Nadendla Manohar, One Time Settlement - వన్ టైం సెటిల్మెంట్ అంటే దోచుకోవడమా మనోహర్‌..?

By Aditya Nov. 30, 2021, 07:02 pm IST
Nadendla Manohar, One Time Settlement - వన్ టైం సెటిల్మెంట్ అంటే దోచుకోవడమా మనోహర్‌..?

రాష్ట్రంలో వన్ టైం సెటిల్మెంట్ పేరుతో వలంటీర్ల వ్యవస్థ ద్వారా పేదలనుంచి పదివేల రూపాయల చొప్పున దోచుకుంటున్నారని జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆశ్చర్యకరమైన విమర్శలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో సీఎం జగన్ భూకబ్జాలు, ఇసుక దోపిడీతో ప్రజాధనాన్ని దోచుకుంటున్నారన్నారు. జగన్ పాలనలో రాష్ట్రం అధోగతి పాలై అంధకారంలో కూరుకుపోయిందన్నారు. రాజకీయాల్లో ఇన్నేళ్ల అనుభవం ఉండి, స్పీకర్‌గా కూడా పనిచేసిన మనోహర్‌ ఇలాంటి చిత్రమైన వ్యాఖ్యలు చేయడం చోద్యంగా ఉంది. అసలు ఈ పథకం పై నాదెండ్ల మనోహర్‌కు అవగాహన ఉందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

గృహ నిర్మాణ లబ్ధిదారులకు వారి ఇళ్లపై శాశ్వత హక్కు కల్పించేందుకు, భవిష్యత్తులో ఆ ఇంటి క్రయవిక్రయాలకు, తాకట్టుకు అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వన్ టైం సెటిల్మెంట్ పథకం ప్రకటించింది. ఆ ఇంటిపై ఎంత రుణం ఉన్నా కేవలం రూ.పదివేలు చెల్లిస్తే సంపూర్ణ గృహ హక్కు కల్పిస్తూ ధ్రువీకరణ పత్రాలను అధికారులు అందజేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకానికి స్పందన లభిస్తోంది. రూ.45వేలు,  రూ.50 వేలు రుణ బకాయి ఉన్న లబ్ధిదారులు కేవలం రూ.పదివేలు చెల్లించి సంపూర్ణ హక్కు పత్రాలను పొందుతున్నారు. తమకు ఇన్నాళ్లూ ఇల్లు ఉన్నా, దానిపై రుణం ఉండడం వల్ల ఎటువంటి హక్కు ఉండేది కాదని పేదలు చెబుతున్నారు. అత్యవసరమైనప్పుడు ఇంటిని తాకట్టు పెట్టుకునే అవకాశం లేక ఇబ్బంది పడేవారమని అంటున్నారు. ఈ పథకం వల్ల ఇంటిపై తమకు హక్కు లభిస్తోందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

దోచుకోవడం ఎలా అవుతుంది?

పేరుకుపోయిన రుణ బకాయిలను వసూలు చేసే క్రమంలో బ్యాంకులు సైతం వన్ టైం సెటిల్మెంట్ పద్ధతి అమలు చేస్తుంటాయి. ఈ పథకంలో పెద్ద మొత్తంలో ఉన్న బకాయి మొత్తం కాకుండా అటు లబ్ధిదారుకు, ఇటు బ్యాంకుకు సమ్మతమైన మొత్తాన్ని చెల్లిస్తే రుణం మొత్తం తీరిపోతుంది. ఆ మేరకు బ్యాంకు కూడా లబ్ధిదారుకు ధ్రువీకరణ పత్రం అందజేస్తుంది. ఇది దేశ వ్యాప్తంగా ఉన్న పద్దతి. ఇందులో దోచుకోవడం ఏముంటుంది. లబ్ధిదారులు చెల్లించాల్పిన రుణం మొత్తం కన్నా బాగా తక్కువ సొమ్ము చెల్లించి రుణ విముక్తులు అవుతారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం ఉద్ధేశం ‍కూడా లబ్ధిదారుకు ఇంటిపై హక్కు కల్పించాలనే. ఇందులో బలవంతం కూడా లేదు. అయినా ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం దీన్నో దోపిడీ పథకం కింద ప్రొజెక్టు చేస్తోంది. జనసేన నేత మనోహర్‌ కూడా అదేబాటలో విమర్శలు చేయడమే విచిత్రం.

భూ కబ్జాలు, ఇసుక దోపిడీ ఎక్కడ?

ఏపీలో సీఎం జగన్ భూకబ్జాలు, ఇసుక దోపిడీతో ప్రజాధనాన్ని దోచుకుంటున్నారంటున్న మనోహర్‌ ఎక్కడ? ఎప్పుడు? అన్నది కూడా చెప్పి ఉంటే బావుండేది. ఫలానా చోట ముఖ్యమంత్రి, లేదా ఆయన తరపు వారు భూకబ్జాలకు పాల్పడ్డారని చెప్పి విమర్శలు చేస్తే బాధ్యత అనిపించుకుంటుంది కాని ఇలా స్వీప్‌ కామెంట్స్‌ చేయడం సబబేనా? ప్రభుత్వం ఇసుక అమ్మడం కూడా దోపిడీ అంటే ఎలా? తెలుగుదేశం హయాంలో ఉచితం పేరిట ఇసుక అమ్మకాల్లో వేల కోట్ల రూపాయల కుంభకుణం జరిగింది. దాన్ని అరికట్టేందుకు వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం కొత్త ఇసుక పాలసీని తీసుకొచ్చి అమలు చేస్తోంది. దీనిపై లోపాలుంటే చెప్పాలి.సీఎం దోపిడీ చేసేస్తున్నారనడం ఏమిటి అన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

పైశాచిక ఆనందం ఎవరిది?

ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులకు తీవ్ర నష్టం కలిగితే ఆదుకోవడం పోయి, ముఖ్యమంత్రి జగన్‌ పైశాచిక ఆనందం పొందుతున్నారని ..మనోహర్‌ విమర్శించడం మరీ ఆశ్చర్యకరం. గతంలో ఏ ప్రభుత్వం స్పందించనంత వేగంగా ముందుకొచ్చి రాయలసీమలో వరద బాధితులకు సర్కారు సాయం అందించింది. ఇప్పటి వరకు మాకు సాయం అందలేదని ఎవరూ ఫిర్యాదు చేయలేదు. రైతులకు కలిగిన నష్టానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వాన్ని సాయం కోరుతూ ముఖ్యమంత్రి లేఖ రాశారు. కేంద్ర బృందం వచ్చి పరిశీలించి వెళ్లింది. రైతులను ఆదుకొనే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే అది పైశాచిక ఆనందం అవుతుందా? క్షేత్ర స్థాయిలో పరిస్థితులపై అవగాహన లేకుండా పున్నానికో, అమావాస్యకో జనంలోకి వచ్చి ఇలా విమర్శలు చేయడం పైశాచిక ఆనందం అవుతుందా? ఆలోచించాలి. స్పష్టమైన హామీలతో జనసేన పార్టీ మేనిఫెస్టోల ద్వారా అంచెలంచెలుగా రాష్ట్రంలో బలపడుతుందని పేర్కొన్న మనోహర్‌ దానిపై దృష్టి పెట్టడం మంచిది. పార్ట్‌ టైమ్‌ పాలిటిక్స్‌తో కాలక్షేపం చేసే పార్టీ జనసేన అని జనంలో ఇప్పటికే ఒక అభిప్రాయం ఉంది. దానికితోడు ఇలా తలా తోకా లేని విమర్శలు చేస్తే పార్ట్‌ టైమ్‌ పాలిటిక్స్‌ కూడా చేయడం జనసేనకు చేతకాదు అనుకునే అవకాశం ఉంది. విమర్శలు నిర్మాణాత్మకంగా ఉండాలి కాని ఇలా చౌకబారుగా కాదు అన్నది గమనిస్తే జనసేనకే మంచిది.

Also Read : BJP, Somu Veerraju - తెగనమ్మడం కన్నా తాకట్టు నేరమా..?

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp