ఇక అందరి దృష్టి ఆ టీడీపీ ప్రజా ప్రతినిధిపైనే..!

By Kotireddy Palukuri Oct. 29, 2020, 08:30 am IST
ఇక అందరి దృష్టి ఆ టీడీపీ ప్రజా ప్రతినిధిపైనే..!

దాదాపు పది నెలలుగా సాగుతున్న సస్పెన్స్‌కు టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత తెర దించారు. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. మూడు రాజధానులకు సంబంధించి ఈ ఏడాది జనవరిలో శాసన మండలిలో జరిగిన ఓటింగ్‌లో టీడీపీ విప్‌ను ధిక్కరించిన పోతుల సునీత వైసీపీకి ఓటు వేశారు. సునీతతోపాటు మరో టీడీపీ ఎమ్మెల్సీ చదిపిరాళ్ల శివానాథ్‌ రెడ్డి కూడా విప్‌ ధిక్కరించారు. దాంతో వారిద్దరిపై అనర్హత వేటు వేయాలంటూ టీడీపీ శాసన మండలి చైర్మన్‌కు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై మండలి చైర్మన్‌ విచారణ జరుపుతున్న తరుణంలోనే పోతుల సునీత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

సునీత రాజీనామాతో ఇప్పుడు అందరి దృష్టి శివనాథ్‌ రెడ్డిపై పడింది. సునీత మాదిరిగానే శివనాథ్‌ రెడ్డి కూడా రాజీనామా చేస్తారా..? లేక విచారణను ఎదుర్కొంటారా..? అనే అంశంపై చర్చ సాగుతోంది. టీడీపీ తరఫున ఎమ్మెల్యేల కోటాలో పోతుల సునీత ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆమె ఆరేళ్ల పదవీ కాలం 2023 మార్చి వరకూ ఉంది. దాదాపు రెండున్నరేళ్ల పదవీ కాలం ఉండగానే సునీత తన పదవిని వదులుకుంది. గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ పదవి పొందిన చదిపిరాళ్ల శివనాథ్‌రెడ్డి పదవికాలం 2023 జూలై వరకూ ఉంది. దాదాపు మూడేళ్ల పదవికాలం ఉన్న శివనాథ్‌ రెడ్డి రాజకీయంగా ఎలాంటి స్టెప్‌ వేయబోతున్నారనేదే ప్రస్తుతం ఆసక్తికర అంశం.

ఆ ఇద్దరి సరసన సునీత..

ఇతర పార్టీల తరఫున ఎన్నికైన ప్రజా ప్రతినిధులు తమ పార్టీలోకి రావాలంటే.. పదవికి రాజీనామా చేసిన తర్వాతే రావాలని, అలా అయితేనే చేర్చుకుంటామని సీఎం జగన్‌ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఓ విధానం ప్రకటించారు. నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా.. నేడు అధికారంలో ఉన్నప్పుడైనా సీఎం జగన్‌ తాను చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నారు.

టీడీపీ ప్రభుత్వ హాయంలో జరిగిన నంధ్యాల ఉప ఎన్నికల్లో శిల్పా సోదరులు టీడీపీని వీడి వైసీపీలో చేరారు. శిల్పా మోహన్‌ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయన సోదరుడు శిల్ఫా చక్రపాణి రెడ్డి అప్పటికి కేవలం మూడు నెలల ముందే టీడీపీ తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అయితే వైసీపీలో చేరుతున్న సందర్భంగా ఇంకా ఐదేళ్ల 9 నెలల పాటు ఉన్న ఎమ్మెల్సీ పదవిని తృణప్రాయంగా భావించిన శిల్పా.. రాజీనామా చేసి జగన్‌ విధానానికి ౖజñ కొట్టారు. భారీ బహిరంగ సభలో ప్రజల సాక్షితా చక్రపాణి రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో శ్రీశైలం నుంచి ఎమ్మెల్యేగా వైసీపీ తరఫున గెలిచారు.

డొక్కా మాణిక్య వరప్రసాద్‌ రావు కూడా టీడీపీలో ఉండగా వచ్చిన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే వైసీపీలో అధికారికంగా చేరారు. ఆ తర్వాత వైసీపీ తరఫున శాసన మండలికి వెళ్లారు. ఇప్పుడు పోతుల సునీత కూడా వారి సరసన చేరబోతున్నారు. పదవికి రాజీనామా చేసి టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన నేతల్లో పోతుల సునీత మూడో ప్రజా ప్రతినిధిగా నిలిచారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp