టిడిపి సంస్థాగత ఎన్నికల్లో విజేతలెవరు..?!

By Voleti Divakar Sep. 26, 2020, 11:06 am IST
టిడిపి సంస్థాగత ఎన్నికల్లో విజేతలెవరు..?!

ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీకి సంస్థాగత ఎన్నికలు సవాల్ గా మారనున్నాయి. పార్టీలోని అసంతృప్తి సంస్థాగత ఎన్నికల్లో మళ్లీ పెల్లుబుకుతుందా?. రాజమహేంద్రవరం పార్లమెంటు జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు వర్గాల్లో ఎవరు పైచేయి సాధిస్తారు?. ఈ ప్రశ్నలన్నింటికీ కొద్దిరోజుల్లోనే జవాబు దొరకుంది.

త్వరలో పార్టీ సంస్థాగత ఎన్నికలు జరగనున్నాయి. పార్టీ నూతన అధ్యక్షుడిగా కె అచ్చెంనాయుడు నియామకం దాదాపు ఖరారైనట్టేనని టిడిపి వర్గాలు చెబుతున్నాయి. ఇక సంస్థాగతంగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. రాజమహేంద్రవరం పార్లమెంటు అధ్యక్షుడిగా గుడా మాజీ చైర్మన్
గన్ని కృష్ణ, మాజీ మంత్రి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన కెఎస్ జవహర్ పోటీలో ఉన్నట్లు టిడిపి అధికార పత్రిక ఆంధ్రజ్యోతిలో వార్త ప్రచురితమైంది.

అయితే గోరంట్ల, కాబోయే పార్టీ అధ్యక్షుడికి వియ్యంకుడి వరసైన ఆదిరెడ్డి అప్పారావు ఎవరి వైపు నిలుస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. తెలుగుదేశం పార్టీలో అధినేత చంద్రబాబునాయుడు కన్నాసీనియర్, ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గోరంట్ల బుచ్చయ్యచౌదరికి పార్టీలో ఆశించిన గుర్తింపు, గౌరవం లభించడం లేదన్నది ఆయన అనుచరులు, పార్టీలోని ఆయన అభిమానుల ఆవేదన. ప్రజాబలం, సామాజిక బలం ఉన్నా అధినేత, పార్టీ బలగాలు ఆయనను చిన్నచూపు చూస్తున్నట్లు కనిపిస్తోంది. చంద్రబాబుతో సహా పార్టీలోని ప్రత్యర్థులు ఆయనను ఎంతగా అణగదొక్కాలని చూసినా అంతే బలంగా నిలదొక్కుకుంటున్నారు.

సంస్థాగత ఎన్నికల్లో ఆయన మరోసారి తన బలాన్ని చూపించాల్సిన అవసరం ఏర్పడింది. తెలుగుదేశం పార్టీలో గోరంట్ల, ఆదిరెడ్డి అప్పారావులు ప్రస్తుతం భిన్న ధృవాలుగా పనిచేస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాలకు రాజకీయ, వాణిజ్య కేంద్రం రాజమహేంద్రవరంపై ఆధిపత్యం కోసం తెలుగుదేశం పార్టీలోని ఒకవైపు సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, మరోవైపు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు రాజమహేంద్రవరంపై పట్టు సాధించేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు సాగిస్తున్నారు.

ఈవిషయంలో గుడా మాజీ చైర్మన్ గన్ని కృష్ణ పరోక్షంగా ఆదిరెడ్డి కుటుంబానికే మద్దతు ఇచ్చారు. గత ఎన్నికల్లో గన్ని కృష్ణ పార్లమెంటు సీటు ఆశించినా దక్కకపోవడం గమనార్హం. రాజమహేంద్రవరంలోని టిడిపి రాజకీయ పోరు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గోరంట్ల బుచ్చయ్యచౌదరి రాజమహేంద్రవరంపై అన్ని రంగాల్లో తిరుగులేని పట్టు సాధించారు. ఆదిరెడ్డి ఈ దిశగా ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నారు.

అయితే పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు కేబినెట్ లో పౌర సరఫరాల శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తరువాత నుంచి ఆయనకు మంత్రి పదవులు అందని ద్రాక్షగానే మారాయి. ఆగస్టు సంక్షోభ సమయంలో తనకు మద్దతునివ్వని గోరంట్లను టిడిపి అధినేత చంద్రబాబునాయుడు నమ్మటం మానేశారు. దీంతో క్రమంగా పార్టీలో గోరంట్ల ప్రాభవం తగ్గుతూ వచ్చింది. 2014 ఎన్నికల్లో ఆయనకు టిక్కెట్టు లభించడమే కష్టమన్న వ్యాఖ్యలు వినిపించాయి. రాజమహేంద్రవరంపై గోరంట్ల ఆధిపత్యానికి గండికొట్టేందుకు బలవంతంగా ఆయనను రూరల్ నియోజకవర్గానికి పంపారన్న వ్యాఖ్యలు వినిపించాయి.

మరోవైపు ఒకప్పుడు గోరంట్ల నాయకత్వంలో నగర అధ్యక్షుడిగా పనిచేసిన ఆదిరెడ్డి అప్పారావు గోరంట్లతో పొసగక వైసిపిలో చేరి ఎమ్మెల్సీ పదవిని సంపాదించారు. ఆ తరువాత ఆ పార్టీని వీడి మళ్లీ టిడిపిలో చేరారు. గోరంట్ల నుంచి వ్యతిరేకత వ్యక్తమైనా రాజమహేంద్రవరం అసెంబ్లీ సీటును తన కోడలు, ఎర్రంనాయుడు కుమార్తె భవానీకి ఇప్పించుకుని గెలిపించుకోగలిగారు.

రూరల్ ఎమ్మెల్యేగా ఉన్న గోరంట్ల రాజమహేంద్రవరం రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం ఆదిరెడ్డికి ససేమిరా ఇష్టం లేదు. అలాగే రాజమహేంద్రవరంలో తనను కాదని కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆదిరెడ్డిని నిలువరించేందుకు గోరంట్ల తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో త్వరలో జరిగే సంస్థాగత ఎన్నికల్లో ఎవరు ఎవరివైపు నిలిచి పట్టు సాధిస్తారన్నది పార్టీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. గోరంట్ల తనను బహిరంగంగా దెబ్బ కొట్టిన గన్నికి మద్దతు ఇస్తారా లేక పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన కెఎస్ జవహర్ కు పార్లమెంటు అధ్యక్ష బాధ్యతలు దక్కేలా కృషిచేస్తారా అన్నది త్వరలో తేలనుంది. అలాగే ఆదిరెడ్డి సత్తా ఏమిటో సంస్థాగత ఎన్నికల్లో బయటపడనుంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp