సత్తా చాటిన ఎంపీ అవినాష్‌ రెడ్డి

By Karthik P Jul. 22, 2021, 06:49 pm IST
సత్తా చాటిన ఎంపీ అవినాష్‌ రెడ్డి

కృష్ణా జలాల విషయంలో దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ హక్కులను తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా కాలరాస్తుందో కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి లోక్‌సభ దృష్టికి తెచ్చారు. విద్యుత్‌ ఉత్పత్తితోపాటు కృష్ణా నదిపై తెలంగాణ కడుతున్న అక్రమ ప్రాజెక్టులను వైఎస్‌ అవినాష్‌ రెడ్డి సభలో ప్రస్తావించారు. తెలంగాణ చర్యల వల్ల ఏపీకి జరుగుతున్న నష్టాన్ని వివరిస్తూ.. తెలంగాణను నిలువరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ రోజు లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్‌ అవినాష్‌ రెడ్డి కృష్ణా జలాల అంశంపై మట్లాడారు.

విద్యుత్‌ ఉత్పత్తితో నష్టం.. మా ప్రయోజనాలు కాపాడండి..

శ్రీశైలం ప్రాజెక్టు నుంచి అనధికారికంగా విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ హక్కులను కాలరాస్తోందని ఎంపీ అవినాష్‌ రెడ్డి ధ్వజమెత్తారు. ‘‘ శ్రీశైలంలో కనీస నీటిమట్టం 854 అడుగుల అని 2004 సెప్టెంబర్‌ 28వ తేదీన నాటి ప్రభుత్వం జీవో 107ను జారీ చేసింది. ప్రాజెక్టులో 854 అడుగుల మేర నీటి మట్టం ఉంటేనే రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని ఆయకట్టుకు, చెన్నై తాగునీటి అవసరాలు తీరుతాయి. కానీ తెలంగాణ ప్రభుత్వం కనీస నీటి మట్టం లేకపోయినా 800 అడుగుల వద్దే విద్యుత్‌ ఉత్పత్తి చేస్తోంది. ఈ విషయాన్ని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రధానికి, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) దృష్టికి తీసుకెళ్లారు. విద్యుత్‌ ఉత్పత్తి ఆపాలని కేఆర్‌ఎంబీ ఆదేశాలు జారీ చేసినా తెలంగాణ విద్యుత్‌ ఉత్పత్తిని ఆపలేదు. దీని వల్ల సీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో సాగు, చెన్నై తాగునీటికి తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయి. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని విద్యుత్‌ ఉత్పత్తిని ఆపేలా కేఆర్‌ఎంబీ జారీ చేసిన ఆదేశాలను తక్షణమే అమలు చేసి రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం సాగు, చెన్నై తాగునీటి ప్రయోజనాలను కాపాడాల’’ని ఎంపీ అవినాష్‌ రెడ్డి కోరారు.

Also Read : అమాత్యుడి తల్లిదండ్రుల ఆదర్శం.. కొడుకు కేంద్రమంత్రి అయినా కూలి పనులతోనే జీవనం


అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోండి..

కృష్ణా నదిపై తెలంగాణ కడుతున్న అక్రమ ప్రాజెక్టులను తక్షణమే నిలిపివేసేలా చర్యలు చేపట్టాలని ఎంపీ అవినాష్‌ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ‘‘ కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), కేఆర్‌ఎంబీ నుంచి అనుమతులు తీసుకోకుండా, పర్యావరణ అనుమతులు లేకుండానే తెలంగాణ ప్రభుత్వం పాలమూరు – రంగారెడ్డి పేరుతో భారీ ఎత్తిపోతల పథకం చేపట్టింది. ఏడాదికి 90 టీఎంసీలు తరలించేలా శ్రీశైలం ప్రాజెక్టులో 800 అడుగుల నీటిమట్టం వద్దనే పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం చేపడుతోంది.

ఎడమగట్టున విద్యుత్‌ ఉత్పత్తి, పాలమూరు – రంగారెడ్డి, కల్వకుర్తి లిఫ్ట్, దిండి, ఎస్‌ఎల్‌బీసీ టెన్నల్‌ పథకాల ద్వారా రోజుకు 8 టీఎంసీల జలాలను తెలంగాణ ప్రభుత్వం తరలించబోతోంది. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తయితే.. ఎస్‌ఆర్‌బీసీ, తెలుగు గంగ, కేసీ కెనాల్, జీఎన్‌ఎస్‌ఎస్, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్, వెలుగుగొండ ఆయకట్టు ప్రమాదంలో పడుతుంది. చెన్నై నగర తాగునీటికి ఇబ్బందులు తలెత్తుతాయి. జీఎన్‌ఎస్‌ఎస్‌ (834 అడుగులు) మినహా శ్రీశైలంలో ఏపీ ఎత్తిపోతల పథకాలు అన్నీ కూడా 854 అడుగుల వద్ద ఉన్నాయి. ఏపీ సాగునీటి ప్రయోజనాలు, చెన్నై తాగు నీటి ప్రయోజనాలను కాపాడేలా పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని తక్షణమే నిలిపివేసేలా కేంద్రం పటిష్టమైన చర్యలు చేపట్టాల’’ని ఎంపీ అవినాష్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.

ఎంపీతో ఏకీభవించిన మంత్రి..

ఎంపీ అవినాష్‌ రెడ్డి వ్యక్తం చేసిన ఆందోళనతో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ ఏకీభవించారు. సాగు, తాగునీటికి అవసరమైన సమయంలోనే విద్యుత్‌ ఉత్పత్తి చేయాలని స్పష్టం చేశారు. కానీ తెలంగాణ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఏపీ ముఖ్యమంత్రి ప్రధానికి, కేఆర్‌ఎంబీకి లేఖలు రాశారని గుర్తు చేశారు. విద్యుత్‌ ఆపాలన్న కేఆర్‌ఎంబీ ఆదేశాలను తెలంగాణ పట్టించుకోలేదని, మరోసారి లేఖ రాసి.. విద్యుత్‌ ఉత్పత్తిని ఆపేలా చర్యలు చేపడతామని మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడేందుకు విభజన చట్టం ప్రకారం కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీలు ఏర్పాటయ్యాయని మంత్రి చెప్పారు. ఏడేళ్లుగా వాటి పరిధి నిర్ణయించలేదని, ఇటీవల పరిధిని నిర్ణయిస్తూ గెజిట్‌ జారీ చేశామని తెలిపారు. రెండు రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడేలా కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీలు పని చేస్తాయని మంత్రి స్పష్టం చేశారు

Also Read : పార్లమెంట్ ని తాకిన జలజగడం, వైఎస్సార్సీపీ ఎంపీల ఆందోళన సరైనదేనన్న కేంద్రం


idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp