ఈట‌ల హ‌త్య‌కు కుట్ర‌.. ఆ మాట‌ల్లో నిజ‌మెంత‌?

By Kalyan.S Jul. 20, 2021, 03:00 pm IST
ఈట‌ల హ‌త్య‌కు కుట్ర‌.. ఆ మాట‌ల్లో నిజ‌మెంత‌?

రాజీనామా చేసిన తొలి రోజుల్లో వ‌చ్చినంత ఊపు ప్ర‌స్తుతం మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ కు లేద‌నేది వాస్త‌వం. బీజేపీలో చేరిక అనంత‌రం ఆయ‌న‌కు కొన్ని వ‌ర్గాలు దూర‌మ‌వుతూ వ‌స్తున్నాయి. ఈట‌ల‌పై విమ‌ర్శ‌లు చేసే వారు పెరుగుతూ వ‌స్తున్నారు. అభ్యుద‌య భావాలు గ‌ల ఈట‌ల‌కు గ‌తంలో మాజీ మావోయిస్టుల‌తో కూడా మంచి సంబంధాలు ఉండేవి. ఆయ‌న కాషాయ తీర్థం పుచ్చుకోవ‌డంతో ఆ వ‌ర్గం కూడా ఈట‌ల‌కు దూర‌మ‌వుతోంది. ఈ క్ర‌మంలో త‌గ్గుతున్న ప‌ర‌ప‌తిని పెంచుకునేందుకు, ప్ర‌జ‌ల‌కు ద‌గ్గ‌ర‌య్యేందుకు పాద‌యాత్ర‌కు శ్రీ‌కారం చుట్టారు. పాద‌యాత్ర ద్వారా రాజ‌కీయాల‌ను హీటెక్కించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు ఈట‌ల‌. అందుకు మాజీ న‌క్స లైట్ ల పేరునే ఆయ‌న ఉప‌యోగించారు.

మంత్రి ప‌ద‌వి నుంచి భ‌ర్త‌ర‌ప్ అనంత‌రం ఈట‌ల రాజేంద‌ర్ కు ప్ర‌జ‌ల్లో సానుభూతి వ‌చ్చింది. సుదీర్ఘకాలంగా త‌మ‌కు ఎమ్మెల్యేగా సేవ‌లందిస్తున్న వ్య‌క్తిపై ప్ర‌భుత్వం అక‌స్మాత్తుగా అలాంటి నిర్ణ‌యం తీసుకోవ‌డం.. సాధార‌ణంగానే ఈట‌ల‌కు క‌లిసి వ‌చ్చింది. అయితే కొంత కాలంగా రాజేంద‌ర్ రాజకీయాలు ఆక‌ట్టుకోవ‌డం లేదు. బీజేపీలో చేరిన మొద‌టి రోజు ఈట‌ల‌కు మ‌ద్ద‌తుగా స్వ‌రం క‌లిపిన క‌మ‌లం నాయ‌కులు కూడా కాస్త స్లో అయ్యారు. ఈ క్ర‌మంలో ‘ప్రజా జీవన యాత్ర’ ద్వారా ప్ర‌జ‌ల‌కు చేరువ‌య్యేందుకు ఈట‌ల ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. త‌న‌ను చంపేందుకు కుట్ర జ‌రుగుతోంద‌ని ప్ర‌చారం చేస్తూ రాజేంద‌ర్ పాద‌యాత్ర‌లో ప‌దునైన ప‌లుకులు ప‌లుకుతున్నారు.

ఆ మంత్రి.. హంత‌క ముఠాతో చేతులు క‌లిపారు
‘‘ఓ మంత్రి హంతక ముఠాతో చేతులు కలిపి నా పాదయాత్రను అడ్డుకుని, దాడి చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నాడు. మాజీ నక్సలైట్‌ ఒకరు నాకు ఈ సమాచారం ఇచ్చాడు’’ అని మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేసిన తాజా వ్యాఖ్య‌లు అటు టీఆర్ఎస్, ఇటు బీజేపీ లో హాట్ టాపిక్ గా మారాయి. ‘‘తెలంగాణ ఉద్యమంలో ఉండగా నయీం తన డ్రైవర్‌ను కిడ్నాప్‌ చేశాడు. న‌న్ను చంపుతానంటూ వందల సార్లు ఫోన్లు చేశాడు. అయినా భయపడలేదు. ఇప్పుడు మ‌ళ్లీ న‌న్ను చంపేందుకు కొంద‌రు కుట్ర చేస్తున్నారు. హుజూరాబాద్‌కు బానిసల్లాగా వచ్చిన మంత్రులు, టీఆర్‌ఎస్‌ నేతలు చిల్లర చేష్టలు చేస్తున్నారు. నాపై ఈగ వాలితే మాడి మసైపోతారు ’’ అని ధ్వజమెత్తారు. రైస్‌మిల్‌లో వంటకు ఏర్పాట్లు చేసుకుంటే యజమానిని బెదిరించి సామగ్రి సీజ్‌ చేశారని, ఇలాంటివాటికి భయపడనన్నారు.

ఎవ‌రా న‌క్స‌లైట్లు
ఈట‌ల వ్యాఖ్య‌ల‌తో పోలీసులు మరింత కట్టుదిట్టమైన భద్రత కల్పించాల్సిన ప‌రిస్థితి వ‌చ్చిందంటే ప‌రిస్థితి అర్థం చేసుకోవ‌చ్చు. తనపై కుట్ర జరుగుతుందని కొంతమంది మాజీ నక్సలైట్లు వచ్చి స్వయంగా తనకే చెప్పారన్న ఈట‌ల వ్యాఖ్య‌ల‌పై పోలీసులు విచార‌ణ కూడా జ‌రుపుతున్నారు. ఎవ‌రా న‌క్స‌లైట్లు, అందులో వాస్త‌వం ఎంత అనే వివ‌రాల‌ను ఆరా తీస్తున్నారు. అయితే, సందర్భం వచ్చినప్పుడు తనపై కుట్రలు చేసిన వారి పేరు బయట పెడతానంటూనే.. ఓ మంత్రి కుట్ర‌లు ప‌న్నుతున్నాడ‌ని ప‌రోక్షంగా గంగుల‌పై ఆరోప‌ణ‌లు చేయ‌డం క‌ల‌క‌లం రేపుతోంది.

నిజం తేలితే రాజీనామా చేస్తా
దీంతో మంత్రి గంగుల కమలాకర్ స్పందించారు. ఈటల రాజేందర్ చేస్తున్న ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదని, ఆయన చేసిన ఆరోపణలపై సీబీఐతో విచారణ చేయించాలని బీజేపీ నేతల్ని డిమాండ్‌ చేశారు. తెలంగాణలో రాజకీయ హత్య ఉండవనీ, ఏదైనా ఉంటే రాజకీయ ఆత్మహత్యలేనని వ్యాఖ్యానించారు. ఈటల చెవిలో ఎవరు చెప్పారో బయటపెట్టాలని, కుట్రకు పాల్పడింది ఎవరో తేల్చాలని గంగుల డిమాండ్‌ చేశారు. ఈటల రాజేందర్‌కు రాష్ట్ర ప్రభుత్వం తగిన భద్రత కల్పిస్తోందన్నారు. ఈటలతో రాజకీయ వైరమే తప్ప వ్యక్తిగత కక్ష లేదని వివరించారు. విచారణలో తన పేరు ఉంటే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని తెలిపారు. ఏ దర్యాప్తు సంస్థతోనైనా విచారణకు సిద్ధం అని స్పష్టం చేశారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp