ప్రతీరోజు 25 వేలకు పైగా చిన్నారుల అశ్లీల చిత్రాలు భారత్ నుండే అప్లోడ్ - యూనిసెఫ్

By Kiran.G Aug. 04, 2020, 07:30 pm IST
ప్రతీరోజు 25 వేలకు పైగా చిన్నారుల అశ్లీల చిత్రాలు భారత్ నుండే అప్లోడ్ - యూనిసెఫ్

భారతదేశంలో చిన్నారులపై నేరాలు, హింస కేసులు పెరిగిపోతున్నాయని యూనిసెఫ్ నివేదిక ద్వారా వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా 12% చిన్నారుల అశ్లీల ఫోటోలు భారతదేశం నుండే అప్లోడ్ అవుతున్నాయని యూనిసెఫ్ తెలిపింది.

యూనిసెఫ్ వెల్లడించిన విషయాలు

భారతదేశంలో చిన్నారులపై జరిగే నేరాల నిర్మూలన అంశంపై యూనిసెఫ్ దేశంలో చేసిన అధ్యయనానికి సంబంధించిన నివేదికను తాజాగా విడుదల చేసింది. ఈ నివేదికలో పలు షాకింగ్ విషయాలను యూనిసెఫ్ వెల్లడించింది.

చిన్నారుల అశ్లీల ఫోటోల్లో 12% భారతదేశం నుండి ఇంటర్నెట్ లో అప్లోడ్ అవుతున్నాయి. ప్రతిరోజు 25 వేలకు పైగా చిన్నారుల అశ్లీల చిత్రాలు అప్లోడ్ అవుతున్నాయని అందులో 80% ఫోటోలు బాలికలకు చెందినవని యూనిసెఫ్ తెలిపింది. 18 ఏళ్లలోపు బాలికలపై లైంగిక వేధింపులు ఎక్కువగా జరుగుతున్నాయని, బాధితుల్లో 12-18 ఏళ్ల వయసున్న వారు 86.79 శాతం ఉన్నారని వెల్లడించింది.

లైంగిక వేధింపులతో పాటు హింసకు గురయ్యే బాలురలో 92.58 శాతం బాధితులు 0-16 ఏళ్ల మధ్య ఉన్నవారే ఉన్నారు. చిన్నారులపై లైంగిక వేధింపులు చేస్తున్న వారిలో బాధితులకు తెలిసిన వారే ఎక్కువగా ఉండటం గమనించాల్సిన విషయం.. దాదాపు 94.6% మంది తమకి తెలిసిన చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని యూనిసెఫ్ నివేదికలో తెలిపింది. కాగా 2-17 ఏళ్లలోపు ప్రతి ఇద్దరు చిన్నారుల్లో ఒకరు ప్రతీ ఏడాది ఏదొకవిధంగా హింసకు గురవుతున్నారని నివేదికలో తెలిపింది.

చిన్నారుల రక్షణ విషయంలో భారత్ కు యూనిసెఫ్ సూచనలు

భారత్ లో పోక్సో చట్టం కింద నమోదయైన కేసుల్లో పెండింగ్ కేసులు ఎక్కువగా ఉన్నాయని యూనిసెఫ్ వెల్లడించింది.. కాగా గతంతో పోలిస్తే ఇండియాలో పోక్సో చట్టం కింద నమోదైన కేసుల్లో శిక్షల శాతం స్వల్పంగా పెరిగాయని పేర్కొంది.చిన్నారులపై నేరాలను అరికట్టేందుకు మరిన్ని కఠిన చట్టాలు తీసుకురావాలని యూనిసెఫ్ భారత్ కు సూచించింది.

హింసకు గురైన చిన్నారులు మానసికంగా కోలుకునేందుకు సాయం చేయడంతో పాటు బాధితులకు తక్షణమే న్యాయ సాయం మరియు పరిహారం వెంటనే అందేలా ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందని సూచించింది. పోక్సో, బాలల న్యాయ, విద్యాహక్కు చట్టాలను సమర్థంగా అమలు చేసేందుకు సంబంధిత సిబ్బందికి శిక్షణ ఇవ్వడంతో పాటు సంబంధిత విభాగాలకు అవసరమైన నిధులు విడుదల చేయాలని యునిసెఫ్ పేర్కొంది.

అత్యవసర సేవల నంబర్ల వినియోగంపై విస్తృత ప్రచారం నిర్వహించడంతో పాటు వాటిని అందరికీ అందుబాటులో ఉంచాలని చిన్నారి బాధితులను తక్షణమే గుర్తించి వారికి సత్వరం న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలు అధికారులు తీసుకోవాలని యూనిసెఫ్ నివేదికలో తెలిపింది..

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp