నాలో.. నాతో వైఎస్ఆర్.. ఓ మ‌హానేత కుటుంబ క‌దంబం..!

By Kalyan.S Jul. 11, 2020, 04:38 pm IST
నాలో.. నాతో వైఎస్ఆర్.. ఓ మ‌హానేత కుటుంబ క‌దంబం..!

"ఎందుకో... మాట‌ల మ‌ధ్య‌లో ధైర్యం చేసి, ఈయ‌న‌ను మొద‌టి సారి క‌ళ్లు ఎత్తి చూశాను... ఆ కోర‌మీసాలు, చంద‌మామ లాంటి ముఖం, కాంతివంత‌మైన చిరున‌వ్వు, ఆ ముఖ‌వ‌ర్చ‌స్సు, ఉట్టిప‌డుతున్న రాజ‌సం... నా గుండె ద‌డ పెరిగింది. ఎప్పుడూ లేని కొత్త ఆలోచ‌న‌లు క‌లిగాయి. ఇలాంటి వ్య‌క్తితో జీవితం అంతే అందంగా ఉంటుందేమో అనిపించింది.." అంటూ ఆయ‌న‌తో తొలి ప్ర‌యాణ అనుభ‌వం సంగ‌తులు...

"పెళ్లి టైం ద‌గ్గ‌ర ప‌డింది.. సంబంధం కుదిర్చిన మా అమ్మ‌మ్మే, హ‌డావుడి చెయ్య‌డం మొద‌లుపెట్టింది. ప్ర‌త్యేకంగా నెల్లూరు వెళ్లి పెళ్లిక‌ని చీర‌లు, న‌గ‌లూ అన్నీ కొని తెచ్చింది.." అని పెళ్లికి ముందు నాటి ముచ్చ‌ట్లు..

"ప్ర‌తి యువ‌తినీ త‌న తోబుట్టువుగా కాపాడిన ఉడుకు నెత్తురు ఈయ‌న‌ది.
స్వార్థం పెరిగే వ‌య‌సులో స్నేహం పంచిన సంస్కారం ఈయ‌న‌ది.
న‌ష్ట‌మైనా, క‌ష్ట‌మైనా ఇంకొక‌రికోసం నిల‌బ‌డ‌డం, ఇత‌రుల కోసం అవ‌స‌ర‌మైతే నిల‌దీయ‌డం...
కాలేజీ ఈయ‌న‌కి నేర్పిన నాయ‌క‌త్వ పాఠాలు!.." కాలేజీ విద్యార్థిగా రాజ‌శేఖ‌ర రెడ్డి ఎలా ఉండేవాడో చెప్పిన విధ‌మూ..

"ఓ ప‌క్క డాక్ట‌ర్ గా, మ‌రోప‌క్క రాజ‌కీయ నాయ‌కునిగా ఎదుగుతూనే న‌న్ను, పిల్ల‌ల్ని, త‌ల్లిదండ్రుల‌ను, బంధువుల‌ను, స్నేహితుల‌ను, ఆప్తుల‌ను అంద‌రినీ కంటికి రెప్ప‌లా కాపాడుకున్నారు.." అని చెప్పిన వాక్యాల్లో అన్నింటినీ స‌మ‌పాళ్ల‌లో స‌మ‌న్వ‌యం చేసుకుంటూ ఆయ‌న ముందుకు సాగిన తీరు స్ప‌ష్ట‌మ‌వుతుంది.

"ఈయ‌న ష‌ర్మిళ‌ను ఎంత ప్రేమ‌గా చూసుకునేవారో, జ‌గ‌న్ ని అంత‌కంత బాధ్య‌త‌గా చూసుకునేవారు. జ‌గ‌న్ ని నేను "స‌న్నీ" అని పిలిస్తే, ఈయ‌న "నాన్నా అని", "నాన్నా స‌న్నీ" అని పిలిచేవారు! ష‌ర్మిని ఈయ‌న "పాప్స్" అని, "పాపా" అని పిలిస్తే, నేను "అమ్ములు" అని పిలిచేదాన్ని!

"ఈయ‌న‌కి ఎన్ని విజ‌యాలో అని అంద‌రూ అనుకుంటారు. ఈ విజ‌యాల వెనక ఎంత పోరాటం ఉందో నాకు తెలుసు.." అని చెప్పిన వాక్యాల్లో ఆయ‌న‌ ప్రతీ అడుగునూ ఎంతలా ప‌రిశీలించారో తెలుస్తుంది.

"ఈయ‌న ఎప్పుడు నిరాహార దీక్ష చేసినా, నేను కూడా ఇంట్లో ఏం తినేదాన్ని కాదు! అలా చేయ‌డం వ‌ల్ల మాన‌సికంగా ఈయ‌న‌కు అండ‌గా నిలుస్తున్న‌ట్టు ఫీల‌య్యేదాన్ని!.." ఆ దంప‌తుల ఔన్న‌త్యానికి అద్దం ప‌డుతున్న ఇటువంటి సంఘ‌ట‌న‌లు.. అపూర్వ‌, అనిర్వ‌చ‌నీయ‌, ఇప్ప‌టి వ‌ర‌కూ ఎవ‌రికీ తెలియ‌ని ఆ మ‌హానేత రాజ‌శేఖ‌ర్ రెడ్డి కి చెందిన ఎన్నో విష‌యాలను ఆయ‌న అభిమానుల‌కు అందించారు వైఎస్. విజ‌య రాజ‌శేఖ‌ర్ రెడ్డి. ఎంతో ఉద్విగ్న క్ష‌ణాల‌ను ప్ర‌జ‌ల‌తో పంచుకున్నారు. ఆయ‌న జీవితంలోని ఒక్కో పేజీని అందంగా అక్ష‌రీక‌రించారు. రాజ‌కీయ చ‌ద‌రంగంలో ఆయ‌న‌కు ఎదురైన క‌ష్టాల సుడుల‌ను, వాటిని ఎదిరించి నిల‌బ‌డిన‌ ఆ ధీర‌త్వాన్ని పుస్త‌క రూపంలో కూర్చిన తీరు అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది.

అంతేకాకుండా వైఎస్ కుటుంబానికి చెందిన ఎన్నో అరుదైన దృశ్యాలు, స్వ‌యంగా రాజ‌శేఖ‌ర్ రెడ్డి తీసిన చిత్రాల‌ను పుస్త‌కంలో పొందుప‌రిచారు. ఫిబ్ర‌వ‌రి 9, 1972 నాటి వారి పెండ్లి శుభ‌లేఖ, డాక్ట‌ర్ గా, రాజ‌కీయ నేత‌గా ఆయ‌నకు చెందిన ఫొటోలు, అత్త‌మ్మ‌, మామ‌ల‌తో ఆమె అనుంబంధం, ఆయ‌నో మంచి బాడీ బిల్డ‌ర్ అంటూ.. వైఎస్ఆర్ ఫిట్ నెస్ ర‌హ‌స్యాల‌ను, అంద‌రికీ ఉచిత వైద్యం అందించాల‌నే ఆయ‌న త‌ప‌న‌ను చాలా చ‌క్క‌గా చెప్పుకొచ్చారు.

ఇప్పుడు ఎక్క‌డ చూసినా ఆ పుస్తకానికి సంబంధించిన ముచ్చ‌ట్లే.. సోష‌ల్ మీడియాలో పుస్త‌కంలోని వైఎస్ఆర్ పాత‌త‌రం నాటి ఫొటోలే..! అది కేవ‌లం పుస్త‌కం కాదు... ఆ మ‌హానేత అస‌లైన వ్య‌క్తిత్వాన్ని అంద‌రికీ ప‌రిచ‌యం చేసిన అద్భుత కుటుంబ క‌దంబం.

"మంచిత‌నాన్ని పంచితేనే అది పెరుగుతుంది.. ఇలాంటి సంప‌ద నాకూ, నా పిల్ల‌ల‌కే కాకుండా మీకూ, మీ పిల్ల‌ల‌కూ చెందాల‌నే ప్ర‌యాస‌తోనే ఈ పుస్త‌కం అందిస్తున్నాను." అంటూ ర‌చ‌యిత వైఎస్‌. విజ‌య‌మ్మ ఆ మ‌హానుభావుడి జ‌యంతి రోజున "నాలో.. నాతో వైఎస్ఆర్.." పుస్త‌కాన్ని త‌న కుమారుడు, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్క‌రింప‌చేసి అక్ష‌ర‌రూపంలో ఆయ‌న‌కు నిజ‌మైన నివాళి అర్పించారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp