మాగంటి వారు సమర్పించు... వైద్య వాహనాలు ..?!

By Voleti Divakar Jun. 26, 2020, 11:45 am IST
మాగంటి వారు సమర్పించు... వైద్య వాహనాలు ..?!

సినీనటుడు, రియల్ ఎస్టేట్ వ్యాపారి మాజీ ఎంపి మాగంటి మురళీమోహన్ రాజకీయాన్ని కూడా వ్యాపారంగా మార్చేశారన్న అపప్రదను మూటకట్టుకున్నారు. తన హయాంలో ప్రజాధనంతో రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గ ప్రజల సౌకర్యార్థం సమకూర్చిన ఆధునాతన వైద్య వాహనాలు ఇప్పుడు జాడ లేకుండాపోయాయి. కేన్సర్ నిర్ధారణ, దంత, ఇతర వైద్య పరీక్షల కోసం అప్పట్లో ఆధునాతన వాహనాలను తెప్పించారు. తన ఎంపి నిధులతో పాటు, ఓఎన్జీసి, జిఎ ఇతర నిధులతో ఈవాహనాలను ఏర్పాటు చేశారు. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు మురళీమోహన్ ఈ వాహనాలను ఆర్భాటంగా ప్రారంభించారు. గుడా మాజీ చైర్మన్ గన్ని కృష్ణ ఈ వాహనాలను ప్రతీవార్డులోనూ తిప్పారు. ఎన్నికలకు ముందు ప్రతీ వార్డులోనూ ఉచిత వైద్యశిబిరాలను ఏర్పాటు చేసి, హడావుడి చేశారు.

ఎన్నికల తరువాత నుంచి ఈ వాహనాల జాడ కనిపించడం లేదు. ఈ వాహనాల కోసం సుమారు రూ. 2 కోట్లకు పైగా ప్రజాధనాన్ని వెచ్చించారు. ప్రస్తుతం ఈ వాహనాలను ఎక్కడ ఉన్నాయి... ఎవరు వినియోగిస్తున్నారన్నది చర్చనీయాంశంగా మారింది. వీటిని తన సామాజిక వర్గానికే చెందిన వ్యక్తి నిర్వహణలో సాగుతున్న జిఎస్ఎల్ వైద్య కళాశాల సంస్థకు అప్పగించినట్లు ఒక ప్రచారం జోరుగా సాగుతోంది. జిఎస్ఎల్ వైద్య కళాశాల సంస్థ నిర్వాహకుడు టిడిపి నేత గన్ని కృష్ణ సోదరుడే.

గతంలో టీడీపి ప్రభుత్వ హయాంలో కూడా కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి రావాల్సిన క్యాన్సర్ చికిత్స పరికరాన్ని జి ఎస్ ఎల్ కు చెందిన ఆసుపత్రికి మళ్లించారన్న ఆరోపణలు ఉన్నాయి. సుమారు 2కోట్ల విలువైన ఈ కోబాల్ట్ పరికరం దివంగత లోకసభ స్పీకర్ చొరవతో ప్రైవేటు ఆసుపత్రికి మళ్లించినట్లు అప్పట్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈపరికరం కాకినాడకు వస్తే ఉత్తరాంధ్ర కేన్సర్ బాధితులకు ఎంతో ఉపయుక్తంగా ఉండేది. 2019 సార్వత్రిక ఎన్నికల తరువాత మాజీ ఎంపి మురళీమోహన్, ఆయన రాజకీయ వారసురాలు, ఎంపిగా పోటీ చేసి ఓడిపోయిన రూపాదేవి తమ మకాంను హైదరాబాద్ కు మార్చేసినట్లు పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు.

వైద్యం భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అయిన నేపథ్యంలో ప్రజాధనంతో నియోజకవర్గ ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించే ఈ వైద్య వాహనాల జాడను కనిపెట్టి, మళ్లీ ప్రజలకు అందుబాటులోకి తేవాలని రాజమహేంద్రవరం నియోజకవర్గ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈవిషయంలో రాజమహేంద్రవరం ప్రస్తుత ఎంపి మార్గాని భరత్, ఇతర వైసిపి నాయకులు చొరవ తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp