బీహార్ ఎన్నికలు: తేజస్వీపై మోడీ మాటల దాడి

By Srinivas Racharla Oct. 28, 2020, 09:17 pm IST
బీహార్ ఎన్నికలు: తేజస్వీపై మోడీ మాటల దాడి

బీహార్ రెండో దశ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ మహాఘట్ బంధన్‌ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్‌పై ఘాటైన పదజాలంతో విరుచుకుపడ్డాడు. మొన్న లాలూ కుటుంబంపై సీఎం నితీశ్ కుమార్ వ్యక్తిగత దూషణలకు పాల్పడగా,నేడు ప్రధాని మోడీ ఆర్జేడీ నేత తేజస్వీని టార్గెట్‌గా విమర్శల పర్వం కొనసాగించడంతో పాటలీపుత్ర రాజకీయం వేడెక్కింది.

ఇవాళ బీహార్ రాజధాని పాట్నాలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఆ సభలో మోడీ ప్రసంగిస్తూ "జంగిల్‌ రాజ్‌ యొక్క యువరాజు" గురించి జాగ్రత్తగా ఉండాలని పరోక్షంగా తేజస్వీ యాదవ్‌పై పరుష పదజాలంతో దాడి చేశారు. అలాగే వారి కుటుంబానికి కిడ్నాప్‌లలో కాపీరైట్లు ఉన్నాయంటూ ప్రధాని వ్యక్తిగత దూషణలకు పాల్పడటం ఆశ్చర్యం కలిగిస్తుంది. తమ పార్టీ అధికారంలోకి వస్తే 10 లక్షల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని ఆర్జేడీ ఇచ్చిన ఆకర్షణీయమైన ఎన్నికల హామీని కూడా ఆయన తప్పు పట్టారు.ఇక ప్రభుత్వ రంగంలో ఉద్యోగాల గురించి మరచిపోండి. ప్రతిపక్ష మహా కూటమి అధికారంలోకి వస్తే ఉద్యోగాలు ఇచ్చే ప్రైవేట్ కంపెనీలు తమ కార్యాలయాలను మూసివేసి పారిపోతాయి అని ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. యధావిధిగా రాష్ట్రాన్ని ఆటవిక రాజ్యంగా మార్చిన వారిని, దోపిడీకి పాల్పడిన వారిని మళ్లీ ఓడించాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు.

దర్భంగాలో జరిగిన మరో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ప్రధాని మోడీ మాట్లాడుతూ బీహార్‌లో ఎన్డీయే ప్రభుత్వం వచ్చాకే శాంతి మరియు అభివృద్ధి సాధ్యపడిందని పేర్కొనడం గమనార్హం. నితీశ్ కుమార్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కృషి చేసిందంటూ ప్రధాని ప్రశంసించారు. బీహారీల ఆశలను, ఆశయాలను నెరవేర్చేది ఎన్డీయే ప్రభుత్వం మాత్రమే అని ఆయన స్పష్టం చేశారు. ఇక రామ మందిర నిర్మాణం పట్ల ప్రజలు మాకు అభినందనలు తెలుపుతున్నారని ప్రజలలో భావోద్రేకాలు కలిగించేందుకు ప్రధాని ప్రయత్నించారు. మేం చెప్పింది చేస్తామనే దానికి ఇదే నిదర్శనమని చెప్పడం విశేషం. అందుకే తర్వాత ఏర్పడే ప్రభుత్వం ఏం చేస్తుందనే దాని కోసం మొదటిసారి ప్రజలు మేనిఫెస్టోను పరిశీలిస్తున్నారు. రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలకు ఆహార ధాన్యాలు అందించి సహకరించిందని, ఇళ్లకు సురక్షితమైన తాగునీరు అందించిందని ఆయన తెలిపారు. అలాగే దర్భంగా సమీపంలో విమానాశ్రయం ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని హామీ ఇచ్చారు.

ఇక ప్రధాని మోడీ ప్రసంగంలో మరోసారి బీహార్‌లో ఆర్జేడీ పాలనలో నేరాల రేటు తీవ్రంగా ఉండేదని విమర్శలు గుప్పించారు. 'జంగిల్ రాజ్' తిరిగి రావడం వలన కోవిడ్ -19 మహమ్మారి నేపథ్యంలో రాష్ట్రానికి రెండు ప్రమాదాలను కొనితెచ్చుకున్నట్లేనని బీహారీలను మోడీ హెచ్చరించారు. జంగిల్ రాజ్ యువరాజ్ నుండి ఏదైనా ఆశించవచ్చా? నాకన్నా మీకు బాగా తెలిసిన ఆయన కుటుంబం ట్రాక్ రికార్డ్ ఆధారంగా అతనిని అంచనా వేయాలని ఆయన కోరారు. అలాగే రాష్ట్రంలో మహాఘట్ బంధన్‌ను గెలిపిస్తే మళ్లీ ఆనాటి 'జంగిల్ రాజ్' పాలన వస్తుంది. కాబట్టి ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలను బీహార్‌ని చీకటి నుండి బయటకు తీసిన వారిని తిరిగి ఎన్నుకునే అవకాశంగా చూడాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు.

కాగా బీహారీలలో తేజస్వీ యాదవ్‌ పట్ల పెరుగుతున్న ఆదరణ వల్లనే అసహనంతో ప్రధాని మోడీతో సహా ఎన్డీయే నేతలు ఆయనపై వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నట్లు అర్థమౌవుతోంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp