పారిశుద్ధ్య కార్మికుల కాళ్ళుకడిగి కృతజ్ఞతలు తెలియజేసిన వైకాపా ఎమ్మెల్యే

By iDream Post Apr. 06, 2020, 10:08 am IST
పారిశుద్ధ్య కార్మికుల కాళ్ళుకడిగి  కృతజ్ఞతలు తెలియజేసిన వైకాపా ఎమ్మెల్యే
చిత్తూరు జిల్లాలో మొదటి కరోనా పాజిటివ్ కేసు శ్రీకాళహస్తిలో నమోదయింది.ఆ రోజు నుంచి నేటి వరకు శ్రీకాళహస్తి పట్టణంలో క్రిమిసంహారక మందులను నిరంతరం చల్లుతూ కోవిడ్‌-19 వ్యాప్తిని అరికట్టడానికి పారిశుద్ధ కార్మికులు రేయింబవళ్ళు శ్రమించారు. కరోనా కట్టడికి అహర్నిశలు శ్రమిస్తున్న పారిశుద్ధ కార్మికులకు అధికార వైయస్సార్ సిపి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి వినూత్నంగా కృతజ్ఞతలు తెలియజేశారు.శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బి.మధుసూదన్ రెడ్డి పారిశుద్ధ కార్మికుల సేవలను లాగిస్తూ వారి పాదాలను కడిగి పూలతో అభిషేకించారు. అనంతరం వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ శాలువాలతో ఘనంగా సన్మానించారు.

కరోనా నియంత్రణకు ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ వేళ ప్రజలంతా ఇళ్లకే పరిమితం కాగా పారిశుద్ధ కార్మికులు మాత్రం పరిశుభ్రత కోసం నిరంతరం శ్రమిస్తున్నారని వారి సేవలను కొనియాడారు.ఇంకా ఎమ్మెల్యే మాట్లాడుతూ మన అందరి భవిష్యత్తు కోసం శ్రీకాళహస్తిలో పరిశుభ్రత వాతావరణం తీసుకురావడం కోసం క్రిమిసంహారక మందులను చల్లుతూ నిరంతరం శ్రమిస్తున్న నాతోటి కుటుంబ సభ్యులైన పారిశుద్ధ్య కార్మికులకు కృతజ్ఞతలు తెలుపుతూ వారికి పాదపూజ చేసినట్లు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లో వైకాపా ప్రభుత్వం మార్చి నెల వేతనం రెండు విడతలుగా సగం చొప్పున ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లిస్తున్న సంగతి తెలిసిందే. అయితే విపత్కర పరిస్థితిలో కరోనా వ్యాప్తి నిరోధానికి శ్రమిస్తున్న వైద్యులు, పోలీసులు,పారిశుద్ధ్య కార్మికులకు మాత్రం పూర్తి జీతమును ఒక్క విడతలోనే జగన్ ప్రభుత్వం చెల్లిస్తుంది.
idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp