పత్తి ,మిరప గిట్టుబాటు ధరల వెనక ఉన్న లెక్కలు

By KalaSagar Reddy Dec. 11, 2019, 06:02 pm IST
పత్తి ,మిరప గిట్టుబాటు ధరల వెనక ఉన్న లెక్కలు

రేపు రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన పంటలకు గిట్టుబాటు ధరను కల్పిస్తూ నిర్ణయం తీసుకోబోతుంది.ఈ పంటలకు సాగుకు రైతుకు వాస్తవంగా ఎంత ఖర్చు అవుతుంది,స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం ఎకరాకు ఎంత గిట్టుబాటు ధరకల్పిస్తే రైతుకు న్యాయం జరుగుతుందో చెప్పే విశ్లేషణ ,

పత్తి , రైతు మెడపై వేలాడే తెల్లబంగారపు కత్తి
పత్తి పంట పెట్టుబడి ఎంత ?. గిట్టుబాటు ధర ప్రామాణికం ఏమిటి ?. పత్తి పంటకి గిట్టుబాటు ధర ఎంత ఉండాలి .
ఓ పది పదిహేనేళ్ళ క్రితం వరకు మన ఉమ్మడి రాష్ట్రంలో విస్తారంగా సాగు చేసే పత్తి రాను రాను సాగు విస్తీర్ణం తగ్గుతూ వచ్చింది . ఒకప్పుడు పత్తి , మిర్చికి వాణిజ్య రాజధాని అయిన గుంటూరులో , చుట్టుపక్కల ఉండే వందల జిన్నింగ్ మిల్లులు నేడు గోడౌన్లుగా మారుతున్నాయి . ఎక్కువ శాతం పండించే తెలంగాణాలో రాష్ట్ర విభజన తర్వాత పత్తి సాగు గణనీయంగా తగ్గింది .

రాయలసీమలో కూడా పత్తి సాగు తక్కువే , ఇహ మిగిలింది కోస్తా . నెల్లూర్ లో కొంత విస్తీర్ణం, ప్రకాశం, గుంటూరు, కృష్ణాలో కొంత భాగం, శ్రీకాకుళం , పలాసలో వలస రైతులు వర్షాధార భూముల్లో పత్తిని ఎక్కువ సాగు చేస్తున్నారు . సాగు విస్తీర్ణం తగ్గిన వార ధరలో కొంత పెరుగుదల ఉండాలి.అది కనపడట్లేదు .అన్నీ అనుకూలంగా ఉంటే పెట్టుబడి గిట్టుబాటు అవుతుంది . లేకపోతే షరా మామూలే .

మనం జిల్లా ఎడిషన్లో రెండ్రోజులకోసారి చూసే రైతు ఆత్మహత్యల్లో మూటికి ఒకటి పత్తి రైతు ఆత్మహత్య అని ఉంటుంది చదవండి . నిజానికి రైతులవి ఆత్మహత్యలు కావు బలవన్మరణాలు జరిగిన జరుగుతున్న బలవన్మరణాల్లో సగం పైగా వార్తలు రావు , మీకు చేరవు .
పత్తి సాగు లెక్క పనుల వారీగా చూద్దాం .

భూమి కవులు: 10000:00
దుక్కి పని , సాళ్ళు: 3500:00
విత్తనం, నాటు కూలి: 2300:00
కలుపుమందు,కూలి: 900:00
పెస్టిసైడ్స్ + కూలి: 4800:00
ఫర్టిలైజర్ + కూలి: 5000:00
కలుపు తీత: 1600:00
అంతరవ్యవసాయం: 2000:00
పత్తి తీత , తోలకం: 13500:00
చిల్లర ఖర్చు : 400:00
----------------------------------------------
మొత్తం ఖర్చు: 44000:00

దిగుబడి , ఆదాయం చూస్తే ,8 నుండి 15 క్వింటాల్ వరకు దిగుబడి , 3700 నుండి 4600 వరకు ఈ సీజన్లో నడుస్తున్న క్వింటాల్ ధర కాబట్టి , సగటు12 క్వింటాల్×4200 ధర    = 50400.00.
ఒక ఎకరానికి నికర లాభం =   రాబడి 50400 - పెట్టుబడి 44000 = 6400.00

ఓ ఐదెకరాల కౌవులు రైతుకి ఆరుగాలం శ్రమిస్తే వచ్చే ఆదాయం 6400* 5 = 32000. వాతావరణం అనుకూలించి 15 క్వింటాలు వరకూ పండితే పర్లేదు . ఖర్మ కాలి వర్షాలు లేక దిగుబడి 12 కన్నా తగ్గిన వాళ్ళు నష్టాలు మోయాల్సిందే .

స్వామినాథన్ కమిటీ మొత్తం పెట్టుబడి సొమ్ములో 50% ఆదాయాన్ని లెక్కించి రైతుకు ఇవ్వమని సిఫార్సు చేసింది. ఈ లెక్క ప్రకారం  ఎంత రేటు రావాలో చూద్దాం .
పెట్టుబడి : 44000.00
పెట్టుబడిలో 50% : (+) 22000.00.
మొత్తం: (÷12) 64000 :00
క్వింటాకి రావాల్సిన గిట్టుబాటు ధర = 5350:00 

వాస్తవానికి స్వామినాథన్ కమిటీ సిఫారసులు అమలు చేయాల్సిన కేంద్ర ప్రభుత్వ బాధ్యతను నెత్తికెత్తుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం గిట్టుబాటు ధర పెనుభారం అవుతుందని భావిస్తే కనీసం 40 శాతం గిట్టుబాటు ధర ప్రకారం లాభం లెక్కించినా క్వింటాకు 5150 రూపాయలు ఇస్తే రైతు కష్టానికి తగ్గ గిట్టుబాటు ధర అవుతుంది

మిర్చి పంట పెట్టుబడి ఎంతవుతుంది ? , గిట్టుబాటు ధర ఎంత ఉండాలి ? .
మిర్చి పెట్టుబడి ఒక ఎకరాకు పలు ప్రాంతాల పెట్టుబడుల సరాసరి అంచనా . పనుల వారీగా..
పొలం కౌవులు : 20000.00
దుక్కి,అరక, నాగళ్లు : 15000.00
విత్తనం , నాటు వరకు : 15000.00
పురుగు మందులు. : 5000.00
ఎరువులు : 20000 .00
కలుపులు , పై కూలి. : 5000 .00
నీటి పారుదల ఖర్చు : 4000 :00
కోత , గ్రేడింగ్ : 30000 .00
గోతాలు,తొక్కు కూలి : 4000 :00
యార్డుకి ట్రాన్స్పోర్ట్ : 2000 :00
సాదర ఖర్చులు. : 2000 :00
----------------------
మొత్తం ఖర్చు = 142000 :00 

ఇది సాగు నీరు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో అయ్యే ఖర్చు . ఐతే ప్రకాశం , నెల్లూర్ , రాయల సీమల్లోని కొన్ని చోట్ల నీటి కొరత కారణంగా తక్కువ కాలమే కాపు వస్తుంది . అందువలన ఖర్చు కొంత తక్కువ , అలాగే దిగుబడీ తక్కువ వస్తోంది .

ఇప్పుడు పంట , ఆదాయ వివరాలు చూద్దాం ,
సగటున ఎకరాకు 20 క్వింటాళ్లు పండుతోంది . అందులో20 శాతం తాలు గాయ(డామేజ్) అంటే 4 క్వింటాలు . తాలు గాయకు సగటున క్వింటాకు 5000 రూపాయల ధర పలుకుతుంది. స్వామినాథన్ కమిటీ మొత్తం పెట్టుబడి సొమ్ములో 50% ఆదాయాన్ని లెక్కించి రైతుకు ఇవ్వమని సిఫార్సు చేసింది. ఈ లెక్క ప్రకారం 

పెట్టుబడి                                          142000.00
పెట్టుబడిలో 50 శాతం  (+)                 71000.00     
                                                     -------------------                         
                                                       213000.00
4 క్వింటాల్ తాలుగాయ ఆదాయం ( -) 20000.00
                                                          --------------------
16 క్వింటాల్ ఆదాయం                       193000.00
                                                          -----------------------
క్వింటా సగటు ధర (÷ 16)                    12100.00 రూపాయలు ఉంటే రెండు -మూడు ఎకరాల సన్నకారు రైతు ఆరుగాలం కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కుతుంది .

రాష్ట్ర ప్రభుత్వం రైతుకు సహాయం చెయ్యటానికి గిట్టుబాటు ధర ఇవ్వటానికి చేస్తున్న ప్రయత్నం హర్షణీయం.పైన రాసిన లెక్కలు వాస్తవ పరిస్థితుల ఆధారంగా లెక్కకట్టినవి. ప్రభుత్వం ఈ లెక్కలకు దగ్గరగా గిట్టుబాటు ధర కల్పిస్తే రైతులు జగన్ను పది కాలాలపాటు గుర్తుపెట్టుకుంటారు .

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp