ప్రపంచానికి మనమే దారి చూపిస్తాం..అఖండ భారత్ సాధ్యమే

By Raju VS Feb. 26, 2021, 03:06 pm IST
ప్రపంచానికి మనమే దారి చూపిస్తాం..అఖండ భారత్ సాధ్యమే

హిందూ సమాజం ఎంతో ధర్మబద్ధంగా జీవనం సాగిస్తుందని ఆర్ఎస్ఎస్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు. దాని మూలంగానే ప్రపంచానికి దారి చూపిస్తుందని అభిప్రాయపడ్డారు ప్రపంచాన్ని అనేక విపత్తుల నుంచి గట్టెక్కించే సామర్థ్యం భారతదేశానికే ఉందని, దానిని అన్ని దేశాలు గుర్తిస్తున్నాయని తెలిపారు. హైదరాబాద్ హైటెక్స్‌లో ద్విస‌హ‌స్రావ‌ధాని మాడుగుల నాగ‌ఫ‌ణిశ‌ర్మ ర‌చించిన విశ్వ‌భార‌తం గ్రంథ ఆవిష్క‌ర‌ణ సభకి ముఖ్య అతిథిగా హాజరయిన మోహన్ భాగవత్ ఈ వ్యాఖ్యలు చేశారు.

భారతదేశం నుంచి విడిపోయిన పాకిస్తాన్, అప్ఘానిస్తాన్ నేటికీ అశాంతి, అలజడితో కొనసాగుతున్నాయన్నారు. అలాంటి వాటికి మన దేశమే మార్గనిర్దేశం చేసే రోజు వస్తుందన్నారు. దేశం నుంచి విడిపోయిన భూభాగాలన్నీ మళ్లీ భారతదేశంలో వచ్చి కలిసే అవకాశం ఉందని ధీమా వ్యక్తం చేశారు. అఖండ భారత్ నినాదం మాత్రమే కాదని, అది ఆచరణలోకి రాబోతోందని మోహన్ భగవత్ అన్నారు

ద్వి స‌హ‌స్రావ‌ధాని మాడుగుల నాగ‌ఫ‌ణిశ‌ర్మ మాట్లాడుతూ ఈ భూమండలమంతా ఒకప్పుడు భారత ధర్మమే విస్తరించి ఉండేదన్నారు. అత్యున్నతమైన మన హిందూ ధర్మాన్ని కాపాడవలసిన బాధ్యత అందరి భుజస్కందాలపైనా ఉందని పేర్కొన్నారు. .

అనంతరం మోహన్ భాగవత్ చేతుల మీదుగా పుస్తకావిష్కరణ జరిగింది. కార్యక్రమంలో సంస్కృత విశ్వవిద్యాల‌యం మాజీ డీన్ రాణీ స‌దాశివ మూర్తి, ప‌ద్మ‌శ్రీ ర‌మాకాంత్ శుక్లా కూడా పాల్గొన్నారు. . ఆర్.ఎస్.ఎస్ నాయ‌కులు శ్యామ్ కుమార్, అఖిలభారతీయ ధర్మజాగరణ సమన్వయ సహసంయోజక్ దూసి రామకృష్ణ, దక్షిణ మధ్య క్షేత్ర సహ సంఘచాలక్ సురేందర్ రెడ్డి, తెలంగాణ ప్రాంత సంఘచాలక్ సుధీరా, దక్షిణమధ్య క్షేత్ర ప్రచారక్ కాచం రమేష్, తెలంగాణ ప్రాంత కార్యవహ దేవేందర్, తెలంగాణ ప్రాంత ప్రచారక్, అన్న‌దానం సుబ్ర‌హ్మ‌ణ్యం, ఇత‌ర ప్రముఖులు ఆత్మీయ అతిథులుగా పాల్గొన్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp