సాంకేతిక విప్లవంలో మీడియా కోల్పోయిందేంటి?

By Sodum Ramana 16-11-2019 03:37 PM
సాంకేతిక విప్లవంలో మీడియా కోల్పోయిందేంటి?

నిజ‌మే మిత్ర‌మా నువ్వ‌న్న‌ట్టు మ‌న‌వి (జ‌ర్న‌లిస్టుల‌) వెట్టి బ‌తుకులే. "ఈ రోజు నేష‌న‌ల్ ప్రెస్ డే అట‌. నాకెందుకో ఇది నేష‌న‌ల్ వెట్టిచాకిరి దినం అనిపిస్తోంది" అని ఓ జ‌ర్న‌లిస్టు మిత్రుడు త‌న పేస్‌బుక్‌లో బాధాత‌ప్త హృద‌యంతో పెట్టిన కామెంట్ చ‌దివిన త‌ర్వాత జ‌ర్న‌లిజం గురించి రెండు ముక్క‌లు రాయాల‌నిపించింది. చాలా మంది కంటే ఆ జ‌ర్న‌లిస్టు మిత్రుడే న‌య‌మ‌నిపిస్తోంది. ఎందుకంటే వెట్టి బ‌తుకుల్లో మ‌గ్గిపోతూ కూడా ఇంకా ప్రెస్ డే గురించి స్పృహ క‌లిగి ఉండ‌టం సంతోషించ‌ద‌గ్గ విష‌యం.

ఈ ప‌దేళ్ల‌లో సాంకేతిక విప్లవం దిన‌దినాభివృద్ధి చెందుతున్న క్ర‌మంలో జ‌ర్న‌లిజంలో అనూహ్య‌మైన మార్పులు చోటు చేసుకున్నాయి, చేసుకుంటున్నాయి. దీనివ‌ల్ల సౌక‌ర్యాల్లో మెరుగుద‌ల క‌నిపించినా...కంటికి క‌నిపించ‌న‌ది ఏదో జ‌ర్న‌లిజంలో మిస్ అవుతున్న‌ద‌నే ఆలోచ‌న నీడ‌లా వెంటాడుతోంది. స‌హ‌జంగా జ‌ర్న‌లిస్టులంటే ప్ర‌భుత్వానికి, ప్ర‌జ‌ల మ‌ధ్య వార‌ధిగా భావిస్తాం. అది నిన్న‌మొన్న‌టి మాట‌.

స‌మాజంతో జ‌ర్న‌లిస్టుల‌కు పేగు బంధం ఉండేది. అందుకే అప్ప‌ట్లో జ‌ర్న‌లిజం వృత్తిలో ఉన్న వారికి ఆత్మ సంతృప్తి ఉండేది. ఈ రోజు నేను రాసిన వార్త వ‌ల్ల ఫ‌లానా వ్య‌క్తికో, ఫ‌లానా రంగంలోని వారికో ప్ర‌యోజ‌నం క‌లిగింద‌నే తృప్తితో మ‌రో వార్తా క‌థ‌నం రాసేందుకు ముందుకు క‌దిలేవారు. ఇప్పుడా మాన‌సిక అనుబంధం జ‌ర్న‌లిస్టుల‌కు ఎక్క‌డో తెగిపోయింది. ఎప్పుడైతే సాంకేతిక విప్ల‌వం ఉప్పెన‌లా వ‌చ్చి ప‌డిందో...నాటి నుంచే ప‌త్రిక లేదా టీవీ చాన‌ళ్ల కార్యాల‌యాల‌ను దాటి బ‌య‌ట‌కు వెళ్లే ప‌నిలేకుండా పోయింది. ఎక్క‌డి నుంచో, ఎవ‌రో ముక్కూమొహం తెలియ‌ని వారు వాట్ప‌ప్‌లోనూ, జ‌ర్న‌లిస్టుల సోష‌ల్ మీడియా గ్రూపుల్లోనూ కార్యక్ర‌మ వివ‌రాలు, ఫొటోలు పెడుతున్నారు. వాటిని వార్త‌లుగా మ‌లుచుకోవ‌డంతో ఆరోజు ప‌ని ముగుస్తోంది.

క‌నీసం బ‌స్సు, రైలు ప్ర‌మాద ఘ‌ట‌నా స్థ‌లాల్లోకి (మ‌రీ భారీ సంఘ‌ట‌న‌లైతే త‌ప్ప‌) విలేక‌రులు వెళ్లి క‌వ‌ర్ చేసే ప‌రిస్థితి లేదు. కెమెరామెన్లు సంఘ‌ట‌నా స్థ‌లానికి వెళ్లి ఫొటోలు, విజువ‌ల్స్ తీసుకుని వ‌స్తే...విలేక‌రులు పోలీసుల‌కు ఫోన్ చేసి స‌మాచారం సేక‌రించి వార్త‌ను రాయ‌డం ప్ర‌స్తుతం జ‌రుగుతున్న తంతు. ప్ర‌మాదంలో బాధితుల వైపు నుంచి మాన‌వీయ కోణంలో వార్త‌ల‌ను ప్ర‌జెంట్ చేసేందుకు ఎవ‌రున్నారు?

టీవీ చాన‌ళ్ల విష‌యానికి వ‌స్తే...చేస్తే చాలా అతి లేదంటే వాటి జోలికే వెళ్ల‌రు. సాంకేతిక విప్ల‌వం రాని రోజుల్లో విలేక‌రి నేరుగా ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌కు వెళితే ఆఫీస్ బాయ్ ద‌గ్గ‌రి నుంచి ఆ కార్యాల‌య ఉన్న‌తాధికారి వ‌ర‌కు స‌న్నిహిత సంబంధాలు ఏర్ప‌డేవి. ఆఫీస్ బాయ్ మొద‌ల‌కుని ఉన్న‌తాధికారుల వ‌ర‌కు పాల‌న‌లోని లొసుగులు, అవినీతి గురించి ఆఫ్ ది రికార్డుగా విలేక‌రి చెవిలో వేసేవాళ్లు.

అప్ప‌ట్లో అందుకే ప‌రిశోధ‌నాత్మ‌క వార్తా క‌థ‌నాలు వ‌చ్చేవి. ఇప్పుడు వాటి ఊసే లేదు. ఎప్పుడైతే ప‌త్రిక‌లు, టీవీ చాన‌ళ్లు కులాలు, పార్టీల వారీగా చీలిపోయాయో అప్పుడే మంచీచెడు, నిజానిజాల విచ‌క్ష‌ణ కోల్పోయాయ‌ని చెప్పేందుకు సిగ్గుగా ఉంది. మ‌నం అభిమానించే నాయ‌కుడు పాల‌కుడైతే...ఆయ‌న ఏం చేసినా ఆహాఓహో అని ప్ర‌పంచ‌మంతా మార్మోగేలా భ‌జ‌న చేయ‌డం, మ‌న‌కు న‌చ్చ‌క‌పోతే...ఎలాంటి మంచిప‌ని చేసినా థూ..ఛీ...యాక్ అంటూ వ్య‌తిరేక వార్తా క‌థ‌నాలు రాయ‌డంలాంటి విప‌రీత ధోర‌ణులు మీడియాలో చోటు చేసుకుంటున్నాయి.

జ‌ర్న‌లిస్టులు క్షేత్ర‌స్థాయిలో రిపోర్టింగ్‌కు వెళ్ల‌కుంటా...ఆ వార్త‌లు ఎలా ఉంటాయో ఈ రోజు చిత్తూరు జిల్లా సంచిక‌ల్లో ప్ర‌చురిత‌మైన వార్త‌ల గురించి ఉద‌హ‌రిస్తాను. జ‌గ‌న్ స‌ర్కార్ ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన స్పంద‌న కార్య‌క్ర‌మంపై క‌డ‌ప‌, చిత్తూరు జిల్లా అధికారుల శిక్ష‌ణ త‌ర‌గతుల‌ను తిరుప‌తిలో శుక్ర‌వారం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి సంబంధించి ఆంధ్ర‌జ్యోతి, సాక్షి, ఈనాడు దిన‌పత్రిక‌ల్లో రాసిన విధానాన్ని వివ‌రిస్తాను.

మొద‌ట సాక్షి గురించి...

ఈ ప‌త్రిక జ‌గ‌న్‌కు సంబంధించిన‌ద‌ని లోక‌మంతా తెలుసు. స్పంద‌న‌పై న‌మ్మ‌కాన్ని పెంచండి అనే శీర్షిక‌తో జిల్లా సంచిక‌లో మొద‌టి పేజీలో చ‌క్క‌ని ఇంట్రో రాసి, ఆరోగ్య రాజ్ ఫొటో పెట్టి ఇచ్చారు. మూడో పేజీలో వార్త‌ను చ‌దువుకోవాల‌ని ఇండికేష‌న్ ఇచ్చారు. ఈ ఇంట్రోలో స్పందనలో వచ్చిన ఫిర్యాదులకు నాణ్యమైన పరిష్కారాలను చూపాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యదర్శి సాల్మన్‌ ఆరోఖ్య‌రాజ్‌ అధికారులకు సూచించారన్నారు. తిరుపతిలో శుక్రవారం నిర్వహించిన ప్రాంతీయ శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ స్పందన కార్యక్రమానికి అర్జీలు సమర్పించేందుకు వచ్చే ప్రజలతో అధికారులు మర్యాదపూర్వకంగా మెలగాలని, వారి అర్జీలను స్వీకరించడంతో పాటు రసీదులను అందజేయాలని తెలిపారని పేర్కొన్నారు.

ఆంధ్ర‌జ్యోతి విష‌యానికి వ‌స్తే

ఈ కార్య‌క్ర‌మానికి సంబంధించిన వార్త‌ను జిల్లా సంచిక సెంట‌ర్‌స్ప్రెడ్‌లో క‌ల‌ర్ పేజీలో ప్రాధాన్యం ఇస్తూ అచ్చు వేశారు. రెండు ఫొటోలు కూడా క్యారీ చేశారు. సాక్షి ప‌త్రిక‌లో ఏ స‌మాచారం ఉందో విష‌యం దాదాపు య‌ధాత‌థంగా ఆంధ్ర‌జ్యోతిలో వ‌చ్చింది. వెరీ గుడ్‌.

చివ‌రిగా ఈనాడు గురించి మాట్లాడుకుందాం,

ఈ వార్తను ఈనాడు జిల్లా సంచిక మొద‌టి పేజీలో అర్జీ ఒక‌టైతే..ప‌రిష్కారం మ‌రొక‌టి చూపుతారా?- అనే శీర్షిక‌తో...వార్త‌ను మూడో పేజీలో చూడాల‌ని ఇండికేష‌న్ ఇచ్చారు.సాక్షి,ఈనాడు..రెండింటిలో కూడా మొద‌టి పేజీలో ఇండికేష‌న్‌, మూడో పేజీలో వార్త ఇవ్వ‌డాన్ని అభినందించాలి.

ఇక్క‌డ జాగ్ర‌త్త‌గా గ‌మ‌నించాల్సిన అంశం ఏంటంటే ఈనాడు విలేక‌రి కార్య‌క్ర‌మానికి వెళ్లి వార్త‌ను ప్ర‌జెంట్ చేశాడు. ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే...ఆరోగ్యరాజ్ త‌న ఉప‌న్యాసంలో ద‌ర‌ఖాస్తుదారులు ఇస్తున్న అర్జీ ఒక‌టైతే... రెవెన్యూ సిబ్బంది మ‌రొక‌టి వారికి ఇస్తున్నార‌ని, అందుకే స్పంద‌న కార్య‌క్ర‌మాన్ని పెట్టాల్సి వ‌చ్చింద‌ని చెప్పారు. అంత‌టితో ఆయ‌న ఆగ‌లేదు. తిరుప‌తి రూర‌ల్‌కు చెందిన ఒక రైతు ఐదేళ్లుగా ప‌ట్టాదారు పాసుపుస్త‌కం కోసం త‌హ‌శీల్దార్ కార్యాల‌యం చుట్టూ తిరుగుతున్నా, ఉన్న‌తాధికారులు త్వ‌ర‌గా స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల‌ని రాత మూల‌కంగా ఆదేశించినా ఫ‌లితం లేద‌ని వాపోయారు. ఇలా చెబుతూ పోతే చాలా ఉన్నాయ‌ని, రెవెన్యూ సిబ్బంది స‌క్ర‌మంగా ప‌నిచేయ‌క‌పోతే ప్ర‌జ‌ల ఆగ్ర‌హానికి గురికాక త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించారు. ఆయ‌న మాట‌ల‌ను ఆధారంగా చేసుకొని ఈనాడు స‌బ్ ఎడిట‌ర్ అర్జీ ఒక‌టైతే..ప‌రిష్కారం మ‌రొక‌టి చూపుతారా? అనే ఘాటైన శీర్షిక‌తో వార్త‌ను ప్ర‌చురించారు.

కానీ సాక్షి,ఆంధ్ర‌జ్యోతి విలేకరులు ప్రభుత్వ పౌర‌సంబంధాల‌శాఖ అధికారులు పంపిన ప్రెస్‌నోట్‌ను వార్త‌గా రాశార‌నే విష‌యం సుస్ప‌ష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే ఆరోఖ్య‌రాజ్ అధికారుల గురించి ఘాటుగా మాట్లాడిన విష‌యాలు ఆ ప్రెస్‌నోట్లో లేవు. విలేక‌రి నేరుగా పోతే త‌ప్ప అక్క‌డ నిజంగా ఏం జరిగిందో తెలియ‌దు.

ఒక‌ప్పుడు జ‌ర్న‌లిస్టులంటే చాలా పెద్ద ఊర్ల‌లోనే చాలా ప‌రిమిత సంఖ్య‌లో ఉండేవాళ్లు. ఇప్పుడు లెక్క‌లేన‌న్ని మీడియా సంస్థ‌లు పుట్ట‌గొడుగుల్లా పుట్టికొచ్చాయి. వీటికి లెక్క‌లేనంత మంది విలేక‌రులు. సంఖ్య పెరిగేకొద్దీ నాణ్య‌త కొర‌వ‌డింది. సంచ‌ల‌న వార్త‌ల‌కే ప్రాధాన్యం. స‌మాజ చ‌ల‌నానికి ఉప‌యోగ‌ప‌డే వార్త‌లకు దిక్కూ, దిశ‌, ద‌శ ఉండ‌టం లేదు.

ఇందాక సాంకేతిక విప్ల‌వం గురించి చ‌ర్చించుకుంటున్న క్ర‌మంలో ఈ వార్త‌ల‌ను ఉదాహ‌ర‌ణ‌గా మీ ముందు ఉంచాను. ప‌త్రికలు , టీవీ చాన‌ళ్ల య‌జ‌మానులు ఎంత సేపూ త‌మ ఆర్థిక శిఖ‌రాల‌ను ఎవ‌రెస్టే హ‌ద్దుగా జ‌ర్న‌లిజాన్ని, జ‌ర్న‌లిస్టుల‌ను వాడుకోవ‌డ‌మే త‌ప్ప వారేం తింటున్నారో ప‌ట్టించుకోవ‌డం లేదు. అందువ‌ల్లే జ‌ర్న‌లిస్టుల్లో వృత్తిపై అస‌హ‌నం, ఆగ్ర‌హం. అంతా మొక్కుబ‌డి వ్య‌వ‌హార‌మైంది. దీనికి సాంకేతిక ప‌రిజ్ఞానం తోడైంది. సోష‌ల్ మీడియా రూపంలో కొత్త అవ‌తార‌మెత్తింది. ఫోర్త్ ఎస్టేట్‌ను ఫిప్త్ ఎస్టేట్‌గా పిలుచుకుంటున్న సోష‌ల్ మీడియా డామినేట్ చేస్తోంది. ఈ మీడియా ఇంకెన్ని విప‌రీత ధోర‌ణుల‌కు దారి తీస్తుందో కాల‌మే జ‌వాబు చెప్పాలి.

idreampost.com idreampost.com

Click Here and join us on WhatsApp to get latest updates.

Related News