కాంగ్రెస్ పార్టీలో స్ఫూర్తి రగిలిస్తున్న జగ్గారెడ్డి.. కానీ..?

By Ritwika Ram Aug. 28, 2021, 01:45 pm IST
కాంగ్రెస్ పార్టీలో స్ఫూర్తి రగిలిస్తున్న జగ్గారెడ్డి.. కానీ..?

పార్టీ గుర్తుతోనో, పార్టీ అధినేత ఫొటోతో గెలిచామా.. ఐదేళ్లు ఎమ్మెల్యేగానో, ఎంపీగానో ఉన్నామా అన్నట్లు ఉంటుంది కొందరు లీడర్ల వ్యవహారం. పార్టీకి ఉన్న ఆదరణతోనో, అధినేతకు ఉన్న మాస్ ఫాలోయింగ్ తోనో గెలుస్తుంటారు. తర్వాత మాత్రం రాజకీయాల్లో ఉంటున్నా.. ఓటమికి కేరాఫ్ అడ్రస్ గా ఉంటుంటారు. లేదా పాలిటిక్స్ నుంచే కనుమరుగు అవుతుంటారు. అతి తక్కువ మంది మాత్రమే నియోజకవర్గంలో ప్రజా సమస్యల కోసం పని చేస్తుంటారు. జనంలో ఎన్నటికీ తరిగిపోని గ్రిప్ ను నిలబెట్టుకుంటారు. వరుస ఎన్నికల్లో గెలుస్తుంటారు.. సుదీర్ఘ కాలంపాటు రాజకీయాల్లో కొనసాగుతుంటారు. ఒకప్పుడు ఇలాంటి లీడర్లు ఉండేవాళ్లేమో కానీ.. ఇప్పుడు చాలా తక్కువ. ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి.. ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి మారడమే ఇప్పుడున్న రాజకీయం. గతంలో ఒకరిద్దరు నేతలు రెండు రోజుల్లో మూడు పార్టీలు మారి రికార్డులూ నెలకొల్పారు. కానీ తాజాగా సంగారెడ్డి ఎమ్మెల్యే, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కొత్త రాజకీయానికి తెరలేపారు. ఒక్క కాంగ్రెస్ మాత్రమే కాదు.. అన్ని పార్టీలు పాటించాల్సిన విషయాన్ని తెలియజేశారు.

నెల రోజుల టైం టేబుల్ వేసుకున్న జగ్గారెడ్డి

పార్టీ, నియోజకవర్గానికి కేటాయించుకోవాల్సిన సమయం విషయంలో పని విభజన చేసుకున్నారు జగ్గారెడ్డి. ఒక నెలలో ఎన్నిరోజులు, ఎప్పుడు, ఎక్కడికి వెళ్లాలి.. ఎన్ని రోజులు ఏ విషయానికి కేటాయించాలి అనే టైమ్‌ టైబుల్‌ ఫిక్స్‌ చేసుకున్నారు. అలాగే తాను చేస్తున్న, చేయాల్సిన పనుల గురించి తమ పార్టీ నేతలకు లెటర్లు రాశారు. ఎమ్మెల్యేగా ప్రతి నెల 20 రోజులు సంగారెడ్డి నియోజకవర్గానికి కేటాయిస్తానని లెటర్లలో వివరించారు. ఇందులో 6 రోజులు రెండు మున్సిపాలిటీ వార్డుల్లో నిరంతర కార్యక్రమాలు, సమస్యలపై ప్రజలతో చర్చించడం, వారు చెప్పిన వాటికి పరిష్కార మార్గాలు వెతకడం, ప్రజలతో కలవడం చేస్తారట. మిగతా 10 రోజులు పార్టీకి కేటాయిస్తారట. ఈ 10 రోజుల్లో నాలుగు రోజులు తాను పార్టీ ఇన్ చార్జ్ గా ఉన్న.. ఖమ్మం, భువనగిరి, కరీంనగర్, వరంగల్ లోక్ సభ నియోజకవర్గాలకు కేటాయిస్తారట. పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు అక్కడి నేతలతో సమావేశాలు నిర్వహిస్తారట.

ఇలా ప్రతి నెలలో తాను చేసే కార్యక్రమాల గురించి వివరించుకుంటూ పోయారు జగ్గారెడ్డి. నియోజకవర్గాలను గాలికి వదిలేసి, హైదరాబాద్ లో తిష్టవేసే నాయకులు జగ్గారెడ్డి విషయంలో స్ఫూర్తి తెచ్చుకోవాలన్న వాదనలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలోని నేతలంతా జగ్గారెడ్డిలా ప్లాన్ వేసి, ప్రజల్లో ఉంటే వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపు ఖాయమనే కామెంట్లు వస్తున్నాయి.

Also Read : కోమ‌టిరెడ్డి `దళిత సీఎం` వ్యాఖ్య‌లు దేనికి సంకేతం?

ప్లాన్ బాగుంది.. కానీ..

జగ్గారెడ్డిగా పాపులర్ అయిన తూర్పు జయ ప్రకాశ్ రెడ్డి.. బీజేపీ కౌన్సిలర్ గా తన రాజకీయ జీవితం ప్రారంభించారు. తర్వాత సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్ అయ్యారు. 2004లో టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కొన్నాళ్లకే కాంగ్రెస్ లో చేరి.. 2009లో అదే పార్టీ నుంచి గెలిచారు. 2014లో ఓడిపోయినా.. 2018లో టీఆర్ఎస్ హవాలోనూ సంగారెడ్డి నుంచి విజయం సాధించారు. అయితే 2014లో గజ్వేల్ అసెంబ్లీ, మెదక్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కేసీఆర్.. ముఖ్యమంత్రి అయ్యాక మెదక్ సీటుకు రాజీనామా చేశారు. ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు జగ్గారెడ్డి. టీఆర్ఎస్ హవా ముందు చిత్తుగా ఓడిపోయారు. మళ్లీ కొన్నాళ్లకు తిరిగి కాంగ్రెస్ గూటికే చేరారు.

పీసీసీ చీఫ్ పదవిని ఆశించిన వారిలో జగ్గారెడ్డి కూడా ఒకరు. తనకు ఆ బాధ్యతలు ఇవ్వకున్నా పార్టీని నమ్ముకున్న వాళ్లకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే పార్టీని వీడుతానని హెచ్చరించారు. రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి ఇస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి జగ్గారెడ్డి వెళ్లిపోతారని కూడా ఊహాగానాలు వచ్చాయి. కానీ రేవంత్ నే పీసీసీ అధ్యక్షుడిగా నియమించింది హైకమాండ్. కాకపోతే జగ్గారెడ్డిని వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించింది. దీంతో అటు తిట్టలేక, ఇటు పొగడ లేక ఇబ్బందులు పడుతున్నారు.

రేవంత్ నాయకత్వం విషయంలో జగ్గారెడ్డి ముందు నుంచీ వ్యతిరేకంగానే ఉన్నారు. గజ్వేల్ లో దళిత, గిరిజన దండోరా సభను నిర్వహిస్తానన్న రేవంత్ కామెంట్లను వ్యతిరేకించారు. మెదక్ లో నిర్వహించాలని కోరారు. గాంధీ భవన్ లో జరిగే సమావేశాలకు పార్టీ ముఖ్య నేతలను పిలవాలని లెటర్ కూడా రాశారు. మొన్న రేవంత్ ఆధ్వర్యంలో మూడు చింతలపల్లిలో జరిగిన దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్షకు డుమ్మా కొట్టారు. తనకు బదులుగా తన భార్య, సంగారెడ్డి డీసీసీ అధ్యక్షురాలు నిర్మలను పంపారు. అంతకుముందు ఇంద్రవెల్లి సభకు రాలేనంటూ లేఖ రాశారు.

ఇలాంటి పరిస్థితుల్లో జగ్గారెడ్డి రాసిన లేఖలు చర్చనీయాంశమవుతున్నాయి. ఆయన రాసిన లేఖ కాంగ్రెస్ పార్టీలో స్ఫూర్తి నింపుతుందని కొందరు నేతలు వ్యాఖ్యానిస్తుండగా.. రేవంత్ విషయంలో నిరసనతోనే ఇలా వరుసగా లెటర్లు రాస్తున్నారని మరికొందరు అంటున్నారు. సెల్ ఫోన్, వాట్సాప్ యుగంలో సమాచారాన్ని క్షణంలో చేరవేయొచ్చు. కానీ పార్టీకి సంబంధించిన విషయాలను లెటర్ల ద్వారా తెలియజేడమేంటని, వాటిని మీడియాకు రిలీజ్ చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఈ లెటర్ల వ్యవహారం రానున్న రోజుల్లో ఎక్కడి దాకా వెళ్తుందో చూడాలి మరి.

Also Read : మల్లారెడ్డి, రేవంత్ రెడ్డి మధ్యలో చంద్రబాబు..?

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp