BJP,Modi - మోడీ వ్యాఖ్య‌ల్లో అర్థం ఏంటి..? వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏం జ‌ర‌గ‌బోతోంది?

By Kalyan.S Dec. 01, 2021, 09:00 pm IST
BJP,Modi - మోడీ వ్యాఖ్య‌ల్లో అర్థం ఏంటి..? వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏం జ‌ర‌గ‌బోతోంది?

ఎవ‌రేం విమ‌ర్శించినా, ప్ర‌చారాలు ఎలాగున్నా భార‌తీయ జ‌న‌తా పార్టీ నేత‌గా న‌రేంద్ర మోడీకి మించిన ఆక‌ర్ష‌ణ ఎవ‌రికీ లేద‌నేది వాస్త‌వం. గ‌త రెండు ప‌ర్యాయాలు బీజేపీ ప్ర‌భుత్వం బంప‌ర్ మెజార్టీతో అధికారంలోకి వ‌చ్చిందంటే అందులో కీల‌క పాత్ర మోడీదే. అయితే క‌రోనా అనంత‌రం మోడీ ప్రాభ‌వం త‌గ్గుతోంద‌నే చ‌ర్చ‌లు అడ‌పాద‌డ‌పా న‌డుస్తున్నాయి. మోడీ గ్రాఫ్ త‌గ్గిందంటూ కొన్ని స‌ర్వేలు కూడా తెలియ‌జేస్తున్నాయి. గుజ‌రాత్ కు మాత్ర‌మే ప‌రిమిత‌మైన ఆయ‌న ఏడేళ్లుగా దేశంలోనే ప్ర‌ముఖ నేత‌గా గుర్తింపు పొందారు. కానీ కేంద్రం తీసుకున్న కొన్ని ప్ర‌జా వ్య‌తిరేక విధానాల కార‌ణంగా మోడీ పై విశ్వ‌స‌నీయ‌త త‌గ్గుతోంద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీకి అంత మెజార్టీ రాక‌పోవ‌చ్చ‌ని , ఇత‌ర ప‌క్షాల భాగ‌స్వామ్యంతో అధికారంలోకి వ‌స్తే.. ప్ర‌ధాని అభ్య‌ర్థి మార‌తార‌నే ఊహాగానాలు కూడా వెలువ‌డుతున్నాయి.

కరోనా వేళ ఉన్న చిన్నా చితకా ఉద్యోగాలు కూడా లేకుండా పోయాయి. ఇది చాలదన్నట్లుగా భారాలు మోపి వారి నడ్డి విరగొట్టారు. పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధ‌ర‌లు బెంబేలెత్తిస్తున్నాయి. వీటికి తోడు సాగు చట్టాల మీద రైతుల ఆందోళన ఏడాది పాటు సాగితే వాటిని ఎట్టకేలకు రద్దు చేసుకున్నారు. అయినా ఆ వర్గాలు ఈసారి బీజేపీ వైపు చూస్తాయన్న నమ్మకం అయితే లేదు. ఇక బంగారం లాంటి ప్రభుత్వ రంగ సంస్థలను ఒక పాలసీ పెట్టుకుని మరీ ప్రైవేట్ పరం చేయడం ద్వారా కార్మిక వర్గానికి కూడా మోడీ సర్కార్ కన్నెర్ర అయింది. ఈ క్రమంలో 2024 ఎన్నికలు కచ్చితంగా బీజేపీకి మోడీకి పెను సవాల్ కానున్నాయి అని అంటున్నారు. మరి ఈ సంగతి తెలిసే అన్నారో లేక యాధృచ్చికంగా మాట్లాడారో కానీ తనకు అధికారం మీద పదవుల మీద వ్యామోహం లేదని మోడీ రీసెంట్ గా సంచలన కామెంట్స్ చేశారు.

రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవంలో భాగంగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు వైర‌ల్ అవుతున్నాయి. మోడీ మాట్లాడుతూ తానే ఎల్లకాలం అధికారంలో ఉండిపోవాలన్న ఆశలు లేనే లేవని పేర్కొన్నారు. రాజ‌కీయ నీతిజ్ఞుడైన  మోడీ ఈ వ్యాఖ్య‌లు ఇప్పుడు చేయ‌డానికి గ‌ల కార‌ణాలేంటనేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. 2024 ఎన్నికల్లో బీజేపీకి ఫుల్ మెజారిటీ రాదని ఇప్పుడు ప్ర‌చారం జ‌రుగుతున్నా అదే నిజ‌మ‌ని చెప్ప‌లేం. ఎందుకంటే గ‌త ఎన్నిక‌ల‌కు ముందు అయితే అస‌లు బీజేపీ అధికారంలోకి రాద‌ని అన్నారు. 2014 కంటే బంప‌ర్ మెజార్టీతో అధికారంలోకి వ‌చ్చింది. అలా అని అన్ని సార్లూ జ‌రుగుతుంద‌ని కూడా చెప్ప‌లేం.

రెండొంద‌ల సీట్ల మార్కుని బీజేపీ దాటితే అదే పెద్ద విజయం అని కూడా భావించే వారు కమలం పార్టీలోనే ఎక్కువగా ఉన్నారు. మరి ఆ పరిస్థితి వస్తే మోడీని ప్రధాని అభ్యర్ధిగా చేసేందుకు బీజేపీలో ఎవరు ఒప్పుకుంటారు అన్న ప్రశ్నలు కూడా వస్తాయి. మిత్ర పక్షాలు ఇతర రాజకీయ పార్టీల మద్దతు బీజేపీకి అవసరమైతే మోడీ కి ప్రధాని పదవి అనుమాన‌మే అన్న చర్చ కూడా ఉంది. అయితే ఒక్క మాట మాత్రం అంతా ఒప్పుకోవాలి. మోడీకి ఉన్నంత చ‌రిష్మా బీజేపీలో ఎవ‌రికీ లేదు. ఆయ‌న ఓట‌మి ఎరుగ‌ని వ్య‌క్తి. ముచ్చటగా మూడో సారి ఆయ‌నే ప్ర‌ధాని అయినా ఆశ్చ‌ర్యం లేదు.

Also Read : Central Government - రామాయపట్నానికి రాం రాం అంటున్న కేంద్రం

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp