Mp rammohan naidu - ఎవరు బజారు రౌడీలుగా వ్యవహరిస్తున్నారు రామ్మోహన్‌?

By Aditya Nov. 22, 2021, 05:53 pm IST
Mp rammohan naidu - ఎవరు బజారు రౌడీలుగా వ్యవహరిస్తున్నారు రామ్మోహన్‌?

ఆంధ్రప్రదేశ్‌లో గౌరవంగా బతకాల్సిన కొంతమంది పోలీసులు బజారు రౌడీలుగా వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అడ్డగోలుగా వ్యాఖ్యలు చేశారు. పోలీసులు అధికార పార్టీ కండువా కప్పుకుని పనిచేస్తున్నారని ఆరోపించారు. సోమవారం ఆయన శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ కూన రవికుమార్‌ను అర్థరాత్రి సమయంలో అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి వైఫల్యాలను ఎత్తి చూపుతున్నందుకే కూన రవిపై అక్రమ కేసులు పెట్టారని, మహిళలు ఉండగా రాత్రిపూట పోలీసులు రవి ఇంట్లోకి ప్రవేశించే హక్కు ఎవరు ఇచ్చారన్నారు. టీడీపీ నేతలు కేసులకు భయపడేది లేదని, పార్టీ నేతలు, కార్యకర్తలు మరింత కసితో పనిచేస్తారని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.
జరిగింది ఇదీ..

కన్నీళ్లు పెట్టుకున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు మద్దతుగా శ్రీకాకుళంలో వంద మందితో కూన రవికుమార్‌ నిరసనకు దిగుతున్నట్టు సమాచారం అందడంతో  శ్రీకాకుళం టూటౌన్‌ సీఐ ఆర్‌ఈసీహెచ్‌ ప్రసాద్‌ శనివారం కూన ఇంటి వద్దకు వెళ్లారు. శాంతిభద్రతల సమస్య దృష్ట్యా ఇంటిలోనే ఉండాలని కూనకు సూచించగా.. ఆయన సీఐపై నోరుపారేసుకున్నారు. ‘డ్యూటీయా? నా ఇంటి లోపలకు నువ్వు పోలీసులను పంపిస్తే నీ కాళ్లు ఇరగగొడతా.. ఏదైనా ఉంటే రోడ్డుపై చేస్కో.. రేప్పొద్దున కోర్టుకు రారా.. నిన్ను, నీ ఉద్యోగం, నీ యూనిఫాం లేకుండా చేస్తా.. రెండున్నరేళ్ల తర్వాత నీకు ఉద్యోగం ఉండదు గుర్తుపెట్టుకో.. నేను దృష్టి పెడితే అప్పటి వరకు కూడా అక్కర్లేదు.. నీ భుజం మీద యూనిఫాం ఎలా ఉంటుందో చూస్తా.. నీ అంతు చూస్తాను ఏమనుకుంటున్నావో’ అంటూ సీఐ ప్రసాద్‌ను నెట్టేశారు. ‘ఎవడైనా పోలీసు లోపలికి వస్తే మర్యాదగా ఉండదు’ అంటూ హూంకరించారు. ‘మీ ఇంటిలోకి ఎక్కడొచ్చాం. రోడ్డుపైనే ఉన్నాం. శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకుని మీరు బయటికి రాకూడదని మీరు బయటకు వచ్చాక చెప్పాం.. అంతకుమించి ఏం జరగలేదు కదా?’ అని సీఐ సున్నితంగా చెబుతున్నా వినకుండా కూన  రెచ్చిపోయారు. దీంతో సీఐ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కూనను అరెస్టు చేశారు.

హుందాగా వ్యవహరించలేరా..

కూన రవికుమార్‌ పోలీసు అధికారిపై నోటికొచ్చినట్టు మాట్లాడారని అరెస్ట్‌ చేస్తే అంతకన్న హీనంగా మాట్లాడడం రామ్మోహన్‌ నాయుడుకు తగునా అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక ఎంపీ హుందాగా వ్యవహరించాల్సింది పోయి పోలీసులను బజారు రౌడీలు అనడం ఏమిటి? జరిగిన ఘటన మీడియా ద్వారా అందరికీ తెలిసింది. తప్పెవరిది అన్నది అర్థమవుతున్నా దానికి మసిపూసి మారేడుకాయ చేద్దాం అన్న చందంగా అవాస్తవాలను మాట్లాడి, ఇంకో రెండు తిట్లు పోలీసులను తిట్టేస్తే సరిపోతుందా? టీడీపీ నేతలు కేసులకు భయపడేది లేదని, పార్టీ నేతలు, కార్యకర్తలు మరింత కసితో పనిచేస్తారని చెప్పడంలో అర్థమేమిటి? రాష్ట్రం వ్యాప్తంగా టీడీపీ నేతలు పోలీసుల పట్ల ఇదేవిధంగా వ్యవహరిస్తారనా? ఒకపక్క ప్రజాస్వామ్య విలువలు దిగజారి పోతున్నాయని, దేవాలయం లాంటి అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని అంటూనే రామ్మోహన్‌నాయుడు ఇలా మాట్లాడడం ఏమిటి అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. భారతదేశ చరిత్రలో ఏపీ రాష్ట్ర పోలీస్ వ్యవస్థ అంత దిగజారుడు ఎక్కడా చూడలేదని వ్యాఖ్యానించడం సబబా?  శాంతిభద్రతల సమస్య దృష్ట్యా ఇంటిలోనే ఉండాలని ఒక పోలీసు అధికారి సూచిస్తే మాజీ ఎమ్మెల్యేగా చట్టాన్ని గౌరవించాల్సింది పోయి అరేయ్‌.. తురేయ్‌ అని కూన నోటికొచ్చినట్టు మాట్లాడితే దాన్ని వెనుకేసుకు రావడం ఏం రాజకీయం?
 
రెచ్చగొట్టడమే అజెండానా..

అటు వైఎస్సార్‌ సీపీ నాయకులను, ఇటు అధికారులను ఏదో వంకతో అభ్యంతరకరమైన భాషతో దూషించడమే టీడీపీ నాయకులు అజెండాగా పెట్టుకున్నారనే విమర్శలు పరిశీలకుల నుంచి వినిపిస్తున్నాయి. చంద్రబాబు, లోకేశ్‌ మొదలు దాదాపు టీడీపీ నేతలంతా తరచుగా ఈ విధంగా మాట్లాడుతున్నారు. వారు సమాధానం ఇస్తే ఎదురుదాడి చేస్తున్నారంటారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటే కక్ష సాధింపు అంటారు. ఇలా ఏదోవిధంగా ప్రతి అంశాన్ని వివాదాస్పదం చేస్తూ జనం నోళ్లలో నానాలని టీడీపీ నాయకులు యత్నిస్తున్నారు. ప్రభుత్వానికి నిర్మాణాత్మక సూచనలు ఇచ్చి ప్రజల మన్ననలు పొందాల్సిన ప్రతిపక్షం ఇలా నెగిటివ్‌ ధోరణితో వారి దృష్టిలో పడాలని చూడడం ప్రజాస్వామ్య విలువలు పరిరక్షించడం కిందకు వస్తుందా రామ్మోహన్‌నాయుడు గారూ..

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp