ఇతర వైద్య పరికరాలు సమకూర్చేందుకు నేవీ సన్నాహాలు చేస్తోంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp