పారిపోయిన విషయం లోకేష్‌కు గుర్తులేదా..?

By Karthik P Jun. 19, 2021, 05:00 pm IST
పారిపోయిన విషయం లోకేష్‌కు గుర్తులేదా..?

హత్య, అవినీతి, అక్రమాలు నేపథ్యంలో టీడీపీ నేతలపై నమోదైన కేసులు దొంగవట. ఈ మాటలన్నది ఎవరో కాదు.. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌. కొల్లు రవీంద్ర, జేసీ ప్రభాకర్‌ రెడ్డి, కింజారపు అచ్చెం నాయుడు, ధూళిపాళ్ల నరేంద్ర తదితరులపై వైసీపీ ప్రభుత్వం దొంగ కేసులు పెట్టి వేధిస్తోందని నారా లోకేష్‌ తీర్మానించేశారు. బట్టికొట్టి వచ్చిన ఈ స్క్రిప్ట్‌ చదివే ముదు.. నారా లోకేష్‌.. ఆయా నేతలపై నమోదైన కేసులు, అరెస్ట్, బెయిల్‌ సమయాల్లో చోటు చేసుకున్న పరిణామాలు మరచిపోయినట్లున్నారు.

పారిపోయిన కొల్లు రవీంద్ర...

టీడీపీ నేతలపై నమోదైన కేసులు, అనంతర పరిణామాలను ఒక సారి గుర్తుచేసుకుంటే వాస్తవాలు బోధపడతాయి. కొల్లు రవీంద్రపై హత్యానేరం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మంత్రి పేర్ని నాని అనుచరుడు, మచిలీపట్నం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ మోకా భాస్కరరావును కొల్లు చంపించారు. చంపిన వారిని అరెస్ట్‌ చేసిన పోలీసులు.. వారిని విచారించగా వచ్చిన సమాచారం మేరకు కొల్లు రవీంద్ర పాత్రను బయటపెట్టారు. సాంకేతికపరమైన ఆధారాలు సేకరించిన తర్వాత కేసు నమోదు చేశారు. హత్య విషయంలో విచారణకు రావాలని కోరితే.. ఇంటి వెనుక గోడ దూకి కొల్లు రవీంద్ర పారిపోయారు. గాలించిన పోలీసులు విశాఖపట్నం వెళుతుండగా.. తుని సమీపంలో కొల్లును అదుపులోకి తీసుకున్నారు. కొల్లుపై పెట్టినది దొంగ కేసు అయితే పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోవాల్సిన పనేముంది..?

జేసీకి హైకోర్టు అక్షింతలు..

కాలం తీరిన వాహనాలను తుక్కు కింద కొనుగోలు చేసి వాటిని రాష్ట్రానికి తీసుకువచ్చి నకిలీ పత్రాలతో విక్రయించిన కేసులో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి, ఆయన కుమారుడుపై పలు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఆయా కేసులను ఒకటిగా పరిగణించి విచారించాలని, బెయిల్‌ మంజూరు చేయాలని జేసీ దాఖలు చేసిన పిటిషన్‌పై.. హైకోర్టు చేసిన వ్యాఖ్యలతో వారు చేసిన తప్పు ఏమిటో నిర్థారణ అయింది. తీవ్రమైన నేరం కింద పరిగణించిన హైకోర్టు.. బెయిల్‌ను నిరాకరిస్తూ.. కింది కోర్టులో ప్రయత్నించుకోవాలని, మరోసారి ఇక్కడకు రావద్దని అక్షింతలు వేసింది. వాహనాల వల్ల ప్రజల ప్రాణాలు పోతే ఎవరి బాధ్యత అంటూ మండిపడింది. అన్ని కేసులను ఒకటిగా పరిగణించి విచారించేలా పోలీసులను ఆదేశించాలని జేసీ ప్రభాకర్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసినప్పుడే నేరం ఒప్పుకున్నట్లైంది.

Also Read : అచ్చెం నాయుడు తెలిసే మాట్లాడుతున్నారా..?

అచ్చెం నాయుడు డొంకతిరుగుడు..

మంత్రిగా ఉన్నప్పుడు సిఫార్సు లేటర్లు ఇచ్చి ఈఎస్‌ఐ ఆస్పత్రిలో పరికరాలు, వైద్య పరీక్షల వ్యవహారంలో 150 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారనే అభియోగాలపై బాబు హాయంలో కార్మిక మంత్రిగా పని చేసిన అచ్చెం నాయుడు, ఆయన తర్వాత ఆ శాఖ మంత్రి అయిన పితాని సత్యనారాయణ కుమారుడు సహా పలువురు అధికారులపై ఏసీబీ కేసులు పెట్టింది. తాను ఏ తప్పు చేయలేదని, తెలంగాణలో ఇచ్చినట్లుగానే ఇక్కడ ఇచ్చామని, కేవలం తాను సిఫార్సు లెటర్లు ఇచ్చానని.. ఇలా డొంకతిరుగుడు సమాధానాలు బెయిల్‌ సమయంలో అచ్చెం నాయుడు కోర్టుకు చెప్పారు. బెయిల్‌ ఆలస్యమవుతోందని గ్రహించి.. ఫైల్స్‌ పేరుతో ఏకంగా 70 రోజుల పాటు ఆస్పత్రిలో ఉన్న చరిత్ర అచ్చెం నాయుడు సొంతం. ఇక మాజీ మంత్రి పితాని కుమారుడు అరెస్ట్‌ను తప్పించుకునేందుకు పరారయ్యారు. తప్పు చేయన్నప్పుడు భయపడాల్సిన పనేముంది..? దొంగ కేసు అయితే.. నిజాయతీగా న్యాయస్థానాల్లో పోరాటం చేయవచ్చు. పారిపోయి, అజ్ఞాతంలో ఉండాల్సిన 

అవసరం ఏముంది..?

ఆవు చేలో మేస్తుంటో.. దూడ గట్టున మేస్తుందా..? అన్న సామెత మాదిరిగా.. అమరావతి భూ కుంభకోణం ఆరోపణలపై తాము ఏ తప్పు చేయలేదని, విచారణ చేసుకోవాలంటూ బీరాలు పలికిన తన తండ్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.. ఆ తర్వాత తన పార్టీ నేత వర్ల రామయ్యతో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై సీఐడీ విచారణ ఆపాలంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. హైకోర్టు విచారణపై స్టే ఇచ్చింది. తప్పు చేయనప్పుడు విచారణ అంటే భయపడాల్సిన అవసరం ఏముంది..? బాబు బాటలోనే నడిచిన ఆ పార్టీ నేతలు బెయిల్‌పై బయట ఉన్నారు. వారు నేరం చేశారా..? లేదా..? అన్నది విచారణ తర్వాత కోర్టు నిర్థారిస్తుంది. కానీ ఈ లోపే నారా లోకేష్‌.. అవన్నీ దొంగ కేసులని జడ్జిమెంట్‌ ఇచ్చేస్తుండడమే విశేషం.

Also Read : రఘురామరాజు రెండో కోణం ఆలోచించలేదా..?

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp