వివాదాస్పద వైద్యుడు హఠాన్మరణం, గుండెపోటు సమస్యగా నిర్ధారణ

By Kalyan.S May. 22, 2021, 09:00 am IST
వివాదాస్పద వైద్యుడు హఠాన్మరణం, గుండెపోటు సమస్యగా నిర్ధారణ

ఏపీలో గత ఏడాది తన వివాదాస్పద చర్యల ద్వారా వార్తలకెక్కిన ప్రభుత్వ డాక్టర్ సుధాకర్ హఠాన్మరణం పాలయ్యారు. గుండెపోటుతో ఆయన మరణించినట్టు కుటుంబసభ్యులు, వైద్యులు ధృవీకరించారు. నర్సీపట్నం ప్రభుత్వాసుపత్రిలో అనెస్తీషియా వైద్యుడిగా ఉండి, కరోనా సమయంలో ఆయన చేసిన హల్ చల్ పెద్ద వివాదం అయ్యింది. చివరకు కోర్టు జోక్యంతో సీబీఐ వరకూ వెళ్లింది.

సీబీఐ విచారణ కూడా పూర్తయ్యింది. కోర్టు తీర్పు రావాల్సి ఉంది. అనూహ్యంగా సుధాకర్ మరణం అందరినీ విషాదంలో నింపింది. తొలి నుంచి వృత్తి బాధ్యతల్లో వివాదాస్పదంగా వ్యవహరించిన డాక్టర్ సుధాకర్ ఆ తర్వాత విశాఖలో కూడా రోడ్డు మీద వీరంగం చేశారు. తన చొక్కా చింపుకుని ఆయన పోలీసులతో ఘర్షణ పడిన వైనం పెద్ద దుమారమే రేపింది. చివరకు ఆయన్ని మానసిక ఆస్పత్రికి తరలించి చికిత్స కూడా అందించాల్సి వచ్చింది

అంతకుముందు తన కుమారుడు కరోనా నిబంధనలు ఉల్లంఘించిన కేసులో కార్ కోసం విశాఖ ఫోర్ట్ పోలీస్ స్టేషన్ లో కూడా డాక్టర్ సుధాకర్ దౌర్జన్యానికి పాల్పడిన ఘటనలున్నాయి. కేసులు కూడా నమోదయ్యాయి. ఏడాది కాలంగా ఆయన వివాదాల మూలంగా విధులకు దూరంగా ఉంటున్నారు. మధ్యలో పలుమార్లు తాను చేసినది తప్పిదంగా అంగీకరించారు. జగన్ నాయకత్వాన్ని కొనియాడారు. ఏపీలో వైద్యులకు అందుతున్న సేవలను తప్పుబట్టడం సరికాదని కూడా వ్యాఖ్యానించారు.

52 ఏళ్ల సుధాకర్ ప్రస్తుతం విశాఖ సీతమ్మధారలోని తన స్వగృహంలో నివాసం ఉంటున్నారు. ఆయన కేసులో త్వరలో తీర్పు వస్తుందని భావించగా హఠాత్తుగా ఆయ మరణం కుటుంబ సభ్యులను కలచివేసింది. ఇప్పటికే అంత్యక్రియలు కూడా పూర్తి చేయడం విశేషం.

మారని చంద్రబాబు ధోరణి

డాక్టర్ సుధాకర్ అంశంలో రాజకీయం చేసి లబ్ది పొందాలని ఆశించిన చంద్రబాబు చివరకు ఆయన చావుని కూడా వదిలిపెట్టకుండా రాజకీయాలకు ముడిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. డాక్టర్ సుధాకర్ గుండెపోటుతో మరణించడం కూడా ప్రభుత్వ బాధ్యత అన్నట్టుగా వ్యవహరించారు. ఇప్పటికే కొందరు టీడీపీ నేతల ప్రోద్భలంతా తాను తప్పిదం చేశానని సుధాకర్ అంగీకరించినా చంద్రబాబు మాత్రం తన ధోరణి మార్చుకోకుండా రాజకీయ విమర్శలకు పూనుకోవడం చర్చనీయాంశం అవుతోంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp