కొయ్యే మోషేన్‌రాజు.. కౌన్సిలర్‌ నుంచి ఎమ్మెల్సీ వరకూ

By Karthik P Jun. 15, 2021, 12:45 pm IST
కొయ్యే మోషేన్‌రాజు.. కౌన్సిలర్‌ నుంచి ఎమ్మెల్సీ వరకూ

రాజకీయ కుటుంబ నేపథ్యం లేకపోయినా.. పార్టీని నమ్ముకుని, నిబద్ధతతో పని చేస్తే.. సామాన్యులైనా రాజకీయాల్లో రాణించవచ్చనేందుకు తాజాగా ఎమ్మెల్సీగా ఎన్నికైన వైసీపీ నేత కొయ్యే మోషేన్‌రాజు ఓ నిదర్శం. కాంగ్రెస్‌ పార్టీ నుంచి రాజకీయ జీవితం ప్రారంభించిన కొయ్యే మోషేన్‌రాజు.. ఆ పార్టీలో భీమవరం టౌన్‌ యూత్‌ కాంగ్రెస్‌ నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. 1987లో తొలిసారి భీమవరం మున్సిపల్‌ కౌన్సిలర్‌గా కాంగ్రెస్‌పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. మొత్తం నాలుగు సార్లు కౌన్సిలర్‌గా ఆయన పని చేశారు. భీమవరం పురపాలక సంఘం ప్రతిపక్ష పార్టీ ఫ్లోర్‌లీడర్‌గా సేవలందించారు.

కాంగ్రెస్‌ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగిన మోషేన్‌రాజు.. నాటి ఉప ముఖ్యమంత్రి కోనేరు రంగారావు కలసి పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డికి దగ్గరయ్యారు. ఈ క్రమంలోనే ఆయనకు జిల్లా కాంగ్రెస్‌ పార్టీ «అధ్యక్ష పదవి దక్కింది. ఆచంట ఎస్సీ రిజర్డ్వ్‌ నియోజవర్గంగా ఉన్నప్పుడు.. అక్కడ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపారు. కానీ అవకాశం దక్కలేదు. పార్టీలో క్రమశిక్షణగల నేతగా ఉన్న మోషేన్‌ రాజును వైఎస్‌ రాజశేఖరరెడ్డి గుర్తించారు. 2009లో కొవ్వూరు నుంచి పోటీ చేసే అవకాశం కల్పించారు. త్రిముఖ పోరులో మోషేన్‌ రాజు ఓటమి చవిచూశారు.

Also Read : నలుగురు ఎమ్మెల్సీలకు గవర్నర్‌ ఆమోదం

వైఎస్‌ తర్వాత.. ఆయన కుమారుడు వైఎస్‌ జగన్‌ వెంట మోషేన్‌ రాజు నడిచారు. 2010లో వైఎస్‌ జగన్‌ కాంగ్రెస్‌ పార్టీని వీడిన వెంటనే.. మోషేన్‌ రాజు పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నారు. వైఎస్‌ జగన్‌కు సంఘీభావం ప్రకటించి.. ఆయన వెంట నడిచారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మోషేన్‌ రాజు.. పార్టీ అప్పగించిన అన్ని బాధ్యతలు నిబద్ధతతో నిర్వర్తించారు. వైసీపీలో రాష్ట్ర కార్యదర్శిగా మొదలైన మోషేన్‌రాజు ప్రస్తానం.. ఆ తర్వాత కేంద్ర పాలక మండలి సభ్యుడిగా, రాజమహేంద్రవరం పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతోంది.

పశ్చిమగోదావరి జిల్లాలో మూడు, తూర్పుగోదావరి జిల్లాలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలతో ఉన్న రాజమహేంద్రవరం పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడిగా మోషేన్‌రాజు క్రియాశీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా రాజమహేంద్రవరం కేంద్రంగా సిటీ, రూరల్, రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గాల రాజకీయం సాగేది. ఈ క్రమంలో వైసీపీలో పలు గ్రూపులు నడిచాయి. ఆయా గ్రూపులను సమన్వయం చేసుకుంటూ.. పార్టీని ముందుకు నడిపించడంలో మోషేన్‌ రాజు విజయవంతం అయ్యారు. నియోజకవర్గ కో ఆర్డినేటర్ల చేత పార్టీ కార్యక్రమాలు చేయించడంలో మోషేన్‌రాజుది అందవేసిన చేయి.

2019లో పోటీ చేసే అవకాశం రాకపోయినా.. అధిష్టానానికి విధేయుడుగా ఉంటూ.. పార్టీ విజయానికి కృషి చేశారు. అప్పటి నుంచే కొయ్యే మోషేన్‌రాజుకు ఎమ్మెల్సీ పదవి వస్తుందనే ప్రచారం సాగింది. ఎమ్మెల్సీ పదవులు భర్తీ జరిగిన ప్రతి సమయంలోనూ.. మోషేన్‌ రాజు పేరు వార్తల్లో నిలిచేదంటే ఆయనకు పార్టీలో ఉన్న ప్రాధాన్యత ఏమిటో ఇట్టే అర్థమవుతుంది. పలు పర్యాయాలు అవకాశం వచ్చి చేజారినా.. ఈ సారి ఎమ్మెల్సీ పదవి మోషేన్‌ రాజును వరించడంతో చట్టసభల్లో అడుగుపెట్టాలన్న ఆయన ఆశ ఫలించింది.

Also Read : తోట త్రిమూర్తులు..ఒక పదవి... రెండు నియోజకవర్గాల్లో ఆనందం!

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp