అవి మార్ఫింగ్ ఫోటోలే..

By Sridhar Reddy Challa Jan. 18, 2020, 11:42 am IST
అవి మార్ఫింగ్ ఫోటోలే..

అమరావతి ప్రాంత రైతులపై పోలీసులు దౌర్జన్యం చేశారంటూ ఓ దినపత్రికలో వచ్చిన వార్తా కథనాన్ని, ఫొటోలను హైకోర్టు తనంతట తాను (సుమోటో) ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా(పిల్‌) పరిగణించిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యానికి సదరు పత్రికలో ప్రచురితమైన ఫొటోలను, ఇతర ఫొటోలను హైకోర్టు జత చేసింది. అలాగే అమరావతి ప్రాంతంలో 144 సెక్షన్‌ విధింపును సవాలు చేస్తూ పలువురు వేర్వేరుగా 8 పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషనర్ తరపు లాయర్లు కోర్టుకి సమర్పించిన ఫోటోలు ఆధారంగా గత వారం సుమోటోగా ఈ కేసుని స్వీకరించిన హైకోర్టు శుక్రవారం ఈ వ్యాజ్యాలపై జస్టిస్‌ శేషసాయి, జస్టిస్‌ మల్లవోలు సత్యనారాయణమూర్తిలతో నేతృత్వంలోని ప్రత్యేక ధర్మాసనం ప్రభుత్వాన్ని వివరణ కోరగా దానిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరామ్‌ ఓ ప్రాథమిక కౌంటర్‌ను ధర్మాసనం ముందుంచారు. నిరసనకారులను కొడుతున్నట్లున్న ప్రచురితమైన ఫొటోలు మార్ఫింగ్‌ చేసినవని ఆయన కోర్టుకి వివరించారు

రక్తం కారుతూ ఉన్న ఆ మహిళ ఫొటో బీహార్‌లోని భాగల్‌పూర్‌లో గతంలో జరిగిన ఓ ఘటనలో గాయపడ్డ మహిళ అని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. 2017లో ఘటనలకు సంబంధించి ఫేస్‌బుక్‌లో వచ్చిన ఫొటోలను ఇక్కడి అమరావతి ఆందోళనలతో ముడిపెట్టారని తెలిపారు. వాస్తవానికి అటువంటి ఘటనలేవీ ఇక్కడ జరగలేదన్నారు. మార్ఫింగ్‌ ఫొటోలను ప్రచురించడం కోర్టు విచారణ ప్రక్రియను దుర్వినియోగం చేయడమే అవుతుందన్నారు. కోర్టు సైతం ఆ ఫొటోల ఆధారంగా ఓ నిర్ణయానికి రాకూడదని, ఘటన పూర్తి క్రమాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అడ్వొకేట్‌ జనరల్‌ పేర్కొన్నారు.

కోర్టుకి చూపిన దానికి, క్షేత్రస్థాయిలో జరిగిన దానికీ చాలా తేడా ఉందని అడ్వకేట్ జనరల్ పేర్కొన్నారు. రాజధాని ప్రాంతంలో వాస్తవంగా జరిగిన ఘటన తాలూకు అసలు వీడియోలు తమ వద్ద సిద్ధంగా ఉన్నాయని, వాటిని కోర్టు ముందుంచుతామని తెలిపారు.దానిపై ధర్మాసనం స్పందిస్తూ నిరసనకారులు సైతం కొంత నిగ్రహం పాటించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది.

అంతేకాక రాజధానిలో 144 సెక్షన్‌ అమలు చేసే పరిస్థితులున్నాయా అని హైకోర్టు ప్రశ్నించడంపై వివరణ ఇచ్చిన అడ్వొకేట్‌ జనరల్‌ రాజధాని ప్రాంతంలో శాంతి భద్రతలు పర్యవేక్షణ కొరకు అప్పుడప్పుడు కొన్ని సమయాల్లో తప్ప 2014 నుంచి 144 సెక్షన్‌ అమలు చేస్తూనే ఉన్నామన్నారు. దానికి సంబంధించి గత ప్రభుత్వం విడుదల చేసిన జిఓ లను కోర్టుకి సమర్పించారు. రాజధానిలో నెలకొన్న వాస్తవ పరిస్థితులపై పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేస్తామని, తమకు తగిన వ్యవధినివ్వాలని హైకోర్టును శ్రీరామ్‌ కోరారు. దానిపై స్పందించిన హైకోర్టు తదుపరి విచారణను ఈనెల 20 కి వాయిదా వేసింది.

అమరావతి ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు న్యాయమూర్తులు జస్టిస్‌ ఆకుల వెంకట శేషసాయి, జస్టిస్‌ మల్లవోలు సత్యనారాయణమూర్తిలతో కూడిన ప్రత్యేక ధర్మాసనం నిర్ధిష్టమైన ఆదేశాలిచ్చింది. ఏ మహిళను కూడా సూర్యాస్తమయం తరువాత, సూర్యోదయానికి ముందు అరెస్ట్‌ చేయరాదని స్పష్టం చేసింది. ఒకవేళ ప్రత్యేక పరిస్థితుల్లో అరెస్ట్‌ చేయాల్సి వస్తే మేజిస్ట్రేట్‌ అనుమతి తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు హైకోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp