వారు తప్ప..అంతా పొలిట్‌బ్యూరో సభ్యుడ్ని అభినందించారు..!

By Voleti Divakar Oct. 22, 2020, 01:05 pm IST
వారు తప్ప..అంతా పొలిట్‌బ్యూరో సభ్యుడ్ని అభినందించారు..!

సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి రచ్చ గెలిచినా ఇంట నెగ్గుకుని రాలేకపోతున్నారా ?. పార్టీలోని ప్రత్యర్థి వర్గం గోరంట్లను పట్టించుకోకపోవడం ఈ చర్చకు దారితీస్తోంది. తెలుగుదేశం పార్టీలో అధినేత చంద్రబాబునాయుడు కన్నా సీనియర్, ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గోరంట్ల బుచ్చయ్యచౌదరికి పార్టీలో ఆశించిన గుర్తింపు, గౌరవం లభించడం లేదన్నది ఆయన అనుచరులు, పార్టీలోని ఆయన అభిమానులు మొన్నటి వరకు ఆవేదన చెందారు. ప్రజాబలం ఉన్నా పార్టీలోని ప్రత్యర్థి వర్గీయులు ఆయనను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

తాజాగా తెలుగుదేశం పార్టీ అత్యున్నత నిర్ణాయక కమిటీ పొలిట్ బ్యూరోలో గోరంట్లకు స్థానం దక్కడం పట్ల ఆయన వర్గీయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ పదవి ప్రకటించిన నాటి నుంచి గోరంట్లకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అంతర్గతంగా ఆయనను విభేదించే గుడా మాజీ చైర్మన్ గన్ని కృష్ణ కూడా గోరంట్ల నివాసానికి వెళ్లి అభినందించారు. అభినందించేందుకు వారు తప్ప అంతా వస్తున్నారు. వారు ఎవరంటే ప్రస్తుత టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కె అచ్చెంనాయుడుకు వరుసకు కుమార్తె అయ్యే రాజమహేంద్రవరం ఎమ్మెల్యే, ఆదిరెడ్డి భవానీ గానీ, ఆమె మామగారు ఆదిరెడ్డి అప్పారావు.

అప్పారావు పత్రికా ప్రకటన ద్వారా గానీ, కనీసం సామాజిక మాధ్యమాల ద్వారా కూడా గోరంట్లను అభినందించకపోవడం, శుభాకాంక్షలు తెలియజేయకపోవడం గోరంట్ల, ఆదిరెడ్డి అప్పారావు వర్గాల మధ్య ఉన్న విభేదాలకు తార్కాణంగా నిలుస్తున్నాయి.

రాజమహేంద్రవరం పార్లమెంటు అధ్యక్షుడి పదవి కోసం గుడా మాజీ చైర్మన్ గన్ని కృష్ణ కూడా పోటీలో నిలిచినా మొండి చెయ్యే ఎదురయ్యింది. మాజీ మంత్రి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన కెఎస్ జవహర్ కు ఈ పదవి దక్కింది. కనీసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి దక్కుతుందని గన్ని ఆశలు పెట్టుకున్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీలో గోరంట్ల, ఆదిరెడ్డి అప్పారావులు ప్రస్తుతం భిన్నధృవాలుగా పనిచేస్తున్నారు. ఈ రెండు వర్గాలు పార్టీ కార్యక్రమాలను వేరువేరుగా నిర్వహిస్తున్నారు.

ఉభయ గోదావరి జిల్లాలకు రాజకీయ, వాణిజ్య కేంద్రం రాజమహేంద్రవరంపై ఆధిపత్యం కోసం తెలుగుదేశం పార్టీలోని ఒకవైపు సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, మరోవైపు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు పట్టు సాధించేందుకు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు సాగిస్తున్నారు. రాజమహేంద్రవరంలోని టిడిపి రాజకీయ పోరు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది. పరస్పరం అభినందించుకోవడం, శుభాకాంక్షలు చెప్పుకునే పరిస్థితి లేని విధంగా వారి మధ్య విభేదాలు ముదిరిపోయాయని టిడిపి శ్రేణులు బాహాటంగా చెబుతున్నాయి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp