నాడు - నేడు - మన బడి

By Surya.K.R 16-11-2019 01:50 PM
నాడు - నేడు  - మన బడి

విద్య లక్ష్యం ఏమిటి? ప్రముఖ తత్త్వవేత్త అరిస్టాటిల్ అభిప్రాయంలో " రాజ్యానికి అవసరమైన మంచి పౌరులు విద్య ద్వారా మాత్రమే రూపొందుతారు" అని అన్నారు. అలాగే భారత జాతి భవిష్యత్తు తరగతి గదిలో నిర్ణయించబడుతుందని కొఠారి కమీషన్ చెప్పింది ... 

అక్షరాస్యత శాతం చెప్తున్న సత్యాలు

మొన్నటివరకు మన రాష్ట్ర పరిస్థితి చూస్తే అక్షరాస్యత 67% మాత్రమే ఉంది. నిరక్షరాస్యతా శాతం 33%గా ఉంది. జాతీయ అక్షరాస్యత శాతం 74 కాగా, మన ఆంద్రప్రదేశ్ 67.02 శాతం, ఒకటవ తరగతిలో 100 మంది పిల్లలు చేరితే, 10వ తరగతి వచ్చేసరికి 26 మంది బడి మానేసే పరిస్థితులు ఉన్నాయి. అంటే డ్రాపౌట్స్ రేట్ ఆంధ్రప్రదేశ్ లో 26% ఉంది. విద్యాహక్కు అంటూ ఎన్ని చట్టాలు చేసినా అవి సత్ఫలితాలు ఇవ్వలేక పోతున్నాయి. ఈ పరిస్థితికి అనేక కారణాలు మన కళ్ళముందే కనపడతాయి అందులో ముఖ్యమైనవి ప్రభుత్వ పాఠశాలలో సరైన మౌళిక సదుపాయాలు కొరవడటం, స్వాతంత్రం వచ్చి 72ఏళ్ళు గడిచినా , ఇంకా వర్షాలుపడితే నీళ్ళు కారే తరగతి గదులు, బాలికలకు మరుగుదొడ్లు లేని పాఠశాలలు, పాఠాలు చెప్పే ఉపాధ్యాయుల కొరత , ప్రహరీలు లేకుండా ప్రమాదకరంగా మారిన పాఠశాలల ప్రాంగణాలు మన రాష్ట్రంలో ఇంకా అనేకం కనపడుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు పాలించిన ప్రభుత్వాలు వీటిని పట్టించుకున్న పాపాన పోలేదు. పైగా పరిస్థితి ఇలా దిగజారుతుంటే మూలిగే నక్క మీద తాటికాయ పడినట్టు గత ప్రభుత్వం ప్రైవేటు విద్యారంగంకి మరింత బలం చేకూర్చేలా రేషనలైజేషన్ పేరుతో ప్రభుత్వ పాఠశాలలను మూసివేసే కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వచ్చారు. ఈ దుస్థితి వలన ప్రైవేట్ పాఠశాలలో చేరే విద్యార్థుల శాతం అన్ని రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రం అగ్రగామిగా ఉంది. ఈశాన్య రాష్ట్రాలతో పోల్చినా మనం వెనకపడే ఉన్నాము అనేది చేదు నిజం ..

అమ్మ ఒడి పథకం

కొత్తగా ఏర్పడిన వై.యస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తమ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పినట్టుగా పేద ఇంటి పిల్లలు ఆర్ధిక స్తోమత లేని కారణంగా చదువుకి దూరం అవ్వకూడదు అనేదే తమ లక్ష్యం అంటూ విప్లవాత్మకమైన "అమ్మ ఒడి" అనే పథకాన్ని ప్రవేశపెట్టారు. . తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి తల్లి తమ పిల్లలని బడికి పంపితే చాలు వారి బ్యాంకు ఖాతాల్లోకి ప్రతి సంవత్సరం 15వేల రూపాయలు ఇచ్చేలా ప్రభుత్వ పథకం రూపొందించారు. ఈ పథకం నిమిత్తం బడ్జెట్ లో 6,455 కోట్ల రూపాయలు కేటాయించి ఈ పథకాన్ని వచ్చే జనవరి 9 నుండి అమలు చేస్తాం అని ప్రకటించారు. ఈ అమ్మఒడి పథకం ప్రకటనతో గత విద్యా సంవత్సరాలలో కన్నా ప్రభుత్వ పాఠశాలలో చేరికలు ఎక్కువగా జరిగాయి. కొన్నిచోట్ల ప్రవేశ సీట్లు నిండిపోయాయి అనే బోర్డులు కూడ దర్శనం ఇచ్చాయి. ఇలా అనుకున్న లక్ష్యాన్ని ఆచరణలో పెట్టగా వచ్చిన పాక్షిక విజయంగా భావించిన జగన్ గారి ప్రభుత్వం పాఠశాల అభ్యున్నతికి మరొక పథకంతో ముందుకు వచ్చారు అదే నాడు-నేడు.

నాడు-నేడు కార్యక్రమం

పాఠశాలలో చేరిన విద్యార్ధులకి అన్ని సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో మన పాఠశాల "ఇప్పుడు ఉన్న స్థితి నుండి, ఉన్నత స్థితికి వచ్చేలా" ప్రొఫెసర్ బాల కృష్ణన్, సుధా నారాయణ మూర్తి కమిటి నివేదిక ఆధారంగా ముఖ్యమంత్రి జగన్ 9 అంశాల ప్రాధాన్యతతో నవంబర్ 14 నుండి (బాలల దినోత్సవం సందర్భంగా ) మొదలు పెట్టిన కార్యక్రమమే మన బడి నాడు-నేడు... ఇందుకోసం ప్రభుత్వం 1500 కోట్ల రూపాయల నిధులని కేటాయించింది. ప్రభుత్వ పాఠశాలలు ప్రస్తుతం ఎలా ఉన్నాయి, 3 ఏళ్ల తర్వాత ఎలా ఉండబోతున్నాయి. అన్నదాన్ని ఫోటోలతో సహా ప్రజలముందు ఉంచాలని ప్రభుత్వం సంకల్పించింది. దీనితో పాటు మన విద్యార్థులు రాబోయే రోజులలో ప్రపంచంతో పోటీ పడేలా తీర్చిదిద్దాలనే సంకల్పంతో, వచ్చే విద్యా సంవత్సరం నుండి 1 నుండి 6 తరగతుల వరకు అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీషు మీడియం తప్పనిసరి చేస్తూ తెలుగుని తప్పనసరి సబ్జెక్టుగా ఉండేలా నిర్ణయించారు.

తొలి విడతలో 45వేల పైచిలుకు ప్రభుత్వ పాఠశాలలకు గాను వచ్చే ఏడాది జూన్ - జులై నాటికి మొత్తం 15,715 స్కూళ్లలో 3,500 కోట్ల రూపాయలతో నూతన నిర్మాణాలు మరియు మరమ్మత్తులు చెయ్యటానికి చర్యలు తీసుకుంటున్నారు. వీటిలో ప్రభుత్వం నిర్దేశించిన 9 అంశాలలో ప్రాధాన్యత కొరవడిన పాఠశాలలకు వసతులు కల్పించి,తరువాత గతంలో "అప్పుడు ఎలా ఉన్నాయి- ఇప్పుడు ఎలా ఉన్నాయి" ఫోటోలతో సహా ప్రజలకు చూపించి ప్రైవేట్ పాఠశాలలకన్న మెరుగుగా, ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు ఉన్నాయి అని చూపి ప్రజల్లో నమ్మకం పెంచి, ప్రభుత్వ పాఠశాలకు విద్యార్ధులని రప్పించటమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్ గారు ఒక చారిత్రాత్మకమైన ముందడుగు వేశారు అనే చెప్పాలి.

నాడు-నేడు కార్యక్రమం ద్వారా ప్రతి పాఠశాలలో విద్యార్థులకు అందించే సదుపాయాలు:

1) ఫ్యాన్లు , ట్యూబ్ లైట్లు, మరుగు దొడ్లు , ఫర్నీచర్, పాఠశాల ప్రాంగణాలకి ప్రహరీ గోడలు, తరగతి గదులకు , మరమ్మత్తులు,రంగులు
ఫినిషింగ్, గ్రీన్ చాక్ బొర్డు, రక్షిత మంచినీరు, ఇంగ్లీషు ల్యాబ్.
2) పాఠశాలలో బోధనా ప్రమాణాలు పెంచటంతో పాటు ఉపాధ్యాయులకు అవసరమైన శిక్షణ.
3) ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీషు మీడియం ప్రవేశ పెట్టటం.
4) తెలుగు సబ్జెక్టుని తప్పనిసరిగా బోధించటం.
5) సకాలములో విద్యార్థులకి పుస్తకాలు, యూనిఫామ్స్ అందించటం.
6) మధ్యాహ్న భోజనం నాణ్యత పెంచటం, సక్రమంగా అమలు
7) విద్యార్థుల సంఖ్యకు తగ్గట్లుగా ఉపాధ్యాయుల నియామకం.8) విద్యార్థులలో నైపుణ్యమును పెంచడం
9)స్కూలు మరియు కాలేజీలలో ఫీజుల నియంత్రణ, పర్యవేక్షణకు కమిటీ, ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయుల స్థితిగతులను మెరుగుపరచటం, ప్రభుత్వ నిబంధనలు,ప్రమాణాలు పాటించకుండా నడిచే ప్రైవేట్ పాఠశాలలపై కఠిన చర్యలు.

తెలుగు - ఇంగ్లీష్ మీడియం లెక్కలు

రాష్ట్రంలో విద్య వ్యాపారమై అస్తవ్యస్తంగా సాగుతున్న ఈ సమయంలో విద్యా వ్యవస్థని అనేక ప్రణాళికలతో గాడిలో పెట్టాలనే ఆలోచన చేసిన ప్రభుత్వానికి భాషా ప్రేమికుల పేరుతో, ఆటంకాలు కలిగించే ప్రయత్నం ప్రతిపక్షాలు నుండి మొదలైంది. నిజానికి తెలుగు మీడియం ఎవరు చదువుతున్నారు అనే లెక్కలు ఒక్కసారి చూస్తే ఆశ్చర్యకరమైన వాస్తవాలు బహిర్గతం అవుతాయి.

2019 అక్టోబర్ 17 నాటికి రాష్ట్రంలో మొత్తం విద్యార్థుల సంఖ్య 70,86,864 వీరిలో
  • తెలుగు మీడియం చదివే వారి సంఖ్య 25,66,339
  • ఇంగ్లీషు మీడియం చదివే వారి సంఖ్య 44,17,964
  • ఇతర మీడియం ( ఉర్దు, తమిళ,కన్నడ, ఒరియా మీడియం) చదివే వారి సంఖ్య - 18,51,625

తెలుగు మీడియం చదివే 25,66,339 లో

  • విద్యార్థినులు సంఖ్య - 12,91,392
  • విద్యార్థుల సంఖ్య - 12,74,955

ఇంగ్లీషు మీడియం చదివే 44,17,964లో

  • విద్యార్థినులు సంఖ్య - 20,34,187
  • విద్యార్థుల సంఖ్య - 23,83,777

వర్గాల వారిగా చూసుకుంటే (ఇంగ్లీషు మీడియం చదివే వారు ) బి.సి - 62.50%, యస్.సి - 49.6%, యస్.టి 33.23%, ఒ.సి 82.62% , ఏ విధంగా చూసిన తెలుగు మీడియం చదివే వారి సంఖ్య ఇంగ్లీషు మీడియంలో చదివే వారికన్న కనిష్టంగానే ఉంది. అట్టడుగు వర్గాలకు చెందిన విద్యార్థులు మాత్రమే అవకాశాలు లేక ,ప్రభుత్వాలు చెయుతనీయక, ఆర్ధిక స్థొమత లేక ఇప్పటికి ఇంగ్లీషు మీడియం విద్యకు దూరంగానే ఉన్నారు. ధనిక,ఎగువ మధ్యతరగతి పిల్లలు ఇంగ్లీషు మీడియంలో చదువుతుండగా భాషకు రాని ముప్పు, కేవలం ఆర్ధిక స్థోమత లేక ఇంగ్లీషు విద్యకు దూరమైన పేద విద్యార్థులు జగన్ ప్రభుత్వం ఇస్తున్న చేయూతతో ఇంగ్లీష్ మీడియంలో చదవటంతో తెలుగు చనిపోతుందన్న స్థాయిలో, భాషా ప్రేమికుల ముసుగులో పవన్ కల్యాణ్ ,చంద్రబాబు ,వెంకయ్య నాయుడు లాంటి వారు రాజకీయం చెయ్యటం ఆశ్చర్యం కలిగించే విషయమే.

ప్రభుత్వ సంకల్పం

గత ప్రభుత్వం ప్రభుత్వ బడులని మూసివేయాలనే దుర్మార్గపు ఆలోచన చేస్తే ,కొత్త ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చే ఒక సరికొత్త అధ్యాయంకు నాంది పలికింది. జగన్ పాలనలో విద్యావ్యవస్థలో అసమానతలని పారద్రోలి విద్య ప్రతి పౌరుని హక్కుగా మార్చి, మన గ్రామములో ఉండే ప్రభుత్వ బడి గడప నుండే చదువుల విప్లవం తీసుకురావాలి. అప్పుడే రాబోయే 20 ఏళ్లలో ఈ విధానాలు ఆరోగ్యం,విద్యా రంగాలలో సత్ఫలితాలిచ్చి, గణనీయమైన మార్పులకు దోహదపడతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్య సరిగా చెప్పరు, పిల్లలని పట్టించుకోరు,మౌలిక సదుపాయాలు ఉండవు అనే అనుమానాల మధ్య ఏళ్ళు గడిచిపోయాయి. ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న ఈ విప్లవాత్మకమైన నిర్ణయాల అమలు తరువాత భారతదేశానికి ఆంధ్రప్రదేశ్ విద్యా విధానం ఒక రోల్ మోడల్ గా మారి దేశంలోనే అగ్రగామిగా మన రాష్ట్రం నిలవాలి అని ఆశిద్దాం.

idreampost.com idreampost.com

Click Here and join us on WhatsApp to get latest updates.

Related News