లోకేషా.. ఇంత కథ ఉందా..?

By Karthik P Sep. 09, 2021, 04:40 pm IST
లోకేషా.. ఇంత కథ ఉందా..?

ఏడు నెలల క్రితం గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాళ్ల మండలంలో హత్యకు గురైన విద్యార్థిని అనూష కుటుంబాన్ని పరామర్శించేందుకని హైదరాబాద్‌ నుంచి వచ్చిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను పోలీసులు గన్నవరం ఎయిర్‌పోర్టు వద్ద అడ్డుకున్నారు. గత నెల 15వ తేదీన గుంటూరులో పరిచయస్తుడి చేతిలో హత్యకు గురైన బీటెక్‌ విద్యార్థిని రమ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు లోకేష్‌ వచ్చిన సమయంలో గొడవ జరగడం, రెచ్చగొట్టే వ్యాఖ్యలు, టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య కవ్వింపు చర్యలు చోటు చేసుకున్నాయి. వీటితోపాటు ఈ రోజు నరసరావుపేటకు వస్తున్న లోకేష్‌ నిన్న స్థానిక ఎమ్మెల్యేను రెచ్చగొట్టేలా ట్విట్టర్‌లో పోస్టు పెట్టారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని పోలీసులు లోకేష్‌ పర్యటనకు అనుమతి ఇవ్వలేదు. ఈ విషయాన్నే చెప్పి ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.

ఆ తర్వాత జరిగిన పరిణామాలు పరిశీలిస్తే.. నారా లోకేష్‌ పర్యటన వెనుక ఇంత పెద్ద కథ ఉందా..? అనిపిస్తుంది. లోకేష్‌ అరెస్ట్‌... లోకేష్‌ను అడ్డుకున్న పోలీసులు.. లోకేష్‌పై దురుసుగా ప్రవర్తించిన పోలీసులు.. అరెస్ట్‌పై పోలీసులను నిలదీసిన లోకేష్‌.. లోకేష్‌ను ఎక్కడకి తీసుకెళుతున్నారో తెలియదు.. టీడీపీ శ్రేణుల ఆందోళన.. విమానాశ్రయం వద్ద తీవ్ర ఉద్రిక్తత, తనను ఎక్కడికి తీసుకెళుతున్నారో చెప్పాలంటూ అడిగిన లోకేష్‌.. అంటూ టీడీపీ అనుకూల మీడియాలో బ్రేకింగ్‌ న్యూస్‌లు, నిమిషానికోసారి అప్‌డేట్‌లు, లైవ్‌ కవరేజ్‌లు.

ఈ సీన్‌ కట్‌ చేస్తే..ఇక టీడీపీ నేతల వంతు. లోకేష్‌ను అరెస్ట్‌ చేయడం పిరికిపంద చర్య, ప్రభుత్వం లోకేష్‌కు భయపడింది, ప్రశ్నించే హక్కు ప్రతిపక్షాలకు లేదా, ప్రభుత్వ వైఫల్యాలు బయటపడతాయనే లోకేష్‌ అక్రమ అరెస్ట్, లోకేష్‌ను చూసి జగన్‌ ఎందుకు భయపడుతున్నారు..?, నారా లోకేష్‌ను అడ్డుకోవడం దుర్మార్గం, రమ్య కుటుంబానికి టీడీపీ అండగా నిలిచిందని లోకేష్‌పై కక్ష గట్టారు, లోకేష్‌కే ఇలా ఉంటే సామాన్య ప్రజలకు రక్షణ ఏదీ..?, వైసీపీ నేతల సభలపై లేని ఆంక్షలు లోకేష్‌పై ఎందుకు..?... ఇలా టీడీపీ నేతలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మహిళా నేతలు మీడియా ముందుకు వచ్చి ప్రకటనలు గుప్పించారు. ఈ ప్రకటనలకు టీడీపీ అనుకూల మీడియాలో విస్తృత ప్రచారం దక్కింది. ప్రకటనలే కాకుండా.. టీడీపీ నేతలు రోడ్లుపై భైటాయించి నరసనలు తెలపడం, రాస్తారోకోలు చేయడం అదనం.

Also Read : 'గద్దె' చెబుతున్న చంద్రబాబు ఘన చరిత్ర

నరసరావు పేటకు వచ్చే ముందు రోజు నారా లోకేష్‌ స్థానిక ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డిని ఉద్దేశించి చేసిన ఆ ట్విట్‌ ఏమిటో చూద్దాం. ‘ అధికార, కుల మదంతో కొవ్వెక్కి కొట్టుకుంటున్న నీలాంటి ఎమ్మెల్యేకి ఉన్నాది చంపింది శిరీషని కాదు అనూషని అని గుర్తు చేయడానికి నరసరావుపేట వస్తున్నా..!’. ఈ ట్వీట్‌ చదివిన వారికి ఏమనిపిస్తుంది..? నారా లోకేష్‌ పరామర్శకు వస్తున్నాడా..? ఘటనతో ఏ మాత్రం సంబంధంలేని అధికార పార్టీ ఎమ్మెల్యేతో పేట సందుల్లో కుస్తీలు పట్టేందుకు వస్తున్నాడా..? అనిపిస్తుంది.

ఏడు నెలల కిందట ఈ ఘటన జరిగింది. మరుసటి రోజునే ప్రభుత్వం అనూష కుటుంబానికి పది లక్షల పరిహారం అందించింది. ఆమె తమ్ముడుకు ఉద్యోగం ఇస్తామని చెప్పింది. పోలీసులు నిందితుడుని అరెస్ట్‌ చేశారు, ఛార్జీషీట్‌ దాఖలు చేశారు. అయినా ఇప్పుడు పరామర్శ పేరుతో వచ్చిన లోకేష్‌.. నిజంగా అదే అతని లక్ష్యమైతే.. వచ్చి పరామర్శించేవాడు. కానీ ముందు రోజు స్థానిక ఎమ్మెల్యేలను ఉద్దేశించి పరుషపదజాలం ఉపయోగిస్తూ రెచ్చగొట్టేవారు కాదు. డాక్టర్‌గా సేవలందిస్తూ ప్రజా జీవితంలోకి వచ్చిన గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి గురించి పేటలోనూ, గుంటూరు జిల్లాలోనూ అందరికీ తెలుసు. అలాంటి వ్యక్తిని ఉద్దేశించి.. అధికార, కుల మదంతో కొవ్వెక్కి కొట్టుకుంటున్నావ్‌.. అనడం వెనుక.. అధికార పార్టీ ప్రజా ప్రతినిధిని, వైసీపీ శ్రేణులను రెచ్చగొట్టడం తప్ప మరేముంది..?

ముందు రోజు అధికార పార్టీ వారిని రెచ్చగొట్టేలా సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టడం, తద్వారా పోలీసులు అనుమతి ఇవ్వకుండా తామే చేయడం, అనుమతి లేకపోయినా, పోలీసులు అడ్డుకుంటారని తెలిసినా హైదరాబాద్‌ నుంచి రావడం, అనుకూల మీడియాలో బ్రేకింగ్‌ న్యూస్‌లు, లైవ్‌ కవరేజీలు, టీడీపీ శ్రేణుల మోహరింపు, ఆందోళనలు, అరెస్ట్‌ను ఖండిస్తూ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల మీడియా ప్రకటనలు.. ఈ తంతంగా అంతా గమినించిన వారికి ఇది అంతా లోకేష్‌ను నాయకుడిగా చూపేందుకని అర్ధం కాకుండా ఉంటుందా..?

Also Read : బుచ్చయ్య ఎపిసోడ్‌లో కొత్త వివాదం.. ఎవరు లోకల్‌..? ఎవరు నాన్‌లోకల్‌..?

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp