పెరుగుతున్న వ్యసనం..

By Jaswanth.T Dec. 16, 2020, 02:35 pm IST
పెరుగుతున్న వ్యసనం..
మద్యపానం.. ఒకప్పుడు అత్యంత రహస్యంగా జరిగే ఈ వ్యవహారం ఇప్పుడు పబ్లిక్‌ వ్యవహారంగా మారిపోయింది. మంచైనా, చెడైనా చేతిలో గ్లాస్‌ లేకపోతే అదో వెలితిగా భావించేసే రోజులొచ్చేసాయి. పది మంది కూడినప్పుడు పొరపాటున ఎవడైనా తాగకపోతే ఆ రోజు వాడిగురించే చర్చ ఉంటుంది. ఇక అక్కడ విన్పించే జోకులకు అద్దూ అదుపూ ఉండదు. దీంతో ఈ గోలంతా ఎందుకని చేతిలోకి గ్లాస్‌ను తీసుకునే వాళ్ళెంతో మంది ఉంటుంటారు. సరదాగానో, ఫ్యాషన్‌గానో ప్రారంభమైన మద్యపానం ఆ తరువాత శరీరాన్ని, జేబును గుల్లచేస్తూ అంతిమంగా కుటుంబ వ్యవస్థనే కదిలించే స్థితికి మనిషిని చేర్చేస్తుంది. ఇక్కడ వ్యక్తులు అలవాటు చేసుకుంటున్నారని చెప్పడానికంటే ఆదాయ వనరుగా మద్యాన్ని చూస్తున్న ప్రభుత్వాలు అలవాటుగా మార్చేస్తున్నాయని చెప్పడమే సమంజసంగా ఉంటుందేమో.

సరదాగా ప్రారంభమయ్యే ఈ అలవాటును మానేందుకు లేదా మాన్పించేందుకు ఆ తరువాత చేతులకు కడియాలు వేయించుకునే వారు కొందరైతే, త్రాగేవారికే తెలియకుండా మాన్పించేస్తామంటూ మరో రకమైన వ్యాపారం చేసుకునే వారింకొందరు. ఇలా మద్యపానం మనిషిని అన్ని విధాలా నష్టపరుస్తూనే ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాజాగా జాతీయ కుటుంబ ఆరోగ్య శాఖ నిర్వహించిన ఒక సర్వేలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ మద్యపానం అలవాటు భారీగానే పెరిగిపోయిందని తేలడం ఆందోళనకు గురిచేసే అంశమే. తెలంగాణాలో 49శాతం మంది మద్యం సేవిస్తుండగా, ఏపీలో ఈసంఖ్య 25–30శాతం వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ అంకెలు ఆందోళన కలిగించేవే అంటున్నారు నిపుణులు. ఏపీలో గతానికంటే మద్యం సేవించేవారి సంఖ్య తగ్గినట్లుగా చెబుతున్నారు. కాగా రాష్ట్రాల వారీగా మద్యం అలవాట్లపై సర్వే నివేదికలో గుజరాత్‌ అన్ని రాష్ట్రాలకంటే మెరుగ్గా ఉన్నట్లు పేర్కొన్నారు. ఇక్కడ ప్రతి 16 మందిలో ఒక్కరు మాత్రమే మద్యం తాగుతున్నట్లు తేలిందట.

మద్యం అలవాటు చేసుకుంటున్న వాళ్ళలో పేద, మధ్యతరగతి వారు అత్యధికంగా ఉండడం ఆందోళన కలిగించే అశంగా సామాజికవేత్తలు చెబుతున్నారు. ప్రతి రోజు కష్టించే వారు, శారీరక అలసటను తీర్చుకునేందుకు మద్యంపై ఆధారపడడం ఒక అలవాటుగా చేసుకుంటున్నారని చెబుతున్నారు. ఇది చివరికి వారి శారీరక పటుత్వాన్ని దెబ్బతీస్తుందని వివరించారు. ప్రతి రోజు కష్టపడి పనిచేసేవారు తగిన పోషకాహారం తీసుకుంటే, ఉదయానికి మళ్ళీ శరీరంగా భేషుగ్గా రిఫ్రెష్‌అవుతుందని, కానీ అందుకు భిన్నంగా మద్యంపై ఆధారపడుతుండడంతో ఆరోగ్యం క్షీణిస్తోందని చెబుతున్నారు. అయితే దీనిపై ఎంతగా అవగాహన కల్పించినా కష్టజీవుల్లో మార్పు రాకపోవడం ఇబ్బందికరంగా మారుతోందంటున్నారు.

దేశంలోని కొన్ని రాష్ట్రాలు మినహా మద్యం నియంత్రణపై పెద్దగా దృష్టిపెట్టిన దాఖలాల్లేవనేది నిపుణులు అభిప్రాయం. ముఖ్యంగా మద్యంపై వచ్చేదాన్ని ఆదాయంగా చూస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వాలు మద్యపాన నియంత్రణపై శీతకన్ను వేసాయంటున్నారు. దీంతో యధేశ్చగా మద్యం లభిస్తుండడంతో వినియోగించే వారి సంఖ్య ఎప్పటికప్పుడు పెరిగిపోతూనే ఉంటోంది. ఏపీ సీయం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మద్యపాన నియంత్రణకు దశలవారీగా చర్యలు చేపడతానన్న హామీలో భాగంగా మద్యం షాపుల సంఖ్యను తగ్గించడం, బెల్టుషాపులు నిర్మూలించడ వంటి చర్యలను పలువురు అభినందిస్తున్నారు.
idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp